English | Telugu

ఒకేరోజు బరిలోకి దిగుతున్న పవన్‌కళ్యాణ్‌, విజయ్‌ దేవరకొండ.. గెలుపెవరిది?

ఒకేరోజు బరిలోకి దిగుతున్న పవన్‌కళ్యాణ్‌, విజయ్‌ దేవరకొండ.. గెలుపెవరిది?

సినిమాలకు పండగలు, సమ్మర్‌ సీజన్‌ ఎంతో ముఖ్యమైనవి. స్టార్‌ హీరోలు, దర్శకనిర్మాతలు ఈ సీజన్లలో తమ సినిమాలు రిలీజ్‌ అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆ సమయంలో అయితే భారీ కలెక్షన్స్‌తో థియేటర్లు కళకళలాడుతూ ఉంటాయని వారి ఉద్దేశం. అందుకే చాలా సందర్భాల్లో హీరోల సినిమాలకు రిలీజ్‌ క్లాషెస్‌ వస్తుంటాయి. వాటిని అధిగమించేందుకు ఒకటి, రెండు వారాల గ్యాప్‌లో తమ సినిమాలు రిలీజ్‌ చేసుకునేలా ప్లాన్‌ చేసుకుంటారు. కానీ, కొన్ని సినిమాల విషయంలో ఈ వెసులుబాటు తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, విజయ్‌ దేవరకొండ సినిమాల రిలీజ్‌కి అలాంటి పరిస్థితే వచ్చింది. రిలీజ్‌ వాయిదా పడుతూ వచ్చిన ఈ రెండు సినిమాలను ఓటీటీ సంస్థల ఒత్తిడి వల్ల ఒకేరోజు రిలీజ్‌ చెయ్యాల్సి వస్తోందని సమాచారం. 

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని చేయబోతున్నట్టు నిర్మాత ఎ.ఎం.రత్నం, దర్శకుడు క్రిష్‌ 2020 జనవరిలో ఎనౌన్స్‌ చేశారు. అయితే కోవిడ్‌ కారణంగా షూటింగ్‌ ప్రారంభం కాలేదు. ఆ తర్వాత పవన్‌కళ్యాణ్‌ పొలిటికల్‌ ఎంట్రీ వల్ల సినిమా ప్రారంభం కావడానికి మరింత జాప్యం జరిగింది. కొన్ని కారణాల వల్ల డైరెక్టర్‌ క్రిష్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారు. సినిమాను పూర్తి చేసే బాధ్యతను ఎ.ఎం.రత్నం కుమారుడు ఎ.ఎం.జ్యోతికృష్ణ తన భుజాన వేసుకున్నారు. 
చాలా గ్యాప్‌ల మధ్యలో షూటింగ్‌ను పూర్తి చేశారు. షూటింగ్‌ పలుమార్లు వాయిదా పడినట్టే సినిమా రిలీజ్‌ను కూడా లెక్కకు మించిన సార్లు పోస్ట్‌పోన్‌ చేశారు. ఫైనల్‌గా జూన్‌ 12న చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు మరోసారి రిలీజ్‌ వాయిదా పడిరది. జూలై 25న ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తారని వార్తలు వస్తున్నాయి. 

ఇక గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ చేస్తున్న ‘కింగ్‌డమ్‌’ సినిమా కూడా అనేక కారణాల షూటింగ్‌లో జాప్యం జరుగుతూ వచ్చింది. అలాగే రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేయడం, క్యాన్సిల్‌ చేయడం అనేది కూడా చాలాసార్లు జరిగింది. ఇదిలా ఉంటే.. ఈ రెండు సినిమాల డిజిటల్‌ రైట్స్‌ తీసుకున్న ఓటీటీ సంస్థలు ఈ సినిమా మేకర్స్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నాయని తెలుస్తోంది. జూలై నెలలో ఎట్టి పరిస్థితుల్లో సినిమాలను రిలీజ్‌ చెయ్యాలని హుకుం జారీ చేస్తున్నాయని సమాచారం. ఎందుకంటే చాలా పెద్ద మొత్తాన్ని చెల్లించి ఈ సినిమాల రైట్స్‌ను ఆ సంస్థలు తీసుకున్నాయి. దాంతో జూలైలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు సినిమాలను రిలీజ్‌ చెయ్యాలని ఆ సంస్థలు చెబుతున్నాయట. కనీసం ఒక వారం గ్యాప్‌ ఉంటే బాగుంటుందని ఈ రెండు సినిమాల నిర్మాతలు భావిస్తున్నారు. అయితే తమ సినిమాల రిలీజ్‌ డేట్స్‌ను హరిహర వీరమల్లు, కిండ్‌డమ్‌ నిర్మాతలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ఒక వారం లోపు ఈ సినిమాల రిలీజ్‌ డేట్స్‌ ఎనౌన్స్‌ చేసే అవకాశం ఉంది. జూలై 25న ఈ సినిమాలను రిలీజ్‌ చేస్తారా లేక ఓటీటీ సంస్థలతో చర్చించి తమకు అనుకూలంగా ఉండే డేట్స్‌లో రిలీజ్‌ చేస్తారా అనేది చూడాలి.