English | Telugu
బిగ్ సర్ ప్రైజ్.. 'SSMB29'లో జూనియర్ ఎన్టీఆర్!
Updated : Sep 14, 2025
ప్రస్తుతం ఇండియాలో రూపొందుతోన్న భారీ సినిమాల్లో 'SSMB29' ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రమిది. కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. అక్టోబర్ 10 వరకు జరగనున్న ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక సెన్సేషనల్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ అతిథి పాత్రలో మెరవనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్, రాజమౌళి మధ్య మంచి అనుబంధముంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'స్టూడెంట్ నెం.1'తోనే రాజమౌళి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత వీరి కలయికలో సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ సినిమాలు వచ్చాయి. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రత్యేక అభిమానముంది. రాజమౌళి అడగాలే కానీ.. ఎన్టీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా గెస్ట్ రోల్ చేస్తాడు. పైగా మహేష్ తో కూడా ఎన్టీఆర్ కి మంచి బాండింగ్ ఉంటుంది. అందుకే 'SSMB29'లో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ అనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ.. నిజమైతే మాత్రం, 'SSMB29'పై మరింత హైప్ వస్తుంది అనడంలో సందేహం లేదు.