Read more!

English | Telugu

'మ‌న‌దేశం'తో న‌టునిగా ప‌రిచ‌య‌మైన ఎన్టీఆర్‌కు అందిన పారితోషికం ఇదే!

 

ఎల్వీ ప్ర‌సాద్ డైరెక్ట్ చేసిన 'మ‌న‌దేశం' చిత్రం 1949లో విడుద‌లైంది. ఆ చిత్రంతోటే ఎన్టీఆర్ న‌టునిగా తెరంగేట్రం చేశారు. స్వాతంత్ర్యం రాక‌ముందు జ‌రిగే క‌థాంశంతో ఆ సినిమా తీశారు. నిజానికి స్వాతంత్ర్యం మునుపే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. పూర్తి కావ‌డానికి చాలా కాలం ప‌ట్టింది. 'విప్ర‌దాస్' అనే బెంగాలీ న‌వ‌ల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు ఎల్వీ ప్ర‌సాద్‌. తెలుగులో వెండితెర‌పై వ‌చ్చిన తొలి బెంగాలీ న‌వ‌ల 'విప్ర‌దాస్‌'.

'మ‌న‌దేశం' మూవీలో చిత్తూరు నాగ‌య్య ప్ర‌ధాన పాత్ర పోషించారు. అప్ప‌ట్లో ఆయ‌న పెద్ద హీరో. సినిమాలో అంద‌రికంటే ఎక్కువ‌గా ఆయ‌న‌కు రూ. 40 వేల దాకా పారితోషికంగా ఇచ్చారు నిర్మాత‌లు. హీరోగా న‌టించిన నారాయ‌ణ‌రావుకు అందులో స‌గం.. అంటే రూ. 20 వేల దాకా అందింది. 

ఎన్టీఆర్‌ను ఆ సినిమా హీరోయిన్‌, నిర్మాత అయిన సి. కృష్ణ‌వేణికి ప‌రిచ‌యం చేసింది డైరెక్ట‌ర్ ఎల్వీ ప్ర‌సాద్‌. "పోలీస్ క్యారెక్ట‌ర్‌కు ఈయ‌న‌ను అనుకుంటున్నాను" అని ఆయ‌న ప‌రిచ‌యం చేశారు. కృష్ణ‌వేణి స‌రేన‌న్నారు. అప్పుడే అడ్వాన్స్‌గా రామారావుకు 250 రూపాయ‌లు ఇచ్చారు. కృష్ణ‌వేణి స్వ‌యంగా చెక్కు రాసి ఎల్వీ ప్ర‌సాద్‌కు ఇస్తే, ఆయ‌న ఆ చెక్కును రామారావుకు ఇవ్వ‌బోయారు. రామారావు ఓసారి చెక్కువంకా, కృష్ణ‌వేణి వంకా చూసి, "వారి చేతుల మీదుగా ఇప్పించండి" అన్నారు. మొద‌టి చెక్కు అందుకున్న‌ప్పుడు ఎన్టీఆర్ క‌ళ్లు ఆనందంతో మెరిశాయి. ఈ సినిమాకు ఆయ‌న అందుకున్న మొత్తం సుమారు రూ. 2 వేలు!

ఇక డైరెక్ట‌ర్ ఎల్వీ ప్ర‌సాద్‌కు అందిన పారితోషికం రూ. 15 వేలు. ఆ డ‌బ్బుతోనే ఆయ‌న మ‌ద్రాస్‌లోని గాంధీన‌గ‌ర్‌లో ఇల్లు కొనుక్కున్నార‌ని కృష్ణ‌వేణి స్వ‌యంగా చెప్పారు.