English | Telugu

అఖిల్‌ అక్కినేని.. ఎంగేజ్‌మెంట్‌ సీక్రెట్‌గా చేసుకున్నాడు.. పెళ్లి కూడా అంతేనా?

1980 దశకం నుంచి హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లలో వివాహాలు అంతగా కలిసిరాని కుటుంబం నాగార్జునదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నాగార్జున మొదలుకొని అఖిల్‌ వరకు అందరూ పెళ్లి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. నాగార్జున విషయమే తీసుకుంటే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి అమలను వివాహం చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు అన్యోన్యమైన జంటగా నాగార్జున, అమల పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నాగచైతన్య వివాహం సమంతతో జరిగింది. కొన్నాళ్లు సజావుగానే సాగిన వీరి వైవాహిక జీవితం విడాకులతో ముగిసింది. ఇటీవల నాగచైతన్య వివాహం శోభితతో జరిగిన విషయం తెలిసిందే. నాగచైతన్య కంటే ముందు 2016లో అఖిల్‌ వివాహం ప్రముఖ వ్యాపార వేత్త జి.వి.కృష్ణారెడ్డి మనవరాలు శ్రీయా భూపాల్‌తో నిశ్చయమైంది. వీరి ఎంగేజ్‌మెంట్‌ ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో 2017లో ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నారు.

7 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జుల్ఫీ రవ్ద్‌జీ కుమార్తె జైనాబ్‌ రవ్ద్‌జీతో ప్రేమాయణం నడిపారు అఖిల్‌. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో గత ఏడాది నవంబర్‌ 26న ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. నాగచైతన్య, శోభిత వివాహ సమయంలోనే వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకుండా చాలా సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ జరుపుకున్నారు. పెళ్లి ఎప్పుడు అనేది కూడా ఎక్కడా రివీల్‌ చెయ్యలేదు. అఖిల్‌, జైనాబ్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కి ప్లాన్‌ చేసుకుంటున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అక్కినేని ఫ్యామిలీ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు జూన్‌ 6న అఖిల్‌, జైనాబ్‌ వివాహం జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలుపెట్టేశారని సమాచారం.

వీరి వివాహంపై రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. పెళ్లి హైదరాబాద్‌లోనే జరుగుతుందని కొందరంటుంటే, రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో ప్లాన్‌ చేశారని మరికొందరు అంటున్నారు. వీరి వివాహంపై సోషల్‌ మీడియాలో చర్చలు బాగా జరుగుతున్నాయి. ఎంగేజ్‌మెంట్‌ సీక్రెట్‌గా చేసుకున్నారు, ఇప్పుడు పెళ్లి కూడా సీక్రెట్‌గానే చేసుకోబోతున్నారనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలో నిజం ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే జూన్‌ 6న పెళ్ళి జరుగుతుంది అనుకుంటే ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉంది. అక్కినేని ఫ్యామిలీ దీనిపై ఎలాంటి హడావిడి చేయడం లేదు అంటే ఎంగేజ్‌మెంట్‌లాగే అఖిల్‌ పెళ్ళి కూడా రహస్యంగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.