English | Telugu

రెండు సార్లు పోయిన‌ట్లే పోయి దొరికిన మాధ‌వి సెంటిమెంట్ రింగ్‌!

సీనియ‌ర్ న‌టి మాధ‌వి సినిమాల‌కు గుడ్‌బై చెప్పి, భ‌ర్త‌తో క‌లిసి యు.ఎస్‌.లో నివాసం ఉంటోంది. ద‌క్షిణాది నాలుగు భాష‌ల‌తో పాటు, హిందీలోనూ అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన తార ఆమె. మాధ‌వి సినిమాల్లో న‌టించేట‌ప్పుడు ఆమెకో సెంటిమెంట్ ఉండేది. వాళ్ల‌మ్మ‌గారు ఆమెకు అయిదురాళ్ల ఉంగ‌రం ఒక‌టి ఇచ్చారు. అది త‌న చేతిలో ఉన్నంత‌వ‌ర‌కూ త‌న‌కంతా మంచే జ‌రుగుతుంద‌ని న‌మ్మేది మాధ‌వి. సినిమాల్లోనూ ఆ ఉంగ‌రం ఆమె చేతికే ఉంటుంది. ఆ ఉంగ‌రం గురించి ఫ్యాన్స్ ఆమెకు ఉత్త‌రాలు రాసేవారు, "ప్ర‌తి సినిమాలోనూ మీ వేలికి క‌నిపించే ఆ ఉంగ‌రం అంటే మీకిష్ట‌మా?" అని.

అంత డీప్‌గా ఆమె ల‌వ్ చేసిన ఆ ఉంగ‌రం ఎక్క‌డో ప‌డిపోతే ఆమెకెలా ఉండివుంటుందో ఊహించుకోవాల్సిందే. 'హ‌నా బ‌ల‌వా.. జ‌నా బ‌ల‌వా' అనే క‌న్న‌డ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. అందులో పొలాల్లో ప‌నిచేసే సీన్ ఒక‌టుంది. మోకాలి బుర‌ద‌నీటిలో నిల‌బ‌డి, పొలంలోవున్న బుర‌ద‌నంతా ఒక‌ళ్ల‌మీద ఒక‌రు చ‌ల్లుకొనే సీన్‌. ఆ సినిమాలో శంక‌ర్ నాగ్ హీరో. డైరెక్ట‌ర్ రెడీ అన‌గానే షాట్ మొద‌లైంది. చేతుల‌నిండా బుర‌ద తీసుకొని విస‌ర‌డం మొద‌లుపెట్టింది మాధ‌వి. అంతే.. హ‌ఠాత్తుగా ఆమె వేలికున్న ఉంగ‌రం జారి, బుర‌ద‌లోప‌డి మాయ‌మైంది. షాట్ మ‌ధ్య‌లో ఉంగ‌రం కోసం వెత‌క‌లేని ప‌రిస్థితి.

'పోయింది.. నా ల‌క్కీ రింగ్ పోయింది' అని తీర్మానించుకుంది మాధ‌వి. ఆమెలో ఏడుపు త‌న్నుకొస్తోంది. కానీ బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా లోలోప‌లే దాన్ని అదిమిపెడుతూ అలాగే న‌టించింది. డైరెక్ట‌ర్‌, ఓకే.. క‌ట్ అని చెప్ప‌గానే, అప్పుడు భోరున ఏడ్చేసింది. "ఏమైంది ఏమైంది?" అంటూ డైరెక్ట‌ర్ ప‌రుగున వ‌చ్చి అడిగాడు. సంగ‌తి చెప్ప‌గానే అంద‌రూ ఉంగ‌రం కోసం బుర‌ద‌లో గాలించారు. ఒక తోటి న‌టికి ఆ ఉంగ‌రం దొరక‌డంతో హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకుంది మాధ‌వి.

మ‌రోసారి 'అమావాస్య చంద్రుడు' సినిమా షూటింగ్ టైమ్‌లో బీచ్‌లో జారిపోయింది ఆ ఉంగ‌రం. హీరో క‌మ‌ల్ హాస‌న్ అది గ‌మ‌నించి, చ‌టుక్కుమ‌ని వంగి, ఉంగ‌రాన్ని ప‌ట్టుకున్నారు. లేకుండా ఆ ఉంగ‌రం స‌ముద్రంలో క‌లిసిపోయేదే! "చాలా థాంక్స్ క‌మ‌ల్‌గారూ.. చాలా చాలా థాంక్స్" అని ఆయ‌న చేతులు ప‌ట్టుకు ఊపేసింది మాధ‌వి.