English | Telugu
ఘంటసాల పాటలన్నింటిలో ఆ పాటంటే పీబీ శ్రీనివాస్‌కు ఎందుకు అత్యంత ఇష్టం?!
Updated : Jul 12, 2021
అమర గాయకులు ఘంటసాల వేంకటేశ్వరరావు పాడిన వేలాది పాటల్లో నచ్చిన పాటను ఒకదాన్ని ఎంచడం ఎవరికైనా చాలా కష్టతరమైన విషయం. ఒకప్పుడు మరో గొప్ప గాయకుడు పి.బి. శ్రీనివాస్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. ఆయన కూడా ఇదే ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ తనను ఎప్పుడూ వెంటాడే ఓ పాటను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ పాటను ఘంటసాల పాడిన వైనం, ఆ పాట గొప్పతనం పంచుకున్నారు.
స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో, కాకినాడలో ఒక థియేటర్‌లో 'పాతాళభైరవి' ప్రదర్శింపబడుతూ ఉన్న రోజుల్లో, మొదటిసారి ఆ చిత్రం చూసినప్పుడు లీలతో కలిసి ఘంటసాల పాడిన "ఎంతఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో.." తనకు ఎంతగానో నచ్చిన పాట అని చెప్పారు పి.బి. శ్రీనివాస్. కారణం.. ఆ రాగంలో అంతకుముందు ఆయన అంత మధురమైన బాణీ విని ఉండలేదు. రాగేశ్రీ బాణీలో సాగిన ఆ పాట ఎప్పటికీ మరపురాని పాటగా ఆయన పేర్కొన్నారు. ఆ కాలంలో రాగేశ్రీని ఎక్కువగా వాడినవారు లేరు. ఆ రాగంలో అంత మనోహరంగా వరసకట్టి ఘంటసాల ఆలపించిన వైనం అత్యద్భుతం అని ఆయన చెప్పారు.
"ఆ పాట వింటుంటే ఏదో అలా అలా గాలి అలలలో తేలి సాగుతున్నట్లనిపించేది నాకు. ఘంటల, లీల కంఠస్వర సమ్మేళనం కూడా ఆ గీతానికి ఎంతైనా తోడ్పడింది. గంభీర గాత్రాల నుండి వెలువడిన మృదుల మంజుల మోహనగానం నా మనస్సులో మార్మోగుతూ ఉండేది పొదస్తమానం. ఆ పాటలో "ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా, ప్రియురాలికి విప్పిచెప్పవే.." అని సాగే చరణంలో ఘంటసాల ప్రయోగించిన స్వరసోపానాలు స్వర్గద్వారాలని తెరచి చూపించేవి. పరమానంద సౌందర్యాన్ని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బిట్లు కూడా పాటకి అనువైన విధానంలో అమర్చడం ఘంటసాల సంగీత నిర్దేశన పాటవానికి ఉచితోపమానం." అని వెల్లడించారు శ్రీనివాస్.
ఎలక్ట్రిక్ హవైన్ గిటార్ బిట్లు చాలా అధికంగా వాడే ఆ రోజుల్లో, ఎంతవరకు వాడాలో అంతవరకే వాడి, పాటకి కొత్త అందాలు దిద్దారు ఘంటసాల. "ఇప్పటికీ ఎప్పుడన్నా రేడియోలో కానీ, గ్రామఫోన్ రికార్డులో కానీ, టేపు రికార్డరులో కానీ, ఈ పాట వినిపించిందంటే, ఒక క్షణం ఆగి, పాట అయ్యేదాకా నిలిచి, తరవాతనే ముందుకు సాగుతాను, ఏదో మేగ్నటిక్ ఎట్రాక్షన్ ఉంది ఆ పాటలో. రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్‌కు ఈ పాట ఒక మచ్చుతునక లాంటిదని నా అభిప్రాయం." అని చాలా కాలం క్రితం చెప్పుకొచ్చారు పి.బి. శ్రీనివాస్.