Read more!

English | Telugu

కొడుకు డైరెక్ట‌ర్ అవ‌డం చూసింది కానీ.. అత‌డి విజ‌యాన్ని చూడ‌లేక‌పోయింది!

 

ర‌చ‌యిత‌గా కెరీర్‌ను ఆరంభించి, మంచి హిట్ట‌యిన సినిమాల‌కు క‌థ‌లు, మాట‌లు రాసిన కొర‌టాల శివ, 'మిర్చి' మూవీతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మై, తొలి సినిమాతోటే బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడు. ఆ సినిమా ప్ర‌భాస్ కెరీర్‌లో అప్ప‌టికి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. త‌ల్లి చావుకు కార‌ణ‌మైన ఆగ‌ర్భ శ‌త్రువును జై అనే యువ‌కుడు మంచివాడిగా మార్చ‌డ‌మ‌నే పాయింట్ ప్రేక్ష‌కుల‌కు అమితంగా న‌చ్చేసి, దానికి ఘ‌న విజ‌యం చేకూర్చిపెట్టారు. తొలి సినిమా అందించిన అద్భుత విజ‌యంతో కొర‌టాల వెన‌క్కి తిరిగిచూడ‌కుండా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి, ఒక‌దాన్ని మించి ఒక‌టిగా.. మ‌రో మూడు బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్.. శ్రీ‌మంతుడు, జ‌న‌తా గారేజ్‌, భ‌ర‌త్ అనే నేను.. తీశాడు. ఇప్పుడు చిరంజీవితో 'ఆచార్య' మూవీ తీస్తున్నాడు.

అయితే ద‌ర్శ‌కుడిగా కొడుకు సాధించిన విజ‌యాన్ని చూడ‌కుండానే శివ త‌ల్లి చ‌నిపోయారు. ఇది అత‌డి జీవితంలోనే అత్యంత బాధాక‌ర ఘ‌ట‌న‌. శివ‌కు ప‌దేళ్ల వ‌య‌సులో, 1985లోనే తండ్రి చ‌నిపోయారు. త‌ల్లే పిల్ల‌ల ఆల‌నా పాల‌నా చూసుకుంటూ, వాళ్ల‌ను పెంచి పెద్ద‌వాళ్ల‌ను చేసింది. రైట‌ర్‌గా శివ స‌క్సెస్‌ను చూసిన ఆమె, అత‌డి పెళ్లిని కూడా చూసింది. అత‌డు ద‌ర్శ‌కుడిగా మారిన‌ప్పుడు కొడుకు కెరీర్ ప‌రంగా మ‌రో మెట్టు ఎదిగాడ‌ని సంతోషించింది. అయితే ద‌ర్శ‌కుడిగా అత‌డు సాధించిన విజ‌యాన్ని క‌ళ్లారా చూసి, ఆనందించ‌కుండానే ఆ త‌ల్లి క‌న్నుమూసింది.

అవును. 'మిర్చి' సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు మ‌ధ్య‌లోనే ఆమె అనూహ్యంగా తుదిశ్వాస విడిచారు. "ఆమె నా ఫ‌స్ట్ సినిమా స‌క్సెస్ చూడ‌లేదు. అది నా జీవితంలో పూడ్చ‌లేని న‌ష్టం. నాన్న నా చిన్న‌త‌నంలోనే చ‌నిపోయినా, అమ్మ ఉండ‌టంతో ఆ లోటు తెలియ‌లేదు. జీవితంలో అమ్మ చాలా పోరాడింది. చ‌దువు చెప్పించి, మ‌మ్మ‌ల్ని ఓ స్థాయికి తీసుకొచ్చింది. ఆమె ఉన్న‌ట్ల‌యితే నా విజ‌యాన్ని అంద‌రికంటే ఆమె ఎక్కువ‌గా ఎంజాయ్ చేసేది. నా స‌క్సెస్‌ను అమ్మ చూడ‌క‌పోవ‌డం ఒక్క‌టే నా జీవితంలో అత్యంత బాధాక‌ర‌మైన విష‌యం." అని ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు కొర‌టాల‌.