Read more!

English | Telugu

'గీతాంజ‌లి' గిరిజ‌ హ‌ఠాత్తుగా సినిమాల‌ నుంచి ఎందుకు త‌ప్పుకుందో తెలిస్తే షాక‌వుతారు!

 

జ‌న‌ర‌ల్‌గా ఎక్కువ సినిమాల‌ను అంగీక‌రించ‌డం ద్వారా హీరోయిన్లు ఎక్కువ‌గా వార్త‌ల్లో క‌నిపిస్తుంటారు. కానీ పెద్ద పెద్ద హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాలు వ‌చ్చినా నిర్మొహ‌మాటంగా నో చెప్తూ అప్ప‌ట్లో వార్త‌ల్లో నిలిచారు 'గీతాంజ‌లి' గిరిజ‌. నాగార్జున హీరోగా మ‌ణిర‌త్నం రూపొందించిన ప్రేమ‌క‌థాచిత్రం 'గీతాంజ‌లి' (1989)లో టైటిల్ రోల్ పోషించ‌డం ద్వారా హీరోయిన్‌గా ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయిన గిరిజ‌, ఆ త‌ర్వాత మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ స‌ర‌స‌న రెండు సినిమాలు - 'వంద‌నం', 'ధ‌నుష్కోడి'లో న‌టించారు. అయితే ప్రియ‌ద‌ర్శ‌న్ డైరెక్ట్ చేసిన 'ధ‌నుష్కోడి' ఎందుక‌నో విడుద‌ల‌కు నోచుకోకుండా ఆగిపోయింది. 

హిందీ చిత్రం 'జో జీతా వోహి సికింద‌ర్‌' (1992)లో ఆమిర్ ఖాన్ స‌ర‌స‌న మొద‌ట నాయిక‌గా ఎంపికై, ఓ పాట‌, కొన్ని స‌న్నివేశాలు తీశాక‌, మ‌రో ముఖ్య‌మైన ప‌నికోసం అర్ధంత‌రంగా ఆ సినిమా వ‌దిలేశారు. ఆ త‌ర్వాత ఆమె క్యారెక్ట‌ర్‌లోకి ఆయేషా జుల్కా వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆమె న‌టించింది తెలుగులో 'హృద‌యాంజ‌లి' అనే సినిమాలోనే. పెద్ద హీరోల‌తో న‌టించేందుకు వ‌చ్చిన అవ‌కాశాల‌ను వ‌దులుకొని, 'హృద‌యాంజ‌లి' అనే చిన్న సినిమాలో న‌టించ‌డానికి ఆమె ఒప్పుకోవ‌డం టాక్ ఆఫ్ ద టౌన్‌.

అప్ప‌ట్లో, "మీరెందుకు ప‌లు అవ‌కాశాల‌ను వ‌దులుకుంటున్నారు?" అనే ప్ర‌శ్న ఎదురైన‌ప్పుడు, "నిజ‌మే.. పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో న‌టించ‌మ‌ని అడుగుతున్నారు. కానీ నాకు హీరో కాదు ముఖ్యం. క‌థ ఏంటి?  నా పాత్ర ఏంటి? అన‌డిగితే ఎవ‌రూ స‌రిగా చెప్ప‌కుండా, 'హీరో డేట్స్ ఇవి. ఆ డేట్స్‌లో మీరు కాల్షీట్లు ఇవ్వాలి.; ఇదీ రెమ్యూన‌రేష‌న్‌.; ఇదీ అడ్వాన్స్‌.' అని చెప్ప‌డం నాకు హాస్యాస్ప‌దంగా అనిపిస్తోంది. న‌టిగా నేను మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటానే కానీ, డ‌బ్బు కోస‌మ‌ని ఆట‌బొమ్మ‌లా సినిమాల్లో క‌నిపించ‌డం నాకెంత‌మాత్రం ఇష్టం ఉండ‌దు. నా వ్య‌క్తిత్వాన్ని నేనెందుకు అవ‌మానించుకోవాలి? అందుకే నేను విన‌యంగా అట్లాంటి నిర్మాత‌లంద‌రికీ 'నో' అని చెబుతున్నాను. ఇందులో ఎవ‌రినీ కించ‌ప‌ర‌చ‌డం నా ఉద్దేశం కాదు. నా అభిరుచికి త‌గిన చిత్రం ల‌భించిన‌ప్పుడు, త‌ప్ప‌క నేను అంగీక‌రిస్తాను. అంత‌వ‌ర‌కు ఖాళీగా ఉండ‌కుండా నేను ర‌చ‌నా వ్యాసంగాన్ని కొన‌సాగిస్తాను." అని చెప్పారు గిరిజ‌. అన్న‌ట్లే త‌న మ‌న‌సుకు న‌చ్చిన పాత్ర‌లు రాక‌పోవ‌డంతో సినీ రంగం నుంచి త‌ప్పుకున్నారు.

'హృద‌యాంజ‌లి' సినిమాలో ఆమె ఒక ఇంగ్లీష్ సాంగ్ కూడా రాశారు. సింగ‌ర్ బ్రెండా పాడిన ఆ సాంగ్ సూప‌ర్ పాపుల‌ర్ అవ‌డంతో పొయెట్‌గానూ గిరిజ స‌క్సెస్ అనిపించుకున్నారు. సంజ‌య్ మిత్రా, గిరిజ జంట‌గా న‌టించిన 'హృద‌యాంజ‌లి' సినిమాని ఎ. ర‌ఘురామిరెడ్డి డైరెక్ట్ చేశారు. 1992లో షూటింగ్ జ‌రుపుకున్న ఆ సినిమా 2002లో థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. 

గిరిజ పూర్తిపేరు గిరిజ షెట్ట‌ర్‌. ఇంగ్లండ్‌లోని ఎస్సెక్స్‌లో ఆమె 1969 జూలై 20న జ‌న్మించారు. ఆమె త‌ల్లి బ్రిటిష్ వ‌నిత‌, తండ్రి ఒక క‌న్న‌డ డాక్ట‌ర్‌. 'హృద‌యాంజ‌లి' సినిమా త‌ర్వాత ఆమె సినీ రంగాన్ని వ‌దిలేసి, ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లిపోయారు. కార్డిఫ్ యూనివ‌ర్సిటీ నుంచి 2003లో 'ఇంటిగ్ర‌ల్ యోగా ఫిలాస‌ఫీ అండ్ ఇండియ‌న్ స్పిరిచ్యువ‌ల్ సైకాల‌జీ' అనే థీసిస్‌కు గాను 2003లో డాక్ట‌రేట్ ప‌ట్టా పొందారు. 'దిస్ ఇయ‌ర్‌, డాఫోడిల్స్' అనే హైకూ క‌విత‌ల సంపుటిని 2011లో ప్ర‌చురించారు. ప్ర‌స్తుతం జ‌ర్న‌లిస్టుగా, రైట‌ర్‌గా త‌న జీవితాన్ని కొన‌సాగిస్తున్నారు.