Read more!

English | Telugu

బాల‌కృష్ణ - కోడి రామ‌కృష్ణ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ కాంబినేష‌న్ ఎందుకు బ్రేక్ అయ్యింది?

 

బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌కు తిరుగులేద‌నే విష‌యం 'అఖండ' మూవీతో స్ప‌ష్ట‌మైంది. 'సింహా', 'లెజెండ్' లాంటి సూప‌ర్ హిట్ సినిమాల త‌ర్వాత ఆ ఇద్ద‌రూ క‌లిసి చేసిన మూడో సినిమా 'అఖండ' మ‌రింత బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా వ‌సూళ్ల‌ను సాధించి, ఆ ఇద్ద‌రి కెరీర్‌లో టాప్ గ్రాస‌ర్‌గా నిలిచింది. ఇప్పుడు బోయ‌పాటి లాగే గ‌తంలో కోడి రామ‌కృష్ణ‌తో బాల‌కృష్ణ కాంబినేష‌న్‌కు తిరుగులేద‌నే పేరు వ‌చ్చింది.

బాల‌కృష్ణ‌, కోడి రామ‌కృష్ణ కాంబినేష‌న్ అన‌గానే 'మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు', 'ముద్దుల కృష్ణ‌య్య‌', 'మువ్వ‌గోపాలుడు', 'ముద్దుల మావ‌య్య' లాంటి సూప‌ర్ హిట్ సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. అయితే ఆ త‌ర్వాత‌ హ‌ఠాత్తుగా వారి కాంబినేష‌న్ ఆగిపోయింది. ఈ సినిమాలు నాలుగింటికీ భార్గ‌వ్ ఆర్ట్స్ అధినేత యస్‌. గోపాల్‌రెడ్డి నిర్మాత‌. ఆ త‌ర్వాత కూడా ఈ ముగ్గురూ క‌లిసి ఓ జాన‌ప‌ద సినిమా మొద‌లుపెట్టారు కానీ, అనుకోకుండా అది స‌గం షూటింగ్ త‌ర్వాత‌ ఆగిపోయింది. ఇప్పుడు గోపాల్‌రెడ్డి కానీ, కోడి రామ‌కృష్ణ కానీ మ‌న మ‌ధ్య లేరు. అయితే బాల‌కృష్ణను అగ్ర‌హీరోగా మార్చిన సినిమాల‌ను డైరెక్ట్ చేసిన కోడి రామ‌కృష్ణ‌తో బాల‌య్య మ‌ళ్లీ ఎందుకు సినిమా చెయ్య‌లేద‌నే ప్ర‌శ్న చాలా మందిలో ఉండిపోయింది.

కొన్నేళ్ల క్రితం ఈ ప్ర‌శ్న‌కు కోడి రామ‌కృష్ణ జ‌వాబిచ్చారు. అన్నీ కుదిరితే త‌మ కాంబినేష‌న్‌లో మ‌ళ్లీ సినిమా వ‌స్తుంద‌నే ఆశాభావాన్ని వ్య‌క్తంచేస్తూ, "భార్గ‌వ్ ఆర్ట్స్‌లో బాల‌య్య‌తో నిజంగా గొప్ప సినిమాలే చేశాను. గోపాల్‌రెడ్డి గారికి కూడా బాల‌య్య అంటే విప‌రీత‌మైన అభిమానం. 'మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు' త‌ర్వాత బాల‌య్య టాప్ స్టార్ అయిపోయాడు. అందుకు త‌గ్గ‌ట్లే బాల‌య్య‌తో ఏ సినిమా తీసినా అడ‌క్కుండానే పారితోషికం పెంచేవారు గోపాల్‌రెడ్డి. 'ముద్దుల మావ‌య్య' త‌ర్వాత బాల‌య్య దాదాపు నంబ‌ర్‌వ‌న్ అయ్యారు. ఆయ‌న పారితోషికం కూడా బాగా పెరిగిపోయింది. 'ఇప్పుడు మ‌నం బాల‌య్య‌తో సినిమా తీస్తే మ‌న‌కోసం ఆయ‌న పారితోషికం త‌గ్గించుకోవాలి. అలాంటి ప‌రిస్థితి మ‌న బాల‌య్య‌కు రాకూడ‌దు. ఆ స్థాయి పారితోషికం ఇచ్చే స్థాయికి మ‌నం చేరుకున్నాకే సినిమా తీద్దాం' అన్నారు గోపాల్‌రెడ్డి. అందుకే మ‌ళ్లీ మా కాంబినేష‌న్‌లో సినిమాలు రాలేదు" అని ఆయ‌న చెప్పారు.

త‌మ కాంబినేష‌న్‌లో మొద‌లై, ఆగిపోయిన జాన‌ప‌ద సినిమా గురించి కూడా కోడి రామ‌కృష్ణ తెలిపారు. "కొంద‌రు మ‌ధ్య‌వ‌ర్తుల కార‌ణంగా ఆ సినిమా ఆగిపోయింది. ఇందులో అంత‌కుమించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. నిజానికి సినిమా 60 శాతం పూర్త‌యింది. రెడ్డిగారు బ‌తికుండే పూర్తి చేసేవాళ్లం" అని ఆయ‌న వెల్ల‌డించారు. ఏదేమైనా బాల‌కృష్ణ‌, కోడి రామ‌కృష్ణ‌, ఎస్‌. గోపాల్‌రెడ్డి కాంబినేష‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ స‌క్సెస్ అయ్యిందనేది నిజం. కోడి రామ‌కృష్ణ 2019 ఫిబ్ర‌వ‌రి 22న‌ క‌న్నుమూయ‌గా, ఎస్‌. గోపాల్‌రెడ్డి అంత‌కంటే చాలా ముందుగా 2008లో మృతి చెందారు.

(నేడు కోడి రామ‌కృష్ణ మూడో వ‌ర్ధంతి)