Read more!

English | Telugu

ఒక అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌పై మ‌హాన‌టి న‌మ్మ‌కం ఇది!

 

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు క‌థానాయ‌కుడిగా అన్న‌పూర్ణ పిక్చ‌ర్స్ నిర్మించిన 'చ‌దువుకున్న అమ్మాయిలు' చిత్రంలో సావిత్రి ప్ర‌ధాన పాత్ర పోషించారు. ఆ చిత్రంలో ఆమె స్నేహితురాళ్లుగా కృష్ణ‌కుమారి, ఇ.వి. స‌రోజ న‌టించారు. ఆ సినిమాలో న‌టించే స‌మ‌యంలో త‌న ద‌గ్గ‌రున్న 50 వేల రూపాయ‌ల‌ను ఆ సినిమాకు ప‌నిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ చేతికిచ్చి, 'నేష‌న‌ల్ ప్రైజ్ బాండ్స్' కొన‌మ‌ని చెప్పారు. ఆరోజే ఆమె నాగార్జున సాగ‌ర్ డ్యామ్‌కు షూటింగ్ నిమిత్తం వెళ్లిపోయారు.

ఆ డ‌బ్బును జాగ్ర‌త్త‌ప‌ర్చాల్సిన అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌కు రాత్రంతా నిద్ర‌ప‌ట్ట‌లేదు. బీరువాలో ఆ డ‌బ్బును దాచి, దాని తాళాలు త‌న ద‌గ్గ‌ర భ‌ద్రంగా దాచుకున్నా కూడా.. అత‌డికి నిద్ర‌ప‌ట్ట‌లేదు. మ‌రుస‌టి రోజు, ఆ డ‌బ్బును బాండ్స్‌గా మార్చి వాటిని మ‌ళ్లీ బీరువాలో దాచి, సావిత్రి ఔట్‌డోర్ షూటింగ్ నుంచి రాగానే ఐదు క‌ట్ట‌ల‌ను ఇచ్చాడు. ఒక్కో క‌ట్ట‌లో వంద రూపాయ‌ల విలువ‌క‌ల బాండ్లు వంద ఉంటాయి. 

సావిత్రి ఆ క‌ట్ట‌ల‌ను మామూలు పేప‌ర్లలా తీసుకొని, లోప‌ల‌కు వెళ్ల‌బోతుంటే, "వాటిని లెక్క‌పెట్టండ‌మ్మా" అని చెప్పాడు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌. "లెక్క పెట్టాల్సిన అవ‌స‌రం వ‌స్తుంద‌నుకుంటే ఆ డ‌బ్బు మీకు ఇవ్వ‌నుక‌దండీ" అన్నారు సావిత్రి. ఎవ‌రినైనా సావిత్రి ఎలా న‌మ్ముతారో చెప్ప‌డానికి ఇదో నిద‌ర్శ‌నం. ఆ రోజుల్లో.. అంటే 1963 రోజుల్లో.. 50 వేల రూపాయ‌లంటే చాలా పెద్ద మొత్తం కింద లెక్క‌. ఆ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కూడా సావిత్రి త‌న మీద పెట్టిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌లేదు.