English | Telugu
లోకేష్ కనకరాజ్‌కు షాక్.. కూలీ రిజల్ట్‌తో ఆ స్టార్ హీరో ప్రాజెక్ట్ క్యాన్సిల్!
Updated : Sep 11, 2025
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో డైరెక్టర్‌గా ఒక డిఫరెంట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న లోకేష్ కనకరాజ్.. తన తర్వాతి ప్రాజెక్ట్‌ను సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో అని ఎనౌన్స్ చేసిన నాటి నుంచి ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘కూలీ’ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ వచ్చింది. రన్ పూర్తయ్యే సరికి అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాకి 50 కోట్ల నష్టం వచ్చిందని తెలుస్తోంది. ఇప్పటివరకు లోకేష్ చేసిన సినిమాల్లో ఇదే నష్టపరిచిన సినిమా అని చెప్పాలి.
ఇదిలా ఉంటే.. కూలీ సినిమా ప్రారంభం కావడానికి ముందే బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్, లోకేష్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. ఒక సూపర్‌హీరో కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని అఫీషియల్‌గా న్యూస్ వచ్చింది. ‘ఖైదీ2’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని టాక్ వినిపించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమిర్, లోకేష్ కాంబినేషన్‌లో సినిమా లేకపోవచ్చని సమాచారం. దానికి కారణం కూలీ చిత్రమేనని తెలుస్తోంది. కమల్‌హాసన్‌తో లోకేష్ చేసిన విక్రమ్ చిత్రంలో సూర్య రోలెక్స్ క్యారెక్టర్ చేసిన విషయం తెలిసిందే. ఇది సూర్యకు చాలా మంచి పేరు తెచ్చింది. కూలీ చిత్రంలో తను చేసిన క్యారెక్టర్‌కి కూడా అదే స్థాయి అప్రిషియేషన్ ఉంటుందని భావించిన ఆమిర్‌కి నిరాశే మిగిలింది. వాస్తవానికి అది ఆమిర్ చెయ్యాల్సిన క్యారెక్టరే కాదు అని సాధారణ ప్రేక్షకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఖైదీ2 తర్వాత ఆమిర్‌తో సినిమా ఉంటుందని మొదటి నుంచీ అనుకుంటున్నదే. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా ఖైదీ2ని పక్కన పెట్టి రజినీకాంత్, కమల్‌హాసన్‌లతో ఓ మల్టీస్టారర్ చెయ్యబోతున్నాడు లోకేష్. దీన్నిబట్టి చూస్తే ఆమిర్‌ఖాన్ కాంబినేషన్‌లో సినిమా లేదని తెలుస్తుంది. రజినీ, కమల్ సినిమా తర్వాత కార్తీతో ఖైదీ2 చిత్రాన్ని స్టార్ట్ చేస్తారు. ఈ సినిమాలు పూర్తి కావాలంటే నాలుగు సంవత్సరాలు పడుతుంది. ఈ కమిట్‌మెంట్స్ వల్ల ఆమిర్‌తో సినిమా ఉండదనే విషయం అర్థమవుతుంది.