English | Telugu
అదంతా ఫేక్ న్యూస్.. తేల్చేసిన నితిన్. ఇంతకీ ఏమిటది?
Updated : Sep 16, 2025
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకటి, రెండు ఫ్లాపులు వచ్చాయంటే.. ఆ హీరోని, డైరెక్టర్‌ని ఎవరూ చూడరు, అవకాశాలు ఇవ్వరు. కానీ, హీరో నితిన్‌కి మాత్రం హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు వస్తూనే ఉంటాయి. దానికి ఉదాహరణ రాజమౌళి కాంబినేషన్‌లో నితిన్ చేసిన ‘సై’ చిత్రం పెద్ద విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత నితిన్ చేసిన 12 సినిమాలు వరసగా ఫ్లాప్ అయ్యాయి. మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో చేసిన ‘ఇష్క్’ రూపంలో హిట్ వచ్చింది. ఆ తర్వాత ఒకటి, రెండు హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు చేస్తూ వస్తున్న నితిన్‌కి 2020లో వచ్చిన భీష్మ మంచి హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత నితిన్ కెరీర్‌లో మామూలుగానే ఫ్లాప్‌ల పరంపర మొదలైంది. వరసగా 7 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందులో ‘మేస్ట్రో’ మాత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయింది.
నితిన్‌కి వచ్చిన వరస ఫ్లాపుల్లో రాబిన్‌హుడ్ అతని కెరీర్‌లోనే భారీ నష్టాలు తెచ్చిన పెట్టిన సినిమాగా నిలిచింది. ఈ ఫ్లాపుల కారణంగా విక్రమ్ కె.కుమార్, బలగం వేణు కాంబినేషన్‌లో చేయబోతున్న సినిమాలు అతని చేతి నుంచి జారిపోయాయి. బలగం వంటి డీసెంట్ హిట్ తర్వాత వేణు చేయబోతున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో నితిన్ హీరో అని ఇదివరకే ప్రకటించారు. అలాగే నితిన్‌కి ‘ఇష్క్’ వంటి పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్‌తో ‘స్వారీ’ అనే సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడా రెండు సినిమాల నుంచి నితిన్‌ను పక్కకు తప్పించారని తెలుస్తోంది. ‘ఎల్లమ్మ’ చిత్రంలో శర్వానంద్‌ని తీసుకున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే.. నితిన్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమా నిర్మించబోతోంది అనే వార్త కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతోంది. మహేష్‌బాబుతో చేసిన ఆగడు చిత్రంతో శ్రీను వైట్ల ఫ్లాపుల పరంపర మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు అతనికి హిట్ అనేది లేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే అందరూ షాక్ అయ్యారు. అయితే ఈ వార్త నిజం కాదని, శ్రీను వైట్ల కాంబోలో సినిమానే లేదని నితిన్ కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న న్యూస్. కొంత గ్యాప్ తీసుకొని మంచి సినిమాతో వస్తాడని తెలుస్తోంది. మైత్రీ మూవీస్‌లో శ్రీను వైట్ల ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. అయితే అది నితిన్‌తో కాదనేది తాజా సమాచారం.