English | Telugu
చందా కోసం వచ్చాడనుకొని డైరెక్టర్ని దులిపేసిన చంద్రమోహన్!
Updated : Jul 12, 2021
తెలుగు చిత్రసీమ మద్రాసులో ఉన్నప్పటి మాట. ఇండస్ట్రీలో బతకలేక బతికే అనేకానేక మంది ఆర్టిస్టులు, కార్మికులు వాళ్ల పిల్లల స్కూలు ఫీజులకనీ, పుస్తకాలకనీ, ఏవో పెద్ద ఖర్చులు వచ్చాయనీ చెప్పి పెద్ద ఆర్టిస్టులు, నిర్మాతలు, దర్శకుల దగ్గరకొచ్చి చందాలు అడుగుతుండటం రివాజు. అప్పుడు.. స్కూళ్లు తెరుచుకున్నాయి. ఒకరోజు సీనియర్ నటుడు చంద్రమోహన్ (అప్పుడాయన ఎక్కువగా హీరో వేషాలు వేస్తున్నాడు.) దగ్గరకు ఈ చందాలవాళ్లు రావడం మొదలైంది. కొద్దో గొప్పో అందరికీ ఇచ్చి పంపారు. 200 రూపాయల దాకా అయ్యింది.
అంతలో ఒకాయన సాధారణమైన తెల్ల లుంగీ, జుబ్బాతో చేతిలో ఒక సంచితో వచ్చి, చంద్రమోహన్ కాళ్లకు దండంపెట్టి ఎదురుగా కూర్చున్నాడు. ఆయనెవరో గుర్తుకొచ్చింది. నెల్లూరు నుంచి వచ్చి ఏదో పత్రిక నడుపుతున్నానని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పి డబ్బు పట్టుకెళ్తుంటాడు. "ఏం ఇలా వచ్చారు? మద్రాసు వదల్లేదా, బాగా గిట్టుబాటవుతోందా? అందరి ప్రోత్సాహం ఉందన్నమాట. మీ పనే బాగుంది. అడుక్కుతినేవాడికి అరవై ఇళ్లనీ.. మీకే సమస్యా లేదు. పొద్దున్నుంచి అడ్డమైన ప్రతివాడూ తలుపు తోసుకొని రావటమే. సమాధానాలు చెప్పలేక చస్తున్నాను." అని మూడు గంటల సేపు ఆపుకున్న కోపం, విసుగు ఆయన మీద ప్రదర్శించారు చంద్రమోహన్.
ఆయన తెల్లబోయి, గభాల్న లేచి నిల్చున్నాడు. "మీ మూడ్ బాగా లేదనుకుంటాను. ఒక పిక్చర్ విషయమై మీతో మాట్లాడదామని వచ్చాను. తర్వాత మాట్లాడతాలెండి." అని వెళ్లబోయాడు. 'మీరు పిక్చర్ తీస్తారా.. అదొక్కటే తక్కువైందా మీకూ.." అనబోయి, ఎందుకో అనుమానం వచ్చి, "మీరు.. మీరు.." అని నసిగారు చంద్రమోహన్.
"అదేమిటండీ నన్ను మర్చిపోయారా.. నేను మీ 'అంబికాపతి' టీవీ సీరియల్ డైరెక్టర్‌ని. అది మధ్యలో ఆగిపోవడం మూలంగా 8 నెలల నుంచి మిమ్మల్ని కలవలేదు. ఇప్పుడు పక్కాగా స్ట్రెయిట్ పిక్చరే మీతో ప్లాన్ చేద్దామని అందరం నిర్ణయించాం. మీకు ఎప్పుడు వీలవుతుందో చెబితే, అప్పుడు వచ్చి మీ డేట్లకి అడ్వాన్స్ ఇచ్చి పోదామని మా ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు." అని చెప్పాడాయన.
చంద్రమోహన్‌కు జరిగిన పొరపాటు అర్థమైపోయింది. ఈయన ఆ నెల్లూరు పత్రికాయన అనుకొని అలా దులిపేశారన్న మాట. ఆయన్ని గుర్తుపట్టలేదని పైకి చెబితే ఫీలవుతాడు. అది మేనేజ్ చెయ్యడానికి పరిస్థితిని కామెడీగా మార్చి నానా అవస్థా పడ్డారు. ఆ తర్వాత ఆయన్ను చూసినప్పుడల్లా ఈ సంఘటనే గుర్తుకు వచ్చి నవ్వుకునేవారు చంద్రమోహన్.