English | Telugu
విశాఖలో ఫోర్జరీ స్కాం తో రెచ్చిపోతున్న కేటుగాళ్లు...
Updated : Oct 31, 2019
స్మార్ట్ సిటీగా విశాఖ పరుగులు తీస్తోంది. అభివృద్ధి అలలు ఎగసిపడుతున్నాయి. మరోవైపు క్రైమ్ రేటు కూడా పరుగులు తీస్తోంది అందుకు నిదర్శనమే గుర్రాల కోటేశ్వరావు అండ్ గ్యాంగ్ ఖతర్నాక్ దందా.దొంగలు ఇళ్లను దోచుకుంటారు, కానీ ఆ గ్యాంగ్ మాత్రం దొంగలనే టార్గెట్ చేశారు. అలాగని అది బెదిరింపుల వ్యవహారం కాదు ఫోర్జరీ మంత్రం బెయిల్ కుతంత్రంగా ఉంది. బస్తా నిండా స్టాంపులు, డాక్యుమెంట్లు, వాటిపై పచ్చ సంతకాలు అలాగని ఈ గెజిటెడ్ కాగితాలన్నీ ఏ సర్కారు కార్యాలయంలో కాదు అధీకృత స్టాంప్ వెండర్ డాక్యుమెంట్ రైటర్ తాలూకువో కాదు, ఒక్క మాటలో చెప్పాలంటే వీటి వెనక పెద్ద చరిత్రే ఉంది.
సాగర తీరం స్మార్ట్ సిటీ విశాఖలో నయా దందా నడుస్తోంది. విశాఖ పోలీసులు స్మార్ట్ గా ఈ ఎవ్వారాన్ని బ్రేక్ చేశారు. న్యాయస్థానాలనే తప్పుదోవ పట్టించిన బెయిల్ గేమ్ గుట్టును రట్టు చేశారు. జైలుకెళ్లిన వాళ్ళే టార్గెట్ గా బెయిల్ బిజినెస్ ను దౌడు తీయించిన కోటన్ అండ్ గ్యాంగుకు చెక్ పెట్టారు విశాఖ పోలీసులు. అసలు ఈ గ్యాంగ్ ఎవరు వీళ్ళు ఆపరేట్ చేస్తున్న సింగిల్ విండో స్కామ్ ఏంటి అనేది చర్చనీయంగా మారింది.
రోడ్డు ప్రమాదాలు, గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టయిన నిందితులకు కోటన్ అండ్ గ్యాంగ్ కొండంత అండ. వాళ్ళు ఇలాగ డబ్బులివ్వగానే వీళ్ళు అలా బెయిల్ సంపాదించిపెడతారు. బెయిల్ తెచ్చేలా వచ్చేలా ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించడం నకిలీ ష్యూరిటీలతో మస్కా కొట్టించడం అవసరమైతే సరసమైన ధరల్లోనే డమ్మీ వ్యక్తులను ఏర్పాటు చేయడం ఈ ముఠా స్పెషాలిటీ. యాక్సిడెంట్, చోరీ గట్రా కేసులకు సింగిల్ రేటు, గంజాయి కేసు కాస్త ఘాటు ఎక్కువ కాబట్టి డబుల్ రేటు ఫిక్స్ చేస్తారు. క్యాష్ కొడితే చాలు నకిలీ ఆధార్ కార్డులు, ఫోర్జరీ సంతకాలతో ష్యూరిటీ బాండ్ లు రెడీ మేడ్ గా సిద్ధం ఐపోతాయి.
ఇలా ఎన్నో కేసుల్లో ఎందరో నిందితులకు బెయిల్ ఇప్పించారు ఈ గ్యాంగ్. సింగిల్ విండో ఫోర్జరీ స్కాంతో కేటుగాళ్లు ఇద్దరు బెయిల్ బాటలో బయటకు వచ్చి మళ్లీ నేరాలతో చెలరేగారు. ఖాకీలకు మస్కా కొట్టడమే కాదు తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించి కోర్టుల్లో సైతం తప్పుదోవ పట్టించిన కోటన్ అండ్ గ్యాంగ్ కు విశాఖ పోలీసులు చెక్ పెట్టారు. తీగ లాగితే డొంకంతా బయటపడింది. అసలు ఈ కోటన్ అండ్ గ్యాంగ్ ఫోర్జరీ స్కాం ఎన్ని రోజులుగా సాగుతోంది, వీళ్ల వెనుక అదృశ్య వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా అనేది పోలీసులు దర్యప్తులో తేలాల్సిన అంశాలు.