Read more!

English | Telugu

శత దినోత్సవ చిత్రం 'కిరాయి కోటిగాడు'కు 40 ఏళ్లు!

 

కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన 'కిరాయి కోటిగాడు' సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. ఎ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు చక్రవర్తి సమకూర్చిన సంగీతం ప్లస్సయ్యింది. వేటూరి సుందరరామ్మూర్తి కలం విన్యాసాలు చిందించిన పాటల్లో నమస్తే సుస్వాగతం సమస్తం నీ అధీనం, పట్టుమీద ఉన్నాది పాకాన పడ్డాది, కూడబలుక్కుని కన్నారేమో మీ అమ్మ మా అమ్మ, ఎక్కి తొక్కి నీ అందం ఎలాకిలా పడుతుంటే, చీకటెప్పుడవుతుందో శ్రీరామ.. ప్రజాదరణ పొందాయి.

కిరాయికి ఎలాంటి పనైనా చేసే కోటిగాడిగా కృష్ణ అలరించిన ఈ చిత్రంలో నాయిక గౌరి పాత్రను శ్రీదేవి చేసింది. ఊరిని దోచుకుతింటూ, తమను ఎదిరించిన వాళ్లను పీడించే భూస్వాములు ఆదిశేషయ్య, గరుడాచలం పాత్రల్ని రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య చేశారు. అన్నాచెల్లెళ్లుగా శ్రీధర్ (రాంబాబు), అరుణ (లక్ష్మి), వాళ్ల తల్లిగా నిర్మలమ్మ కీలక పాత్రలు చేశారు.

కిరాయికి ఎవరి చేతులు, కాళ్లనైనా విరిచేసే కిరాతకుడు అయిన కోటిగాడు ఎలా మంచివాడైపోయి, ఒక వూరివాళ్లకు మేలు చేశాడనేది ఈ చిత్రం తాలూకు ఇతివృత్తం. ఆదిశేషయ్య, గరుడాచలం అనే భూస్వాములు ఒక వూరిని దోచుకుంటూ ఉంటారు. వాళ్ల దాష్టీకాల్ని అడ్డుకోవాలని చూస్తాడు మిలిటరీలో పనిచేసి వచ్చిన రాంబాబు. అతడి అడ్డు తొలిగించుకోవాలని పట్నం నుంచి కోటిగాడిని కిరాయికి తీసుకొస్తారు ఆదిశేషయ్య, గరుడాచలం. రాంబాబుతో తలపడి అతడి కాలు విరిగిపోయేలా చేస్తాడు కోటిగాడు. రాంబాబు చెల్లెలు లక్ష్మిని శేషారావు మేనల్లుడు రేప్ చేయబోతే, అతడ్ని చావచితక్కొట్టి లక్ష్మిని కాపాడతాడు కోటిగాడు. అతడు స్వతహాగా మంచివాడేననీ, అతడిలోని మానవత్వాన్ని మేలుకొలిపి మంచివాడిగా మారిస్తే, మహాత్ముడవుతాడనీ రాంబాబు అంటే, ఆ పని చేయడానికి ముందుకొస్తుంది గౌరి. కోటిగాడిని గౌరి మంచివాడిగా ఎలా మార్చింది, కోటిగాడు ఎలా ఆదిశేషయ్య, గరుడాచలం ఆగడాలను అడ్డుకుని, ఊరికి ఉపకారి అయ్యాడనేది మిగతా కథ.

కోటిగాడు క్యారెక్టర్‌లో కృష్ణ చెలరేగిపోయి ఎంత హుషారుగా నటించారో, శ్రీదేవీ అంత జోరుగా అభినయించారు. విలన్లుగా రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, గిరిబాబు బ్రహ్మాండంగా రాణిస్తే, శ్రీధర్ కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. జయమాలిని ఓ స్పెషల్ సాంగ్‌లో గిలిగింతలు పెట్టారు. సత్యమూర్తి రాసిన కథను చక్కని స్క్రీన్‌ప్లేతో కోదండరామిరెడ్డి తెరమీదకు తీసుకువచ్చారు. సత్యానంద్ కలం బలం ఏమిటో తెలియజేసే సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఆయన రాసిన పదునైన సంభాషణలు సినిమాకి బలంగా మారాయి.

బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించిన 'కిరాయి కోటిగాడు' శత దినోత్సవం మద్రాస్‌లోని న్యూ ఉడ్‌ల్యాండ్స్ హోటల్లో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలో అప్పటి బాలీవుడ్ స్టార్ జితేంద్ర, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, మూవీ మొఘల్ డి. రామానాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచీ కృష్ణ అభిమానులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు.