Read more!

English | Telugu

జయలలితపై జమునకు ఎందుకు కోపం వచ్చింది?

 

అల‌నాటి న‌టీమ‌ణులు జ‌మున‌, జ‌య‌ల‌లిత‌.. ఇద్ద‌రికి ఇద్ద‌రూ అభిమాన‌వంతులుగా పేరు పొందిన‌వాళ్లే. ఆత్మాభిమానం విష‌యంలో అంత త్వ‌ర‌గా వారు రాజీప‌డ‌రు. అందువ‌ల్లే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడు జ‌మున‌తో అప్ప‌టి అగ్ర హీరోలైన ఎన్టీఆర్‌, ఏఎన్నార్ కొంత కాలంపాటు న‌టించ‌లేదు. ఆ విష‌యం అలా ఉంచితే, ఒక సంద‌ర్భంలో జ‌య‌ల‌లిత‌తో జ‌మున‌కు గొడ‌వ వ‌చ్చింది. ఆ సంద‌ర్భం.. ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన 'శ్రీ‌కృష్ణ విజ‌యం' (1971) సినిమా సెట్స్ మీద సంభ‌వించింది.

క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు డైరెక్ట్ చేసిన 'శ్రీ‌కృష్ణ విజ‌యం'లో శ్రీ‌కృష్ణునిగా నంద‌మూరి తార‌క‌రామారావు న‌టించ‌గా, హీరోయిన్ వ‌సుంధ‌ర పాత్ర‌లో జ‌య‌ల‌లిత‌, స‌త్య‌భామ పాత్ర‌లో జ‌మున న‌టించారు. కౌముది ఆర్ట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మ‌ల్లెమాల సుంద‌ర‌రామిరెడ్డి (ఎం.ఎస్‌. రెడ్డి) ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఒక‌రోజు జ‌య‌ల‌లిత‌, జ‌మున‌కు డైరెక్ట‌ర్ కామేశ్వ‌ర‌రావు రిహార్స‌ల్స్ నిర్వ‌హించారు. మొద‌ట జ‌య‌ల‌లిత డైలాగ్ చెబితే, త‌ర్వాత దానికి స‌మాధానంగా జ‌మున డైలాగ్ చెప్పాలి. అందుక‌ని జ‌య‌ల‌లిత‌ను డైలాగ్ చెప్ప‌మ‌న్నారు జ‌మున‌. ఆమె "నేనెందుకు చెప్పాలి?  మీరే చేసుకోండి" అని నిర్ల‌క్ష్యంగా జ‌వాబిచ్చారు. జ‌మున‌కు కోపం వ‌చ్చింది.

"ఏంటండీ డైరెక్ట‌ర్ గారూ.. ఆ అమ్మాయి డైలాగ్ చెప్ప‌క‌పోతే, నేనెట్లా రిహార్స‌ల్ చెయ్య‌ను. ఆమె చెప్పాలి క‌దా?" అని అడిగారు జ‌మున‌. ఆయ‌న ఏం మాట్లాడ‌లేదు.  జ‌మున విసురుగా త‌న మేక‌ప్‌రూమ్‌లోకి వెళ్లిపోయారు. జ‌య‌ల‌లిత అక్క‌డే కూర్చున్నారు. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇద్ద‌రూ జ‌మున ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. ఆరోజు షూటింగ్ చేయ‌కుండా వెళ్లిపోవాల‌ని మేక‌ప్ తీసేయ‌డానికి రెడీ అయ్యారు జ‌మున‌. ఆ ఇద్ద‌రూ ఆమెకు స‌ర్దిచెప్పి, ఎలాగో ఉంచేశారు.

ఈ ఉదంతాన్ని ఒక ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా వెల్ల‌డించారు జ‌మున‌. ఆ త‌ర్వాత కాలంలో తాను, జ‌య‌ల‌లిత స‌న్నిహిత స్నేహితుల‌మ‌య్యామ‌ని కూడా ఆమె చెప్పారు.