English | Telugu

తెలంగాణకు రావాల్సిన కోబాస్‌ యంత్రాన్ని కోల్‌కతాకు తరలించిన కేంద్రం!!

దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. కరోనా విషయంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని, కరోనా పరీక్షలు చాలా తక్కువగా చేస్తోందని జేపీ నడ్డా విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉంటే, తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా నిర్వహించడానికి ఓ రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా కారణమైందనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణలో కరోనా పరీక్షలు సరిగా చేయడం లేదన్న విమర్శలకు చెక్‌ పెట్టవచ్చన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్ఆర్‌) కింద 'కోబాస్‌ 8800' అనే యంత్రాన్ని బుక్‌ చేసింది. అమెరికాకు చెందిన రోచే కంపెనీ ఈ యంత్రాన్ని తయారు చేసింది. మంత్రి కేటీఆర్‌ రాంకీ సంస్థతో మాట్లాడి సీఎస్ఆర్‌‌ కింద ఈ యంత్రాన్ని తెప్పించాలని కోరారు. దాంతో ఆ సంస్థ ‘కోబాస్‌ 8800’ను బుక్‌ చేసింది. దాని విలువ సుమారు రూ.7 కోట్ల ఉంటుందని తెలుస్తోంది. ఈ యంత్రంతో 24 గంటల వ్యవధిలో ఏకంగా 5వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని సమాచారం.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం అమెరికా నుంచి తెప్పించిన కోబాస్‌ 8800 యంత్రంపై కేంద్రం కన్ను పడిందట. కోబాస్‌ 8800‌ యంత్రం 4 రోజుల క్రితమే చెన్నైకి చేరింది. దీని కోసం హైదరాబాద్ నిమ్స్‌లో భారీ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒకటి తలిస్తే.. కేంద్ర ప్రభుత్వం మరొకటి తలిచింది. చెన్నై చేరిన కోబాస్‌ 8800 యంత్రాన్ని కేంద్రం కోల్‌కతాకు తరలించిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కూడా ధ్రువీకరించారు. రాష్ట్రం కోసం తీసుకొచ్చిన యంత్రాన్ని కోల్ కతాకు తీసుకెళ్లే విషయంలో కేంద్రం కీలకంగా వ్యవహరించిందని.. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం హుందాగా వ్యవహరించినట్లుగా ఈటెల వ్యాఖ్యానించారు.

తెలంగాణతో పోలిస్తే.. పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వారికి ఆ యంత్రం తో అవసరం ఎక్కువగా ఉంటుందన్న మాట కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రావటంతో.. హైదరాబాద్ కు రావాల్సిన యంత్రం.. కోల్ కతాకు వెళ్లిపోయిందని తెలుస్తోంది. ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి కూడా తెలంగాణ కోసం సీఎస్ఆర్‌ కింద కోబాస్‌ 8800 యంత్రాన్నే బుక్‌ చేశారు. ఆ రెండు యంత్రాలతోపాటు రాష్ట్రంలో సీసీఎంబీ, ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌లలో కలిపి రోజుకి సుమారు 15 వేల టెస్టులు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే, కేంద్రం మాత్రం ఒక రాష్ట్రానికి రెండు యంత్రాలు ఎందుకంటూ ఒక యంత్రాన్ని కేసులు ఎక్కువగా బెంగాల్ కి తరలించిందని సమాచారం. కాగా, ఈ విషయాలన్ని బీజేపీ అధ్యక్షుడు నడ్డా తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన క్రమంలో బయటకు రావటం గమనార్హం. ఓ వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు వచ్చే యంత్రాన్ని వేరే రాష్ట్రానికి తీసుకెళ్తే, మరోవైపు ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని చర్చలు మొదలయ్యాయి.