English | Telugu

'కిలాడీ కృష్ణుడు' ప‌క్క‌న విజ‌య‌శాంతి ఎలా హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌య్యారంటే...

విజ‌య‌శాంతి తొలి చిత్ర క‌థానాయ‌కుడు సూప‌ర్‌స్టార్ కృష్ణ‌. ఆ సినిమా.. 'కిలాడీ కృష్ణుడు'. 1980 సెప్టెంబ‌ర్ 12న ఆ సినిమా విడుద‌లైంది. విజ‌య‌నిర్మ‌ల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్ అవ‌కాశం విజ‌య‌శాంతికి అనుకోకుండా ల‌భించింది. నిజానికి ఇందులో మొద‌ట హీరోయిన్‌గా ఎంపిక చేసిన తార స్వ‌ప్న‌. ఆమెతో ఒక‌రోజు షూటింగ్ కూడా జ‌రిపారు. ఆమె అప్ప‌టికే దాస‌రి సినిమా 'స్వ‌ప్న‌'తో ప‌రిచ‌య‌మైంది. ఆమె అస‌లు పేరు మంజులా కౌర్ కాగా, ఆ సినిమాతో ఆమెకు స్వ‌ప్న అని పేరు పెట్టారు దాస‌రి. అయితే కృష్ణ ప‌క్క‌న స్వ‌ప్న బాగుండ‌ద‌ని కృష్ణ‌కు స‌న్నిహిత స్నేహితుడైన గిరిబాబు చెప్పారు. విజ‌య‌ల‌లిత అక్క కుమార్తె హీరోయిన్‌గా బాగుంటుంద‌ని ఆయ‌నే సూచించారు.

స‌రేన‌ని ఆ అమ్మాయిని పిలిపించారు. చూసి, మ‌రీ చిన్న‌పిల్ల‌లా ఉంద‌ని పెద‌వి విరిచేశారు కృష్ణ‌. కానీ విజ‌య‌నిర్మ‌ల‌కు ఆ అమ్మాయి న‌చ్చింది. భ‌విష్య‌త్తులో పెద్ద హీరోయిన్ అవుతుంద‌నిపించి, కృష్ణ‌ను క‌న్విన్స్ చేసి, ఆమెను తీసుకున్నారు. అలా విజ‌య‌శాంతి హీరోయిన్‌గా ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. పైగా కృష్ణ అనుకున్న విధంగానే ఆయ‌న ప‌క్క‌న ఆమె చిన్న‌పిల్ల‌లా క‌నిపించింద‌నే మాట‌లే వినిపించాయి. అయితే విజ‌య‌నిర్మ‌ల ఊహ త‌ప్పు కాలేదు. భ‌విష్య‌త్తులో సూప‌ర్ హీరోయిన్‌గా, లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకొనే రేంజిలో ఆమె ఎదిగారు.

'కిలాడీ కృష్ణుడు' కంటే ముందు విజ‌య‌శాంతి రెండు త‌మిళ సినిమాలు చేశారు. అయిన‌ప్ప‌టికీ న‌ట‌న విష‌యంలో ఆమె ఇంకా ప‌రిణ‌తి చెంద‌లేదు. సెట్‌లో ఉన్న‌ప్పుడు కృష్ణ‌గారు ఎక్కువ‌గా మాట్లాడ‌రు. చాలా సైలెంట్‌గా ఉంటారు. డైలాగులు చెప్ప‌డం రాక‌పోవ‌డంతో నేను ఎక్కువ టేక్స్ తీసుకున్నా చిరాకు ప‌డ‌కుండా ఆయ‌న ఎంతో ఓపిక చూపేవారు. పాట‌ల విష‌యంలోనూ అంతే. స్టెప్స్ వేయ‌డం నాకు కొత్త కావ‌డంతో చాలా కంగారు కంగారుగా ఉండేది. అయినా విజ‌య‌నిర్మ‌ల‌గారు ఏమీ అన‌కుండా న‌న్ను ప్రోత్స‌హించేవారు. కృష్ణ‌గారు న‌ట‌నాప‌రంగా నాకు ఇచ్చిన స‌ల‌హాలు త‌ర్వాత కాలంలో నాకు ఎంతో ఉప‌యోగ‌ప‌డ్డాయి అని చెప్పారు విజ‌య‌శాంతి.

తొలి సినిమాలో కృష్ణ స‌ర‌స‌న హీరోయిన్‌గా చేసిన ఆమె, ఆ త‌ర్వాత ఆయ‌న‌తో చేసిన రెండో సినిమాలో చెల్లెలిగా న‌టించ‌డం గ‌మ‌నార్హం. ఆ సినిమా.. బాపు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'కృష్ణావ‌తారం'. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య‌శాంతి చేసిన ఏకైక చిత్రం అదే. త‌ర్వాత కాలంలో కృష్ణ‌తో ప‌లు హిట్ సినిమాల్లో నాయిక‌గా న‌టించారు విజ‌య‌శాంతి. వాటిలో అగ్నిప‌ర్వ‌తం, నాగాస్త్రం, అశ్వ‌థ్థామ‌, దొంగ‌గారూ స్వాగ‌తం, బ్ర‌హ్మాస్త్రం, కొడుకు దిద్దిన కాపురం త‌దిత‌ర చిత్రాలు ఉన్నాయి. అలాగే విజ‌య‌శాంతి ప్ర‌ధాన పాత్ర పోషించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'ఒసేయ్ రాముల‌మ్మా'లో పోలీస్ ఆఫీస‌ర్‌గా కీల‌క పాత్ర‌ను కృష్ణ చేయ‌డం విశేషం.

(ఈరోజు, జూన్ 24 విజ‌య‌శాంతి పుట్టిన‌రోజు)