English | Telugu
లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తో నితిన్.. హిట్ కొడతాడా?
Updated : Oct 12, 2025
2020లో వచ్చిన 'భీష్మ' తర్వాత నితిన్ హిట్ చూడలేదు. ఈ ఐదేళ్ళలో వరుసగా ఆరు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ చూశాడు. ఈ ఎఫెక్ట్ నితిన్ తదుపరి ప్రాజెక్ట్ లపై పడుతోంది. ఎల్లమ్మ, స్వారీ వంటి సినిమాలు డ్రాప్ అయ్యాయి. డైరెక్టర్ శ్రీను వైట్లతో ఓ సినిమా అంటూ వార్తలొచ్చాయి కానీ, అదీ కార్యరూపం దాల్చలేదు. దీంతో అసలు నితిన్ నెక్స్ట్ మూవీ ఏంటనే సస్పెన్స్ నెలకొంది. ఇలాంటి సమయంలో ఓ క్రేజీ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది.
'లిటిల్ హార్ట్స్' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు సాయి మార్తాండ్. కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ.. ఏకంగా రూ.38 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలన విజయం సాధించింది. దీంతో సాయి మార్తాండ్ పేరు మారుమోగిపోయింది. అతనితో సినిమా చేయడానికి ఎందరో హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా నితిన్ కి సాయి మార్తాండ్ కథ వినిపించాడన్న వార్త ఆసక్తికరంగా మారింది. సాయి మార్తాండ్ చెప్పిన కథకి నితిన్ ఇంప్రెస్ అయ్యాడని, త్వరలోనే వీరి కాంబినేషన్ లో సినిమా ప్రకటన రానుందని అంటున్నారు.
'లిటిల్ హార్ట్స్' అనేది కామెడీ ఫిల్మ్. కామెడీ వర్కౌట్ అయింది కాబట్టే, ఆ రేంజ్ వసూళ్ళు వచ్చాయి. మరోవైపు నితిన్ కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. నితిన్ లాస్ట్ హిట్ 'భీష్మ' సైతం కామెడీ ప్రధానంగానే తెరకెక్కింది. అదే బాటలో ఇప్పుడు సాయి మార్తాండ్, మరో మంచి కామెడీ ఫిల్మ్ తీస్తే.. నితిన్ ఎదురుచూస్తున్న హిట్ వచ్చే అవకాశముంది.