English | Telugu

బెల్లంకొండ చేతికి ఎల్లమ్మ.. పాన్ ఇండియా షేక్ అవుతుందా?

'బలగం'తో దర్శకుడిగా పరిచయమై, మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకున్నాడు వేణు యెల్దండి. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందింది. 'బలగం' విడుదలై రెండున్నరేళ్లు దాటిపోయింది. ఇంతవరకు వేణు కొత్త సినిమా పట్టాలెక్కలేదు. 'బలగం' తర్వాత వేణు దర్శకత్వంలో 'ఎల్లమ్మ' సినిమా ప్రకటన వచ్చింది. ఇందులో నాని నటించాల్సి ఉంది. అయితే నాని ఇతర సినిమాలతో బిజీ కావడంతో.. ఈ ప్రాజెక్ట్ లోకి నితిన్ వచ్చాడు. ఆ తర్వాత నితిన్ నుంచి శర్వానంద్ చేతికి ఈ ప్రాజెక్ట్ వెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు అనూహ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది.

దిల్ రాజు బ్యానర్ లో 'ఎల్లమ్మ' రూపొందనుంది. ఇటీవల రూరల్ బ్యాక్ డ్రాప్ లో డివోషనల్ టచ్ తో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. 'కాంతార'ను దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 'ఎల్లమ్మ'ను కూడా అదే బాటలో పాన్ ఇండియా మూవీగా రూపొందించాలని చూస్తున్నారట. అందుకే బెల్లంకొండను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. నార్త్ ప్రేక్షకులకు బెల్లంకొండ సుపరిచితమే. ఆయన నటించిన పలు సినిమాలు హిందీలో డబ్ అయ్యి, యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించాయి. అందుకే యంగ్ హీరోలలో బెల్లంకొండ మంచి ఆప్షన్ అని భావించారట.

ఇటీవల ''కిష్కిందపురి'తో మంచి విజయాన్ని అందుకున్నాడు బెల్లంకొండ. ప్రస్తుతంలో చేతిలో టైసన్ నాయుడు, హైందవ వంటి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు 'ఎల్లమ్మ'తో బెల్లంకొండ లైనప్ మరింత ఆసక్తికరంగా మారనుంది.

ఇక 'ఎల్లమ్మ'లో హీరోయిన్ గా కూడా సాయిపల్లవి, కీర్తి సురేష్, సంయుక్త మీనన్ వంటి పేర్లు వినిపించాయి. మరి హీరోయిన్ గా ఎవరు నటిస్తారో చూడాలి.