Read more!

English | Telugu

బ‌ర్త్‌డే స్పెష‌ల్ స్టోరీ: సౌత్ ఇండియా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కెరీర్‌లో టాప్ టెన్ హిట్స్‌!

 

1975లో కె. బాల‌చంద‌ర్ డైరెక్ష‌న్‌లో 'అపూర్వ రాగంగ‌ళ్' మూవీలో స‌పోర్టింగ్ రోల్ చేయ‌డం ద్వారా కెరీర్ ఆరంభించిన ఒక న‌టుడు, అనంత‌ర కాలంలో ఒక్క కోలీవుడ్‌నే కాకుండా ద‌క్షిణ భార‌తావ‌ని అంత‌టా.. ఆ మాట‌కొస్తే దేశ‌వ్యాప్తంగా.. అమేయ‌మైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకొని సూప‌ర్‌స్టార్‌గా ఎదిగిన వైనం అసాధార‌ణం, అపూర్వం. ఆ న‌టుడు ర‌జ‌నీకాంత్‌! 46 సంవ‌త్స‌రాలుగా కెరీర్‌ను కొన‌సాగిస్తూ, 70 ఏళ్ల వ‌య‌సులోనూ 'అణ్ణాత్తే' మూవీతో తిరుగులేని స్టార్‌గా రాణించ‌డం దేశ సినీ చ‌రిత్ర‌లోనే ఓ అరుదైన విష‌యం.

దేశం మొత్తం మీద ఇవాళ జీవించి ఉన్న లెజెండ‌రీ యాక్ట‌ర్ల‌లో ఆయ‌న‌కున్న ఇమేజ్ మ‌రే యాక్ట‌ర్‌కూ లేద‌నేది నిస్సందేహం. ఆయ‌న సినిమా వ‌స్తోందంటేనే.. మాస్ ఆడియెన్స్ పూన‌కం వ‌చ్చిన‌ట్లు ఊగిపోతారు. ఎంత మందిని ఆయ‌న ఇన్‌స్పైర్ చేస్తారో ఊహించ‌లేం. ఫ్లాప‌యిన సినిమా కూడా వంద కోట్ల రూపాయ‌ల‌కు పైగానే వ‌సూళ్లు సాధించ‌డం ఆయ‌న బాక్సాఫీస్ స్టామినాకు నిద‌ర్శ‌నం. డిసెంబ‌ర్ 12 ఆ మ‌హాగొప్ప క‌మ‌ర్షియ‌ల్ స్టార్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న కెరీర్‌లో టాప్ 10 క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ ఏవో ఓ లుక్కేద్దాం...

1. బిల్లా (1980)
క‌మ‌ర్షియ‌ల్‌గా ర‌జ‌నీ కెరీర్‌ దిశ‌ను మార్చిన సినిమాగా 'బిల్లా'ను పేర్కొంటూ ఉంటారు విశ్లేష‌కులు. న‌టుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ఐదేళ్ల‌కు ర‌జ‌నీని స్టార్‌ను చేసిన సినిమా ఇదే. అమితాబ్ బ‌చ్చ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'డాన్‌'కు ఇది రీమేక్‌. థియేట‌ర్ల‌లో ఈ మూవీ 25 వారాల పాటు న‌డిచింది.

2. రాజా చిన్నరోజా (1989)
యానిమేష‌న్ మిక్స్ చేసిన లైవ్ యాక్ష‌న్ మూవీగా వ‌చ్చిన 'రాజా చిన్నరోజా' థియేట‌ర్ల‌లో సిల్వ‌ర్ జూబ్లీ జ‌రుపుకుంది. ఆబాల గోపాలాన్నీ అల‌రించి ర‌జ‌నీకాంత్ టాప్ క‌మ‌ర్షియ‌ల్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది.

3. బాషా (1995)
ద‌క్షిణాది సినిమా బాక్సాఫీస్ చరిత్ర‌ను తిర‌గ‌రాసిన క్లాసిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ 'బాషా'. అనంత‌ర కాలంలో ఎన్ని సినిమాలు 'బాషా' ఫార్మ‌ట్‌లో వ‌చ్చాయో లెక్క‌లేదు. హీరోలు ఆ త‌ర‌హా సినిమాల్లో న‌టించాల‌ని త‌హ‌త‌హ‌లాడితే, ద‌ర్శ‌కులూ ఆ త‌ర‌హా క‌థ‌ల‌ను సృష్టించ‌డానికి వెంప‌ర్లాడుతూ వ‌చ్చారు. ఇప్ప‌టికీ ఎవ‌రికో ఒక‌రికి ఈ సినిమా ఇన్‌స్పిరేష‌న్ క‌లిగిస్తూనే ఉంది. థియేట‌ర్ల‌లో సంవ‌త్స‌రం ఆడిన ఈ సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 38 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేయ‌డం ఆ రోజుల్లో ఏ ర‌కంగా చూసినా అసాధార‌ణం. తెలుగులోనూ ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌రే. ఈ మూవీతో ర‌జ‌నీ ఇమేజ్ ఆకాశానికి ఎగ‌సింది.

4. ముత్తు (1995)
'బాషా' వ‌చ్చిన ఏడాదే వ‌చ్చి త‌మిళంతో పాటు తెలుగులోనూ సూప‌ర్ హిట్ట‌యిన సినిమా 'ముత్తు'. థియేట‌ర్ల‌లో 175 రోజులు ఆడిన ఈ సినిమా, 1998లో జ‌పనీస్ భాష‌లో అనువాద‌మై, ఆ దేశంలో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించ‌డం పెద్ద విశేషం. అందులో ర‌జ‌నీ విన్యాసాలు చూసి జ‌ప‌నీయులు ఆయ‌న‌కు అభిమానులైపోయారు. ర‌జ‌నీ ప్ర‌తి సినిమా జ‌పాన్‌లో విడుద‌ల‌వ‌డానికి పునాదిగా నిలిచింది 'ముత్తు'. ఇప్ప‌టికీ అక్క‌డ హ‌య్యెస్ట్ గ్రాసింగ్ ఇండియ‌న్ ఫిల్మ్ ఇదే.

5. ప‌డ‌య‌ప్పా (1999)
బాక్సాఫీస్ ప‌రంగా ర‌జ‌నీకాంత్ మునుప‌టి రికార్డుల‌నే కాకుండా సౌత్ ఇండియ‌న్ మూవీ రికార్డుల‌ను తుడిచిపెట్టిన సినిమా 'ప‌డ‌య‌ప్పా'. తెలుగులో 'న‌రసింహా'గా రిలీజై, ఇక్క‌డ కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ హోదాను నిలుపుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 44 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన 'ప‌డ‌య‌ప్పా' మూవీ ర‌జ‌నీ ఇమేజ్‌ను మ‌రింత పైకి తీసుకెళ్ల‌డ‌మే కాకుండా, సంక్షోభ స్థితిలో ఉన్న త‌మిళ చిత్ర‌సీమ‌ను గ‌ట్టెక్కించింది.

6. చంద్ర‌ముఖి (2005)
థియేట‌ర్ల‌లో ఏకంగా 890 రోజులు న‌డిచి, ఆ టైమ్‌కు అత్య‌ధిక కాలం ఆడిన సినిమాగా చ‌రిత్ర సృష్టించిన 'చంద్ర‌ముఖి', ప్ర‌పంచ‌వ్యాప్తంగా 90 కోట్ల గ్రాస్‌ను వ‌సూలు చేసి, మ‌రో చ‌రిత్ర‌ను లిఖించింది. ఓ హార‌ర్ కామెడీ జాన‌ర్ సినిమా ఈ రేంజ్ వ‌సూళ్ల‌ను సాధించ‌డం అరుదైన విష‌యం. ఆ రికార్డ్ ర‌జనీకే చెల్లింది.

7. శివాజీ: ద బాస్ (2007)
100 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసిన తొలి సౌత్ ఇండియ‌న్ మూవీగా రికార్డుల‌కెక్కిన 'శివాజీ'.. ఓవ‌రాల్‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసింది. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా త‌యారైన ఈ సినిమా విమ‌ర్శ‌కులను అంత‌గా మెప్పించ‌లేక‌పోయినా ప్రేక్ష‌కుల‌ను అమితంగా అల‌రించి బ్లాక్‌బ‌స్ట‌ర్ హోదాను అందుకుని, ర‌జ‌నీ ఫ్యాన్ బేస్‌ను మ‌రింత పెంచింది.

8. ఎందిర‌న్ (2010)
ఆల్‌టైమ్ హ‌య్యెస్ట్ గ్రాసింగ్ ఇండియ‌న్ ఫిలిమ్స్‌లో చోటు పొందిన 'ఎందిర‌న్' మూవీ మిగ‌తా భాష‌ల్లో 'రోబో'గా రిలీజై అన్ని చోట్లా సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యింది. ఆ టైమ్‌లో దేశంలోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో త‌యారైన సినిమాగా కూడా రికార్డు పుట‌ల్లో స్థానం పొందిన ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 290 కోట్ల‌ను వ‌సూలు చేసి ర‌జ‌నీని పాన్ ఇండియా సూప‌ర్ స్టార్‌గా మ‌రో మెట్టు పైకెక్కించింది.

9. క‌బాలి (2016)
200 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన తొలి త‌మిళ సినిమాగా నిలిచిన 'క‌బాలి', ర‌జ‌నీకాంత్ లెగ‌సీని పున‌ర్లిఖించింది. అన్ని భాష‌ల్లో క‌లిపి ప్ర‌పంచ‌వ్యాప్తంగా 286 కోట్ల రూపాయ‌ల ఓపెనింగ్ వసూళ్ల‌తో ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీని సంభ్ర‌మాశ్చ‌ర్యాల్లో ముంచెత్తిన ఈ సినిమా 'బాహుబ‌లి: ద బిగినింగ్' ఓపెనింగ్స్‌ను కూడా దాటేసింది. ర‌జ‌నీ అత్యుత్త‌మ అభిన‌యాల్లో ఒక‌టి 'క‌బాలి' పాత్ర పోష‌ణ అనేది నిస్సందేహం.

10. 2.0 (2018)
'ఎందిర‌న్‌'ను సీక్వెల్‌గా వ‌చ్చిన '2.0' వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 800 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసి, దేశంలో సెకండ్ హ‌య్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా నిలిచింది. అత్యంత భారీ వ్య‌యంతో త‌యారైన భార‌తీయ సినిమాగా ఇప్ప‌టికీ దీనిదే రికార్డ్‌. అక్ష‌య్‌కుమార్‌ను విల‌న్‌గా చూపించిన ఈ సైన్స్ ఫిక్ష‌న్ సినిమా ఇండియా నుంచి వ‌చ్చిందనేది న‌మ్మ‌లేని నిజం.

2019లో వ‌చ్చిన 'పేట‌', 2020లో వ‌చ్చిన 'ద‌ర్బార్', 2021లో వ‌చ్చిన 'అణ్ణాత్తే' సినిమాలు సైతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 200 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ట్ చేసి ర‌జ‌నీ 45 ఏళ్ల కెరీర్‌ను మ‌రింత సుసంప‌న్నం చేశాయి.