Read more!

English | Telugu

భార్య కోసం పోలీస్‌ గెటప్‌ వేసుకున్న ఈ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

ప్రతి మనిషికీ తన పెళ్ళి విషయంలో ఒక స్థిరమైన అభిప్రాయం ఉంటుంది. తనకు కాబోయే జీవితస్వామి ఎలా ఉండాలి అనే దానిలో ఒక క్లారిటీ ఉంటుంది. అయితే మనం అనుకున్నట్టుగా జీవితంలో ఏదీ జరగదు అని తెలిసినా మన ప్రయత్నాల్ని మాత్రం కొనసాగిస్తాం. పెళ్లి విషయంలో అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అని బాధపడేవారు చాలా మంది ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సతీమణి కూడా ఉంది. పెళ్లికి ముందు తనకు కాబోయే భర్త గురించి ఆమెకు కొన్ని అభిరుచులు ఉన్నాయి. వాటిలో ఒకటి తన భర్త పోలీస్‌ ఆఫీసర్‌ అయి ఉండాలని. కానీ, సంగీత దర్శకుడు భర్తగా వచ్చాడు. 

ఒక సందర్భంలో కీరవాణి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘పోలీస్‌ ఆఫీసర్స్‌గా పనిచేసేవారంటే నా భార్యకు ఎంతో గౌరవం, ఇష్టం. పెళ్లికి ముందు ఒక పోలీస్‌ ఆఫీసర్‌నే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఒకసారి మాటల సందర్భంలో ఈ విషయాన్ని చెప్పింది. ఈ విషయంలో ఎంతో నిరాశగా ఉన్న నా భార్యకు కాస్తయినా సంతోషాన్ని కలిగించాలని నిర్ణయించుకున్నాను. నేను పోలీస్‌ ఆఫీసర్‌ని కాకపోయినా కనీసం ఆ గెటప్‌ వేసుకొని ఆమె మొహంలో సంతోషాన్ని చూడాలనుకున్నాను. వెంటనే ఆర్‌.కె.ఫిలిం అసోసియేట్స్‌లో పనిచేసే మల్లికార్జునరావు అనే మేకప్‌మేన్‌కి విషయం చెప్పాను. ఆయన పోలీస్‌ డ్రెస్‌ కుట్టి ఇచ్చాడు. అంతేకాదు, ఆ యూనిఫామ్‌ వేసుకున్న తర్వాత మేకప్‌ కూడా చేశారు. ఆ గెటప్‌తో వెళ్ళి నా భార్యకు షాక్‌ ఇవ్వాలన్నది నా ఆలోచన. ఎలాగూ యూనిఫామ్‌ వేసుకున్నాను కదా అని పక్క గదిలోనే ఉన్న రాఘవేంద్రరావుగారి దగ్గరకు వెళ్లాను. నన్ను ఆ గెటప్‌లో చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. ఫోటోలు కూడా తీయించారు. ఆ గెటప్‌లో ఉన్న నాకు నటించాలని కూడా అనిపించి ఏదైనా పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌ ఉంటే ఇవ్వమని ఆయన్ని అడిగాను. అప్పుడు నాకు ‘ఘరానా బుల్లోడు’ స్టోరీ చెప్పారు రాఘవేంద్రరావుగారు. అందులో ఇన్‌స్పెక్టర్‌ వేషం ఉందని, అది నన్నే చెయ్యమని చెప్పారు. అప్పుడు అదే గెటప్‌తో వెళ్ళి నా భార్యను సర్‌ప్రైజ్‌ చేశాను. ‘ఘరానా బుల్లోడు’ షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యే టైమ్‌కి నేను రికార్డింగ్స్‌తో బాగా బిజీ అయిపోయాను. రాఘవేంద్రరావుగారు ఇచ్చిన పోలీస్‌ వేషం వెయ్యలేకపోయాను’ అని తెలిపారు కీరవాణి.