English | Telugu

కాలి వేలు తెగి ర‌క్తం కారుతుంటే కూల్‌డ్రింక్ పోసిన ఎన్టీఆర్‌!

ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లోని సూప‌ర్‌స్టార్స్ అంద‌రి స‌ర‌స‌నా న‌టించిన తార రాజ‌సులోచ‌న. తెలుగులో ఆమె మొట్ట‌మొద‌టిసారి హీరోయిన్ రోల్ చేసిన చిత్రం 'సొంత‌వూరు'. న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క‌రామారావు హీరోగా న‌టించిన ఆ సినిమాకు నిర్మాత ఘంట‌సాల. ఆ సినిమా షూటింగ్ సంద‌ర్భంలో ఎన్టీఆర్‌, రాజ‌సులోచ‌న ఇద్ద‌రూ కొండ‌మీద న‌డిచి వెళ్తూవుండే దృశ్యం చిత్రీక‌రిస్తున్నారు. అది డ్యూయెట్‌లో ఓ భాగం. స్టూడియోలో ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌లో తీస్తున్నారు. కొండ సెట్ అంటే వెదుళ్లు, తీగ‌లు.. లాంటి వాటితో నిర్మిస్తారు. అలాంటి సెట్‌లో కొండ‌మీద వాళ్లిద్ద‌రూ వెళ్తూవుంటే రాజ‌సులోచ‌న కాలికి ఒక తీగ త‌గిలిన‌ట్ల‌యింది.

షాట్‌లో ఉన్న‌ప్పుడు అక్క‌డ ఆగి ఇబ్బంది క‌లిగించ‌డం ఇష్టంలేక ఆమె అలాగే న‌డిచి వెళ్లిపోయారు. షాట్ ఓకే అయ్యింది. షాట్ పూర్త‌య్యాక ఎన్టీఆర్‌, రాజ‌సులోచ‌న ఓ చోట కూర్చున్నారు. ఈలోగా సెట్‌బాయ్ వ‌చ్చి వాళ్ల‌కు కూల్‌డ్రింక్స్ అందించాడు. ఇద్ద‌రూ కూల్‌డ్రింక్స్ తాగుతున్నారు. అంత‌లోనే ఎన్టీఆర్ ఆమె కాలివంక చూసి, "ఏమిటిదీ?" అన‌డిగారు. అప్పుడు రాజ‌సులోచ‌న త‌న కాలువైపు చూసుకున్నారు. ఆమె కుడికాలి బొట‌న‌వేలంతా నెత్తురు. అప్ప‌టికి గానీ త‌న వేలు కింద తెగిపోయింద‌నే విష‌యం ఆమె తెలుసుకోలేక‌పోయింది.

వెంట‌నే ఎన్టీఆర్ త‌న చేతిలో ఉన్న కూల్‌డ్రింక్‌ను ఆమె వేలిమీద ఒంపేశారు. ఆ వెంట‌నే ఫ‌స్ట్ ఎయిడ్ చేసి, యాంటీసెప్టిక్ ఇంజ‌క్ష‌న్ చేసి, కాలికి పెద్ద క‌ట్టుక‌ట్టారు. అంత‌కు ముందే ఆ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఆ రోజు ద‌గ్గ‌ర ప‌డుతోంది. అందుక‌ని రాత్రింబ‌వ‌ళ్లు షూటింగ్ జ‌రిపేవారు. ఆ సినిమాలో రాజ‌సులోచ‌న‌కు రాధాకృష్ణుల నృత్యం ఒక‌టి ఉంది. ఆ పాట మొత్తం కాలికి బ్యాండేజ్‌తోనే ఆమె డాన్స్ చేశారు.