Read more!

English | Telugu

నాగ్ 'ఆఖ‌రి పోరాటం'లో చెయ్య‌మ‌ని సుహాసినికి చెప్పింది చిరంజీవి అని తెలుసా?

 

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో సుహాసిని 'మంచిదొంగ‌', 'ఆఖ‌రి పోరాటం' చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించారు. 'మంచిదొంగ‌' మూవీలో చిరంజీవి స‌ర‌స‌న ఆమె చేశారు. ఆ సినిమాలో ఆమెది లాయ‌ర్ పాత్ర‌. మ‌రో హీరోయిన్ విజ‌య‌శాంతిది ఇన్‌స్పెక్ట‌ర్ రోల్‌. ఇక 'ఆఖ‌రి పోరాటం' సినిమాలో నాగ్ జోడీగా చేశారు సుహాసిని. మెయిన్ హీరోయిన్ రోల్‌ను శ్రీ‌దేవి చేశారు. ఆ మూవీలో సుహాసినిని న‌టించ‌మ‌ని అడిగింది చిరంజీవి కావ‌డం విశేషం. "రాఘ‌వేంద్ర‌రావు నిన్ను ఆ క్యారెక్ట‌ర్‌కు రిక‌మెండ్ చేశారు. నువ్వు పూర్తిగా యారొగెంట్ అని ఆయ‌న‌కు తెలీదు. నువ్వు ఏం చేయాల‌నుకుంటే అది చేస్తావ‌ని నాకు తెలుసు. నువ్వెందుకు క‌థ విన‌కూడ‌దు?" అన‌డిగారు.

నిజానికి ఈ రెండు సినిమాల్లో మొద‌ట మొద‌లైంది 'ఆఖ‌రి పోరాటం' కాగా, మొద‌ట విడుద‌లైంది 'మంచి దొంగ‌'. 'ఆఖ‌రి పోరాటం'లో సునాద‌మాల‌గా సుహాసిని న‌టించారు. అది చాలా చ‌క్క‌ని పాత్ర‌. ఆ క్యారెక్ట‌ర్‌కు రాఘ‌వేంద్ర‌రావు మొద‌టి చాయిస్ రేవ‌తి. కానీ రైట‌ర్ జంధ్యాల ఆ పాత్ర‌కు సుహాసిని అయితే బాగుంటుంద‌ని సూచించారు. రాఘ‌వేంద్ర‌రావును సుహాసిని క‌లిసిన‌ప్పుడు, "నువ్వు చెయ్య‌నంటే, నువ్వే రేవ‌తితో మాట్లాడి, ఆమెను ఫిక్స్ చెయ్యి" అని చెప్పారాయ‌న‌. "ఈ క్యారెక్ట‌ర్ నువ్వు చెయ్యాలి, లేదంటే రేవ‌తి చెయ్యాలి. నువ్వు చెయ్య‌నంటే, రేవ‌తి నీ ఫ్రెండే క‌దా, త‌న‌ని ఫిక్స్ చెయ్యి" అని ఆయ‌న అన్నారు. ఈ విష‌యాన్ని సుహాసిని స్వ‌యంగా చెప్పారు.

'ఆఖ‌రి పోరాటం' ఫ‌స్ట్ డే షూటింగ్‌ను ఆమె గుర్తు చేసుకున్నారు. "మొద‌ట నేను కింద‌ప‌డిపోతే, త‌ర్వాత నాగార్జున నామీద ప‌డిపోతాడు. మా ఇద్ద‌రి మీదా ఓ పిల్ల‌ర్ ప‌డిపోతుంది. చాలాసేపు అలాగే ప‌డిపోయి ఉన్న‌ట్లు చేయాల్సి వ‌చ్చింది." అని చెప్పారు. నిజానికి ఆ సీన్‌లో రొమాన్స్ బాగా పండింది. నాగ్‌-సుహాసిని మ‌ధ్య కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల్ని అల‌రించింది.