Read more!

English | Telugu

త‌ల్లి ల‌క్ష్మి కార‌ణంగా 'టూ టౌన్ రౌడీ'లో హీరోయిన్‌ చాన్స్ పోగొట్టుకున్న‌ ఐశ్వ‌ర్య‌!

 

విక్ట‌రీ వెంక‌టేశ్ హీరోగా ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు రూపొందించిన సినిమా 'టూ టౌన్ రౌడీ' (1989). అనిల్ క‌పూర్‌, మాధురీ దీక్షిత్ జంట‌గా న‌టించిన బాలీవుడ్ సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'తేజాబ్‌'కు అది రీమేక్‌. 'టూ టౌన్ రౌడీ'లో హీరోయిన్‌గా రాధ న‌టించింది. నిజానికి ఫ‌స్ట్ చాయిస్ ఆమె కాదు.. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూతురు ఐశ్వ‌ర్య‌! 'అడ‌విలో అభిమ‌న్యుడు' మూవీలో జ‌గ‌ప‌తిబాబు స‌ర‌స‌న నాయిక‌గా న‌టించ‌డం ద్వారా ఐశ్వ‌ర్య టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అయితే దానికంటే ముందు 'టూ టౌన్ రౌడీ' మూవీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఆమెకు ల‌భించింది. కానీ స్వ‌యంగా త‌ల్లి ల‌క్ష్మి ఆ అవ‌కాశాన్ని వ‌దులుకునేట్లు చేశారు. ఆ క‌థేమిటంటే...

ఓసారి ల‌క్ష్మి హైద‌రాబాద్ నుంచి మ‌ద్రాస్ వెళ్తుండ‌గా అదే ఫ్ల‌యిట్‌లో మూవీ మొఘ‌ల్ డి. రామానాయుడు, ఆయ‌న శ్రీ‌మ‌తి తార‌స‌ప‌డ్డారు. అప్పుడు ల‌క్ష్మిని ప‌ల‌క‌రించిన రామానాయుడు, "ఏంటీ, మీ అమ్మాయి కూడా సినిమాల్లో న‌టిస్తోంద‌ని విన్నాను. నిజ‌మా?" అన‌డిగారు. అప్పుడే ఐశ్వ‌ర్య 'హోస‌కావ్య' అనే క‌న్న‌డ సినిమాలో న‌టించేందుకు ఒప్పుకుంది. ఆ సంగ‌తి వినే ఆయ‌న ల‌క్ష్మిని అడిగారు. అవున‌ని జ‌వాబిచ్చారు ల‌క్ష్మి. అలా వాళ్లిద్ద‌రూ ఐశ్వ‌ర్య గురించి మాట్లాడుకున్నారు. 

మ‌ద్రాస్ ఎయిర్‌పోర్టులో ఫ్ల‌యిట్ దిగ‌గానే, "మా ఇంటికి వెళ్లే దారిలోనే క‌దా మీ ఇల్లు.. ఓ సారి అమ్మాయిని చూస్తాను." అని చెప్పారు రామానాయుడు. అలా భార్య‌తో క‌లిసి ల‌క్ష్మి వాళ్లింటికి వెళ్లారు. ఐశ్వ‌ర్య‌ను, ఆమె ఫొటో షూట్‌ను చూసిన రామానాయుడు, "అమ్మాయి బావుంది. మా వెంక‌టేశ్ ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించ‌డానికి క‌రెక్టుగా స‌రిపోతుంది. డైరెక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు గారితో మాట్లాడి క‌బురు పెడ‌తాను." అని చెప్పి వెళ్లారు. ఆ త‌ర్వాత ఆయ‌న దాస‌రితో మాట్లాడ‌గా, ఆయ‌న కూడా ఫొటోలు చూసి ఓకే చేశారు. 

అయితే ఆ సినిమాలో హీరోయిన్ స్విమ్‌సూట్ ధ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని దాస‌రి చెప్ప‌డంతో ల‌క్ష్మి అందుకు అంగీక‌రించ‌లేదు. స్విమ్‌సూట్ వేసుకోడానికి ఐశ్వ‌ర్యకు ఎలాంటి అభ్యంత‌రం లేక‌పోయినా, ల‌క్ష్మి మాత్రం స‌సేమిరా అన్నారు. దాంతో ఆ సినిమాలో న‌టించే చాన్స్ మిస్స‌యిపోయింది ఐశ్వ‌ర్య‌కు. లేదంటే తెలుగులో ఆమె ఫ‌స్ట్ ఫిల్మ్ 'టూ టౌన్ రౌడీ' అయ్యుండేది.