English | Telugu

ఇక పూరి జగన్నాథ్‌ని ఆపడం కష్టమే.. లైనప్‌ అలా ఉంది మరి!

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌తో చేసిన తొలి సినిమా ‘బద్రి’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించారు పూరి జగన్నాథ్‌. ఈ సినిమాతో డిఫరెంట్‌ మూవీస్‌ చేసే డైరెక్టర్‌ ఇండస్ట్రీకి వచ్చాడన్న పేరు తెచ్చుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా ఎవరూ టచ్‌ చేయని సబ్జెక్ట్స్‌తో చేసి ఆ పేరును నిలబెట్టుకున్నారు. ఒక దశలో టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌ అనిపించుకున్న పూరికి వరసగా ఫ్లాప్స్‌ రావడంతో వెనకపడ్డారు. రామ్‌తో చేసిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో బ్లాక్‌బస్టర్‌ సాధించి ఫామ్‌లోకి వచ్చారు. అయితే ఆ తర్వాత చేసిన ‘లైగర్‌’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రాలు ఘోర పరాజయాన్ని చవిచూశాయి.

ఆ సినిమాల తర్వాత పూరి ఎవరితో సినిమాలు చేస్తారు అనే చర్చ మొదలైంది. హీరోలెవరూ అతనితో సినిమా చేసేందుకు సిద్ధంగా లేరనే ప్రచారం కూడా జరిగింది. పూరి మాత్రం ఈసారి చేసే సినిమాతో ఫామ్‌లోకి రావాలని గట్టిగా డిసైడ్‌ అయ్యారు. దాని కోసం ఒక కొత్త కాంబినేషన్‌ని సెట్‌ చేసుకున్నారు. తమిళ్‌తోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉన్న విజయ్‌ సేతుపతితో ఒక సినిమా ప్లాన్‌ చేశారు. ఆల్రెడీ షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా బాగా వస్తోందనే టాక్‌ వినిపిస్తోంది. పూరి కూడా తను చేస్తున్న ఈ సినిమా పట్ల ఫుల్‌ శాటిస్‌ఫ్యాక్షన్‌తో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ‘బెగ్గర్‌’, ‘భవతీ భిక్షాందేహీ’ అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.

విజయ్‌ సేతుపతితో చేస్తున్న సినిమా సెట్స్‌పై ఉండగానే మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టే ప్రయత్నంలో పూరి ఉన్నట్టు తెలుస్తోంది. ఒక సినిమాలో శివకార్తికేయన్‌గానీ, సూర్యగానీ నటించే అవకాశం ఉంది. మరో సినిమా టాలీవుడ్‌లోని ఒక యంగ్‌ హీరోతో చేస్తారని సమాచారం. పూరి గతంలో చేసిన సినిమాల ద్వారా యూత్‌లో ఎంత ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చేందుకే ఒక యూత్‌ బేస్డ్‌ సబ్జెక్ట్‌తో సినిమా చెయ్యబోతున్నారని తెలుస్తోంది. మరో విశేషం ఏమిటంటే.. విజయ్‌ సేతుపతి ప్రాజెక్ట్‌ సెట్‌లో ఉండగానే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఎనౌన్స్‌మెంట్స్‌ వచ్చే ఛాన్స్‌ ఉందట. మరి ఈ సినిమాలతో పూరి తన గత వైభవాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటారా లేదా అనేది చూడాలి.