ఏపీలో ఇప్పటికే పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదు కాగా, కొందరు టీడీపీ నేతలు అరెస్టైన సంగతి తెలిసిందే. తాజాగా, మరో టీడీపీ నేత అరెస్ట్ కు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. టీడీపీ నేత పట్టాభిరామ్ ఇంటి వద్ద కొందరు పోలీసుల పహారా కాస్తున్నారు. ఆయనను ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకునే అవకాశముందని సమాచారం. 108 అంబులెన్స్‌ల కొనుగోళ్లలో రూ.300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని పట్టాభిరామ్ ఆరోపించారు. ఆ కొనుగోళ్లకు సంబంధించిన పత్రాలను కూడా ఆయన మీడియా సాక్షిగా చూపించారు. గత కాంట్రాక్ట్‌ను తప్పించి.. ఎంపీ విజయసాయిరెడ్డి బంధువర్గాలకు 108 అంబులెన్స్‌ల కాంట్రాక్టును కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై సీఎం, ఆరోగ్యమంత్రి సమాధాం చెప్పాలని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారనే నెపంతో పట్టాభిరామ్ ని అరెస్ట్ చేసేందుకు జగన్ సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఇదే అంశంపై టీడీపీ నేత దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా స్పందించారు. "తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి మా నాయకులని కార్యకర్తలని అరెస్టులు చేస్తున్నారు. 108 అంబులెన్సుల కుంభకోణం 300 కోట్లు సాక్ష్యాలతో సహా బయటపెట్టాం. బాద్యులయిన మీపార్టీ నాయకుల మీద వారి బంధువుల మీద ఏంచర్యలు తీసుకుంటున్నారో ప్రజలకి సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు." అని దేవినేని ట్వీట్ చేశారు.