English | Telugu

వెంకీ కోసం క్యూ కట్టిన హీరోయిన్లు.. ఎవరిని ఫైనల్‌ చేస్తారో?

రైటర్‌గా వెంకటేష్‌కి నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి వంటి సూపర్‌ హిట్స్‌ ఇచ్చిన త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని ప్రేక్షకులు ఎప్పటినుంచో వెయిట్‌ చేస్తున్నారు. ఎట్టకేలకు వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాను ఎనౌన్స్‌ చేశారు. త్రివిక్రమ్‌ చేసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన హీరో వెంకటేష్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే.. అది ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి చక్కని వినోదాన్ని పంచుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ ఏడాది ప్రారంభంలోనే సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ సాధించిన వెంకటేష్‌తో సినిమాలు చేసేందుకు యంగ్‌ డైరెక్టర్లు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌తో వెంకటేష్‌ సినిమాను ఎనౌన్స్‌ చేశారు. ఇటీవలి కాలంలో యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌తో ఉన్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన త్రివిక్రమ్‌ మరోసారి వెనక్కి వెళ్లి ఓ ఫ్యామిలీ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. త్రివిక్రమ్‌ రాసే పంచ్‌ డైలాగులకు చక్కని టైమింగ్‌తో పెర్‌ఫార్మ్‌ చేసే వెంకటేష్‌కి తగిన కథను సిద్ధం చేశారు.

ఈ సినిమాలో వెంకటేష్‌ సరసన నటించే హీరోయిన్‌ ఎవరు అనేది ఇప్పటివరకు ఫైనల్‌ చెయ్యలేదు. రోజుకో హీరోయిన్‌ పేరు వినిపిస్తోంది. ఎవరు ఫైనల్‌ అయ్యారు అనే విషయం మేకర్స్‌ ఎనౌన్స్‌ చెయ్యాల్సి ఉంది. మొదట రుక్మిణి వసంత్‌ పేరు వినిపించింది. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకీ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించిన మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారనే టాక్‌ వినిపిస్తోంది. అయితే వెంకీ సరసన నటించే హీరోయిన్లలో శ్రద్ధా దాస్‌, నేహా శెట్టి, శ్రీనిధి శెట్టి పేర్లను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఎవర్ని ఫైనల్‌ చేశారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాకి వెంకటరమణ కేరాఫ్‌ ఆనంద నిలియం, అలివేలు వెంకటరత్నం అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్‌ నెలాఖరులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈలోగా అన్ని వివరాలను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.