English | Telugu
ఎన్టీఆర్ ని కలిసిన లోకేష్.. తెరవెనుక ఏం జరుగుతోంది..?
Updated : Sep 11, 2025
ఇటీవల బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' మూవీ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్.. వచ్చే ఏడాది జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత 'దేవర-2'తో పాటు, త్రివిక్రమ్ ప్రాజెక్ట్, నెల్సన్ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు తెరపైకి వచ్చింది. (Lokesh Kanagaraj)
కోలీవుడ్ లో తక్కువ సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు లోకేష్ కనగరాజ్. 'ఖైదీ', 'మాస్టర్', 'విక్రమ్' వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. గత చిత్రం 'కూలీ' డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. రూ.500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సర్ ప్రైజ్ చేసింది. వేగంగా సినిమాలు చేస్తాడనే పేరున్న లోకేష్.. నెక్స్ట్ ఏ సినిమాని మొదలు పెడతాడనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ప్రస్తుతం లోకేష్ లైనప్ లో రజినీకాంత్-కమల్ హాసన్ ల మల్టీస్టారర్, ఖైదీ-2 ఉన్నాయి. ఆమిర్ ఖాన్ తో తలపెట్టిన సూపర్ హీరో ఫిల్మ్ ఆగిపోయిందని వార్తలొస్తున్నాయి. అదే సమయంలో మరో ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే లోకేష్ ఇటీవల ఎన్టీఆర్ ని కలిసి ఓ స్టోరీ వినిపించాడట. కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పినట్లు న్యూస్ వినిపిస్తోంది.
టాలీవుడ్ లో ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోలతో లోకేష్ సినిమాలు చేయనున్నాడని గతంలో వార్తలు వినిపించాయి. అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ కి లోకేష్ కథ వినిపించాడన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎన్టీఆర్-లోకేష్ కాంబినేషన్ మూవీ ఇప్పట్లో మొదలయ్యే అవకాశం మాత్రం కనిపించట్లేదు. ఇద్దరి కమిట్మెంట్స్ పూర్తి కావడానికి కనీసం రెండు మూడేళ్లు పడుతుంది. ఆ తర్వాతే వీరి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.