Read more!

English | Telugu

60 ఏళ్ల 'మంచి మ‌న‌సులు'.. జీవించి ఉన్న‌ది ఒక్క షావుకారు జాన‌కి!

 

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు క‌థానాయ‌కుడిగా, సావిత్రి, షావుకారు జాన‌కి నాయిక‌లుగా దిగ్ద‌ర్శ‌కుడు ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన 'మంచి మ‌న‌సులు' చిత్రం విడుద‌లై ఏప్రిల్ 11తో 60 ఏళ్లు పూర్త‌య్యాయి. బాబూ మూవీస్ బ్యాన‌ర్‌పై సి. సుంద‌రం ఈ చిత్రాన్ని నిర్మించారు. 'న‌న్ను వ‌దిలి పోలేవులే', 'మావ మావ‌', 'శిల‌ల‌పై శిల్పాలు చెక్కినారు', 'ఓహో ఓహో పావురమా'.. పాట‌లు చాలా పాపుల‌ర్ అయ్యాయి. త‌మిళంలో తాను రూపొందించిన 'కుముదం' చిత్రాన్నే తెలుగులో రీమేక్ చేశారు ఆదుర్తి.

1962 ఏప్రిల్ 11న రిలీజై మంచి విజ‌యం సాధించిన‌ ఈ సినిమాలో ఏఎన్నార్‌, సావిత్రి, జాన‌కిల‌తో పాటు ఎస్వీ రంగారావు, గుమ్మ‌డి, ర‌మ‌ణా రెడ్డి, నాగ‌భూష‌ణం, అల్లు రామ‌లింగ‌య్య‌, సూర్య‌కాంతం, వాసంతి, పొట్టి ప్ర‌సాద్, వంగ‌ర, చిడ‌త‌ల అప్పారావు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు చేశారు. వీళ్లంద‌రిలో ఇప్పుడు జీవించి ఉన్న‌ది ఒక్క షావుకారు జాన‌కి మాత్ర‌మే! ఇటీవ‌లే ఆమె ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని అందుకున్నారు.

అటు త‌మిళ 'కుముందం', ఇటు తెలుగు 'మంచి మ‌న‌సులు'.. రెండింటిలోనూ ఆమె న‌టించారు. ఈ సినిమా గురించి తెలుగువ‌న్‌తో కొన్ని మాట‌లు పంచుకున్నారు జాన‌కి. "ఆదుర్తి గారికి నా మీద మంచి అభిమానం. అందుకే రెండు భాష‌ల్లోనూ ఆ పాత్ర‌ను నాచేత చేయించారు. సావిత్రిగారు లాయ‌ర్‌గా చేశారు. ఏఎన్నార్ గారు ఆమెను పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటారు. కానీ త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో త‌న చెల్లెలి కోసం న‌న్ను పెళ్లి చేసుకుంటారు. నాది గుడ్డి పాత్ర‌. నాకు మంచి పేరు తేవ‌డంతో పాటు, నాకు సంతృప్తినిచ్చింది. నేను చేసిన‌ 'ఓహో ఓహో పావుర‌మా', 'శిల‌ల‌పై శిల్పాలు చెక్కినారు' పాట‌లు బాగా పాపుల‌ర్ అయ్యాయి. ఆ సినిమా చూసి ఇంటికొచ్చాక కూడా ఆ క‌థ గురించి జ‌నం చెప్పుకున్నారు. అలాంటి క‌థ అది. 'మంచి కుటుంబం', 'డాక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి', 'అక్కా చెల్లెళ్లు' కోవ‌కు చెందిన సినిమా 'మంచి మ‌న‌సులు'. 'క‌న్యాశుల్కం'లోని బుచ్చ‌మ్మ క్యారెక్ట‌ర్ కూడా నాకు మంచి పేరు తెచ్చింది. మీరు గ‌మ‌నిస్తే ఏ పాత్ర ప‌డితే ఆ పాత్ర చేయ‌కుండా, ఉన్న‌పేరు చెడ‌గొట్టుకోకుండా పాత్ర‌లు ఒప్పుకుంటూ చేశాను." అని జాన‌కి చెప్పారు.