English | Telugu

షాకింగ్‌.. చిరంజీవి సినిమాలో మంచు మనోజ్‌ విలన్‌?

చిత్ర పరిశ్రమలోని నటీనటుల సినీ జీవితాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతుంటాయి. కొందరు హీరో అవ్వాలని వస్తారు. కానీ, విలన్‌గా రాణిస్తారు. ఆ తర్వాత మళ్ళీ హీరోగా కొనసాగుతారు. మంచు మోహన్‌బాబు కెరీర్‌ అలాగే సాగింది. మొదట హీరోగా పరిచయమై ఆ తర్వాత విలన్‌గా మారారు. ‘ప్రతిజ్ఞ’ చిత్రంతో మళ్ళీ హీరోగా కొన్ని సినిమాల్లో చేసిన తర్వాత మళ్ళీ విలన్‌గా కూడా ఆయన నటించారు. ఇప్పుడు ఆయన రెండో తనయుడు మంచు మనోజ్‌ కెరీర్‌ కూడా అలాంటి టర్న్‌ తీసుకుంది. హీరోగా చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో అతని కెరీర్‌ బిల్డప్‌ అవ్వలేదు. తాజాగా తేజ సజ్జ హీరోగా వచ్చిన ‘మిరాయ్‌’ చిత్రంలో విలన్‌గా మహాబీర్‌ లామా పాత్రలో విజృంభించాడు.

ఎనిమిదేళ్ళపాటు సినిమాలు చేయకుండా ఉన్న మనోజ్‌.. ‘భైరవం’ చిత్రంతో మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా విడుదలైన ‘మిరాయ్‌’ మనోజ్‌కి ఒక కొత్తదారి చూపించింది. ఇటీవలికాలంలో వ్యక్తిగత కారణాల వల్ల అనేక టెన్షన్లకు గురైన మనోజ్‌కి ఈ సినిమా మంచి ఊపునిచ్చింది. ‘మిరాయ్‌’ తర్వాత మనోజ్‌కి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి నటించే సినిమాలో మనోజ్‌ విలన్‌గా కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మనోజ్‌కి వస్తున్న అప్రిసియేషన్‌ చూస్తుంటే ఈ వార్తలో ఎంతో కొంత నిజం ఉందనే అభిప్రాయం అందరికీ కలుగుతోంది.

2023లో మెగాస్టార్‌ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్‌ను రూపొందించిన బాబీ.. మెగాస్టార్‌ కాంబినేషన్‌లో మరో సినిమా చెయ్యబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని విజయదశమి రోజున ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘మిరాయ్‌’ చిత్రంలో అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చిన మనోజ్‌ని విలన్‌గా తీసుకోవాలని బాబీ ఆలోచిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో విలన్‌ క్యారెక్టర్‌ ఎంతో కీలకంగా ఉంటుందని, దానికి మనోజ్‌ అయితే పూర్తి న్యాయం చెయ్యగలడని బాబీ నమ్ముతున్నాడని తెలుస్తోంది. ‘మిరాయ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ని అందించిన కార్తీక్‌ ఘట్టమనేని.. మెగాస్టార్‌ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తాడని సమాచారం. మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో మంచు మనోజ్‌ విలన్‌గా నటించనున్నాడనే వార్తలో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్‌ చెయ్యక తప్పదు. `