Read more!

English | Telugu

డైరెక్ట‌ర్‌తో "ఫ్లాప‌య్యే సినిమాకు ఇంకో టేక్ ఎందుకండీ?" అన్న బాల‌కృష్ణ‌!

 

బాల‌కృష్ణ హీరోగా ఎ. కోదండ‌రామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఫ‌స్ట్ ఫిల్మ్ 'అన‌సూయ‌మ్మ‌గారి అల్లుడు' పెద్ద హిట్ట‌యింది. దాంతో బాల‌కృష్ణ‌తో మ‌రో సినిమా చేద్దామ‌న్నారు ఎన్టీఆర్‌. అప్పుడాయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి. బాల‌కృష్ణ చేసే సినిమాల క‌థ‌లు ఆయ‌న విన‌డం, ఆయ‌న ఓకే చేశాకే బాల‌కృష్ణ వాటిని చేయ‌డం ప‌రిపాటి. క‌థ చెప్ప‌డానికి ఎన్టీఆర్ ర‌మ్మ‌న‌డంతో ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌ను వెంట‌పెట్టుకొని ఒక‌రోజు తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు వెళ్లారు కోదండ‌రామిరెడ్డి. 

ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ చెప్పారు. "మీకు ఎట్లా ఉంది?" అని కోదండ‌రామిరెడ్డిని అడిగారు ఎన్టీఆర్‌. "నాకు న‌చ్చ‌లేదు సార్" అనేశారాయ‌న‌. "ద‌ట్సాల్ రైట్‌. మీకు న‌చ్చ‌క‌పోతే మేమెందుకు చేస్తాం? వ‌దిలేయండి. త‌ర్వాత ఇంకోటేద‌న్నా చూద్దాం" అన్నారు ఎన్టీఆర్‌. అక్క‌డ్నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక "పెద్దాయ‌న ద‌గ్గ‌ర అలా ఎలా చెప్తారు?" అని కోదండ‌రామిరెడ్డిని తిట్టారు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌. "క‌థ నాకు న‌చ్చ‌లేదండీ. అదే చెప్పాను" అన్నారాయ‌న‌.

ఒక వారం రోజులు గ‌డిచాక వేరే సినిమా షూటింగ్‌లో ఉన్న కోదండ‌రామిరెడ్డికి ఎన్టీఆర్ నుంచి ఫోన్ కాల్ వ‌చ్చింది. ఫోన్‌లో "బ్ర‌ద‌ర్‌. మాకెందుకో ఆ క‌థ న‌చ్చింది. సినిమా చేసిపెట్టండి" అన్నారు ఎన్టీఆర్‌. ఆయ‌న ఆ మాట అన్నాక కాద‌న‌డం ఎందుక‌ని "ఓకే స‌ర్" అన్నారు కోదండ‌రామిరెడ్డి. త‌ర్వాత బాల‌కృష్ణ ఆ క‌థ విన్నారు. ఆయ‌న‌కు న‌చ్చ‌లేదు. కానీ తండ్రి మాట కాద‌న‌లేక ఆ సినిమా చెయ్య‌డానికి ఆయ‌న ఒప్పుకున్నారు. 

షూటింగ్ మొద‌లైంది. బాల‌య్య‌తో షూటింగ్ అంటే సెట్స్‌పై చాలా స‌ర‌దాగా ఉంటుంది. అంద‌రూ ఆడుతూ పాడుతూ ప‌నిచేస్తుంటారు. ఆ సినిమాలో బాల‌కృష్ణది పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్‌. ఒక సీన్ తీస్తున్న‌ప్పుడు, "బాల‌య్యా.. వ‌న్ మోర్ టేక్ చేద్దాం" అన్నారు కోదండ‌రామిరెడ్డి. "ఎందుకుసార్ వ‌న్ మోర్ టేక్‌.. ఫ్లాప‌య్యే సినిమాకు.. ఓకే చేసెయ్యండి" అన్నారు బాల‌య్య‌. ఆ సినిమా 'తిర‌గ‌బ‌డ్డ తెలుగుబిడ్డ‌'. ఆయ‌న అన్న‌ట్లే విడుద‌ల‌య్యాక ఆ సినిమా ఫ్లాప‌య్యింది. ఈ విష‌యాల‌ను ఓ ఇంట‌ర్వ్యూలో కోదండ‌రామిరెడ్డి స్వ‌యంగా వెల్ల‌డించారు.