Read more!

English | Telugu

గాడ్‌ఫాదర్ లేకపోవడమే వాళ్లు చేసుకున్న పాపం!

 

రాంగోపాల్ వర్మ, రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, బి. గోపాల్, రాజమౌళి, త్రివిక్ర‌మ్‌, వి.వి. వినాయక్, పూరి జగన్నాథ్, సుకుమార్‌, కొరటాల శివ, బోయపాటి శ్రీను.. వగైరా పేరుపొందిన దర్శకుల వద్ద పనిచేశామని చెబితే చాలు.. టాలీవుడ్‌లో ఎవరైనా కథ వినడానికి ఆసక్తి చూపిస్తారు. వాళ్లు హీరోలైనా, నిర్మాతలైనా. అదే అప్పటివరకూ కేరాఫ్ అడ్రస్‌గా ఏ పేరుపొందిన డైరెక్టర్ పేరూ లేకపోతే, నీ దగ్గర ఎంత మంచి కథ ఉన్నా దాన్ని వినేవాడి అపాయింట్‌మెంట్ దొరకడం కష్టం.

ఆయా దర్శకుల వద్ద పనిచేసిన చాలామంది కోడైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఇవాళ్ల డైరెక్టర్లుగా అవతారం ఎత్తి సక్సెస్ బాటలో పయనిస్తున్నారు. ఒకట్రెండు సినిమాలతోటే అగ్ర హీరోల్ని డైరెక్ట్ చేసే అవకాశం సంపాదిస్తున్నారు. యూత్ క్రేజ్‌లో వచ్చిన కొంతమంది దర్శకులు కేవలం క్రేజ్ కోసమే డైరెక్ట్ చెయ్యకుండా ప్రొఫెషనల్ డైరెక్టర్స్‌గా స్థిరపడ్డారు.

డైరెక్టర్‌గా తన పేరు వేస్తే చాలు.. సినిమా బిజినెస్ జరిగిపోయే స్థాయికి యువ దర్శకులు ఎదగడం విశేషంగానే చెప్పుకోవాలి. హీరో ఫేస్ వాల్యూతో పనిలేకుండా, డైరెక్టర్ ఎవరో తెలీకపోయినా మంచి చిత్రాల్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం హీరోలతో పనిలేకుండా పోస్టర్‌పై కనిపించే డైరెక్టర్ పేరును బట్టి సినిమాకు వెళ్లిపోతున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు.

పైన చెప్పుకున్న డైరెక్టర్లలో వినాయక్ కూడా అలా వచ్చినవాడే. ‘అమ్మ దొంగా’ ఫేం సాగర్ శిష్యుడైన వినాయక్ తొలి సినిమా ‘ఆది’లో జూనియర్ ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసి, అతి స్వల్ప కాలంలోనే టాప్ డైరెక్టర్‌గా ఎదిగాడు. కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ వంటివాళ్లు రాంగోపాల్ వర్మ శిష్యులుగా డైరెక్టర్లుగా మారి తామూ పేరుగొప్ప డైరెక్టర్లయ్యారు. ముత్యాల సుబ్బయ్య శిష్యుడైన బోయపాటి శ్రీను ఇప్పడు అగ్ర దర్శకుల్లో ఒకడు. రాఘవేంద్రరావు శిష్యుడైన రాజమౌళి ‘స్టూడెంట్ నం.1’గా, ‘సింహాద్రి’గా జూనియర్ ఎన్టీఆర్‌ను చూపించి, ఇవాళ తెలుగులోనే కాకుండా దేశంలోనే అగ్ర‌ దర్శకుడిగా పేరు పొందాడు.

ఆమ‌ధ్య‌ ‘గీత గోవిందం’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి, మ‌హేశ్‌తో 'స‌ర్కారువారి పాట' తీసే ఛాన్స్ కొట్టిన‌ పరశురామ్‌కు ‘యువత’తో డైరెక్టర్‌గా ఫస్ట్ ఛాన్స్ రావడానికి కారణం.. అతను పూరి జగన్నాథ్ శిష్యుడు కావడం. ‘ఆర్ ఎక్స్ 100’తో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి డైరెక్టర్ అయ్యాడంటే అతను రాంగోపాల్ వర్మ వద్ద పనిచెయ్యడం కారణం. ‘స్వామి రారా’తో సుధీర్ వర్మ్‌కు డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందంటే, అతను పరశురామ్‌ వద్ద పనిచేశాడు మరి. అదే పరశురామ్‌ దగ్గర పనిచేసిన శివ నిర్వాణ ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాలతో పెద్ద హీరోల దృష్టిలో పడ్డాడు.

‘ఎఫ్2’, స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌ కొట్టి త్వ‌ర‌లో బాల‌కృష్ణ‌ను డైరెక్ట్ చేయ‌డానికి రెడీ అవుతున్న‌ అనిల్ రావిపూడి ‘పటాస్’తో డైరెక్టర్ కావడానికి ముందు.. ఇవాళ తమిళంలో టాప్ డైరెక్టర్‌లలో ఒకడైన శివ దగ్గర పనిచేశాడు.

ఇలా ఎవరో ఒక పేరున్న దర్శకుడి అండ, రికమండేషన్, ఎవరైనా గాడ్‌ఫాదర్ ఉంటేనే కానీ టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా అవకాశం రావడం అంత ఈజీ కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే పేరుపొందిన, అగ్ర దర్శకుల వద్ద పనిచేసిన వాళ్లకు తప్ప, దిగువ స్థాయి దర్శకుల వద్ద పనిచేసిన అసిస్టెంట్లు, అసోసియేట్లు కూడా అవకాశాల కోసం నానా తిప్పలూ పడుతున్నారు. ఎప్పటికీ డైరెక్టర్ కాలేక ముసలివాళ్లయ్యేంత వరకూ కూడా కోడైరెక్టర్లుగా మిగిలిపోతున్నవాళ్లు అనేక మంది. ఇవాళ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్లు వందల సంఖ్య దాటి వేలల్లోకి వచ్చారు.

రేయింబగళ్లు కష్టపడి ఒక మంచి కథ తయారు చేసుకొని డైరెక్షన్ అవకాశం ఎవరైనా ఇవ్వకపోతారా అని ఇవాళ వందలాది మంది ఎదురుచూస్తూ ఫిలింనగర్‌లో, కృష్ణానగర్‌లో మనకు కనిపిస్తారు. తమ కథల బౌండెడ్ స్క్రిప్టులు పట్టుకొని సినిమా ఆఫీసుల చుట్టూ, నిర్మాతల చుట్టూ తిరిగే వాళ్లను చూస్తుంటే అయ్యో పాపం అనిపించక మానదు. ఎవరైనా కథవిని నచ్చితే, డైరెక్షన్ ఛాన్స్ మాత్రం ఇవ్వకుండా కథ తీసుకొని పంపేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

హీరో ఇమేజ్‌కు, బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లు కథలు తయారు చేసుకొని, ఆ హీరోకు కథ వినిపించే దారి తెలీక, దళారుల చేతుల్లో మోసపోతున్న వాళ్లూ ఉన్నారు. టాలెంట్ ఎంత ఉన్నా ఎంతో మంది యువకులకు డైరెక్షన్ ఛాన్స్ రాకపోవడానికి కారణం వాళ్ల వెనుక గాడ్‌ఫాదర్ లాంటివాళ్లు ఎవరూ లేకపోవడమే అని చెప్పక తప్పదు.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి