English | Telugu
ఆరోజు సావిత్రితో పాటు లక్ష్మి ఉన్నట్లయితే...
Updated : Aug 14, 2021
ఇప్పటి తారలు అనకపోవచ్చునేమో కానీ, మొన్నటి-నిన్నటి తారలకు ఆదర్శం మహానటి సావిత్రి. 'సావిత్రిగారి లాగా పెద్ద ఆర్టిస్టును కావాలనుకుంటున్నాను' అని చెప్పేవారు నటీమణులు. అయితే అప్పటికీ ఇప్పటికీ సావిత్రి నటనా ప్రతిభకు సాటి రాగల తార ఇంతదాకా రాలేదన్నది ఎవరైనా ఒప్పుకొనే విషయం. మహానటి అనే ట్యాగ్ ఆమెకు మాత్రమే ఇచ్చారు ప్రేక్షకులు. సీనియర్ నటి లక్ష్మి కూడా ఇదే మాటంటారు. ఎనిమిది-తొమ్మిదేళ్ల వయసు నుంచీ సావిత్రితో లక్ష్మికి పరిచయం, చనువూ ఉన్నాయి. తొలి చిత్రం 'బాంధవ్యాలు'లో సావిత్రితో కలిసి నటించారు లక్ష్మి. ఆ తర్వాత 'పుట్టినిల్లు-మెట్టినిల్లు' లాంటి పలు చిత్రాల్లో వారు కలిసి నటించారు.
'చందనగొంబె' అనే కన్నడ చిత్రం షూటింగ్ జరిగే రోజుల్లో జరిగిన ఘటన లక్ష్మి ఎన్నటికీ మరచిపోదు. ఒకరోజు మైసూరులోని స్టూడియోలో సావిత్రి, లక్ష్మి ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. లక్ష్మి వర్క్ పూర్తయింది. ఆమె మద్రాస్ వెళ్లిపోదామని అనుకుంటూ ఆ విషయం సావిత్రితో చెప్పారు. "ఈ ఒక్కరోజు నువ్వు ఇక్కడ వున్నావంటే రేపు ఇద్దరం కలిసి వెళ్లిపోవచ్చు" అన్నారు సావిత్రి. వీలుపడదని చెప్పి లక్ష్మి బయలుదేరి వెళ్లిపోయారు. అంతలోనే సావిత్రి కోమాలో ఉన్నట్లు, బెంగళూరులో ఓ హాస్పిటల్‌లో చేర్పించినట్లు వార్త వచ్చింది. వెంటనే లక్ష్మి కారులో తిరిగి బెంగళూరు వెళ్లారు.
లక్ష్మి బెంగళూరులో సావిత్రిని చేర్పించిన హాస్పిటల్‌కు వెళ్లి చూసేసరికి ఆవిడ జనరల్ వార్డ్ వసారాలో నేలమీద పడుకోబెట్టబడి ఉన్నారు. ఆ దృశ్యం చూడగానే లక్ష్మి హృదయం ద్రవించిపోయింది. ఉవ్వెత్తున్న కోపం ముంచుకొచ్చింది. అప్పుడే ప్రముఖ కన్నడ నిర్మాత వీరాస్వామి (నటుడు రవిచంద్రన్ తండ్రి) కూడా వచ్చారు. ఆయన, లక్ష్మి.. సిబ్బందిపై కేకలేసి సావిత్రిని స్పెషల్ వార్డులో చేర్పించారు. ఇది 1980లో జరిగింది. అప్పుడు ఆవిడ కోలుకున్నారు. 1981లో మళ్లీ అదే పరిస్థితికి గురై ఆమె చనిపోయారు. అప్పటి ఘటన తలచుకుంటే ఇప్పటికీ లక్ష్మికి ఎంతో బాధగా ఉంటుంది. ఒక మహానటికి ఎంత దారుణమైన పరిస్థితి ఎదురైందా అని తల్లడిల్లుతుంటుంది. ఆరోజు గనుక సావిత్రితో పాటు లక్ష్మి ఉండిపోయినట్లయితే పరిస్థితి వేరే విధంగా ఉండేదేమో!