English | Telugu
టాలీవుడ్ లో ఎవరూ ఊహించని కాంబినేషన్ లో మూవీ!
Updated : Oct 16, 2025
టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రాబోతుందా? వరుస ఫ్లాప్స్ లో ఉన్న హీరో నితిన్, మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్ వీఐ ఆనంద్ చేతులు కలపబోతున్నారా? అంటే ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది.
2020లో వచ్చిన 'భీష్మ' తర్వాత నితిన్ హిట్ చూడలేదు. వరుసగా ఆరు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ చూశాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గత చిత్రం 'తమ్ముడు' కూడా నిరాశపరిచింది. దీంతో నితిన్ లైనప్ మారిపోతోంది. 'బలగం' ఫేమ్ వేణుతో చేయాల్సిన 'ఎల్లమ్మ' వేరే హీరోకి వెళ్ళిపోయింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తలపెట్టిన 'స్వారీ'కి బ్రేక్ లు పడ్డాయి. సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్లతో అనుకున్న ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఆగిపోయింది. దీంతో నితిన్ నెక్స్ట్ మూవీ ఏంటనే సస్పెన్స్ నెలకొంది. ఇటీవల 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ సాయి మార్తాండ్ ఓ కథ చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు మరో క్రేజీ డైరెక్టర్ వీఐ ఆనంద్ పేరు తెరపైకి వచ్చింది.
టాలీవుడ్ లో ప్రతిభగల దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు ఆనంద్. అయితే ఆయన కెరీర్ లో కమర్షియల్ సక్సెస్ లు తక్కువే. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మాత్రమే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గత చిత్రం 'ఊరు పేరు భైరవకోన' కూడా ఆశించిన స్థాయి సక్సెస్ చూడలేదు. ఇక ఇప్పుడు ఆనంద్ తన నెక్స్ట్ ఫిల్మ్ కోసం నితిన్ తో చేతులు కలపబోతున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. మరి ఈ మూవీ.. ఇద్దరికీ కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందేమో చూడాలి.