English | Telugu

16 ఏళ్ళ తర్వాత రీమేక్‌ అవుతున్న ‘అరుంధతి’.. జేజెమ్మ ఎవరో తెలుసా?

2009లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నిర్మించిన సెన్సేషనల్‌ మూవీ ‘అరుంధతి’. టాలీవుడ్‌లోని టాప్‌ హీరోల సినిమాల స్థాయిలో ఈ సినిమా కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ సినిమాతో అనుష్క స్టార్‌ హీరోయిన్‌ అయిపోయారు. ఈ సినిమాలోని ఆమె లుక్‌, నటన ఒక రేంజ్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. తెలుగులోనే కాదు, తమిళ్‌లోనూ ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఈ సినిమాను హిందీలో రీమేక్‌ చెయ్యబోతున్నారంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. అయితే అవి మెటీరియలైజ్‌ కాలేదు. ఇప్పుడు మరోసారి ‘అరుంధతి’ హిందీలో రీమేక్‌ చెయ్యబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఈ న్యూస్‌ బయటికి రానప్పటికీ ఇండియన్‌ సినిమా సర్కిల్స్‌లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళితే... తమిళ డైరెక్టర్‌ ఎ.మోహన్‌రాజా రీమేక్స్‌ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో సూపర్‌హిట్‌ అయిన ఎన్నో సినిమాలను ఆయన తమిళ్‌లో రీమేక్‌ చేసి హిట్‌ కొట్టారు. ఇప్పుడు అరుంధతి చిత్రాన్ని 16 ఏళ్ళ తర్వాత రీమేక్‌ చెయ్యబోతున్నారనే వార్త వినిపిస్తోంది. అయితే దీన్ని తమిళ్‌లో కాకుండా హిందీలో రీమేక్‌ చెయ్యాలనేది మోహన్‌రాజా ఆలోచన అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే అరుంధతి హిందీ డబ్డ్‌ వెర్షన్‌ డిజిటల్‌ మీడియాలో అందుబాటులో ఉంది. అయినప్పటికీ రీమేక్‌ చెయ్యాలని మోహన్‌రాజా ఎందుకు అనుకుంటున్నారో తెలీదు. ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. అరుంధతి చిత్రాన్ని ఆమెతో రీమేక్‌ చేస్తారని టాక్‌.

అరుంధతి చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారనే వార్త అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నప్పటికీ జేజెమ్మ క్యారెక్టర్‌లో శ్రీలీల ఎంతవరకు ఫిట్‌ అవుతుంది అనే చర్చ ఆల్రెడీ మొదలైంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో శ్రీలీల మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అరుంధతి చిత్రాన్ని అదే పేరుతో 2014లో బెంగాలీలో రీమేక్‌ చేశారు. సుజిత్‌ మండల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కోయిల్‌ మలిక్‌ ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. చాలా సంవత్సరాల గ్యాప్‌ తీసుకొని రీమేక్‌ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది ‘ఛత్రపతి’ ఆల్రెడీ ప్రూవ్‌ చేసింది. 2005లో ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్‌ సినిమా ‘ఛత్రపతి’ని హిందీలో అదే పేరుతో 2023లో బెల్లంకొండ శ్రీనివాస్‌తో రీమేక్‌ చేశారు వి.వి.వినాయక్‌. ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 2009లో రిలీజ్‌ అయిన అరుంధతి చిత్రాన్ని ఇప్పుడు రీమేక్‌ చేయడం అనేది సాహసంతో కూడుకున్న నిర్ణయమనే చెప్పాలి. సోషల్‌ మీడియాలో, మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్‌లో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్‌ చెయ్యక తప్పదు.