English | Telugu

ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌.. ఆ టైటిల్‌తో హిట్‌ కొట్టారు.. చిరంజీవి సినిమా మాత్రం ఫ్లాప్‌ అయింది!

ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌.. ఆ టైటిల్‌తో హిట్‌ కొట్టారు.. చిరంజీవి సినిమా మాత్రం ఫ్లాప్‌ అయింది!

ఒకే టైటిల్‌తో పలు మార్లు సినిమాలు నిర్మించిన సందర్భాలు చిత్ర పరిశ్రమలో అనేకం ఉన్నాయి. తెలుగు సినిమా పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇలా టైటిల్స్‌ రిపీట్‌ అవుతూనే ఉన్నాయి. ఆ టైటిల్‌తో వచ్చిన సినిమా సూపర్‌హిట్‌ అవ్వడం వల్ల  కావచ్చు, తాము అనుకున్న కథకి ఆ టైటిల్‌ సూట్‌ అవుతుందని కావచ్చు.. టైటిల్స్‌ మాత్రం రిపీట్‌ చేస్తుండేవారు. అలా మూడు సార్లు రిపీట్‌ అయిన టైటిల్‌ ‘ఆరాధన’. ఒకే టైటిల్‌ మూడు సార్లు, మూడు సినిమాలకు పెట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇది ముగ్గురు టాప్‌ హీరోల సినిమాలకు పెట్టడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్‌.టి.రామారావు, చిరంజీవి ఈ టైటిల్‌తో సినిమాలు చేశారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ముగ్గురు హీరోలూ తమ ఇమేజ్‌ని కూడా పక్కన పెట్టి విభిన్నమైన కథలతో ఈ సినిమాలు చేశారు. 

అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి వచ్చిన దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌.. నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ, అవకాశాలు దొరకలేదు. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు ఇచ్చిన సలహాతో నటుడిగా కాకుండా నిర్మాతగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. తన మిత్రుడు రంగారావుతో కలిసి చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జగపతి పిక్చర్స్‌ పతాకంపై తొలి ప్రయత్నంగా ‘అన్నపూర్ణ’ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఇందులో జగ్గయ్యను హీరోగా ఎంపిక చేశారు. మొదట ఎఎన్నార్‌తోనే ఈ సినిమా చెయ్యాలనుకున్నారు. కానీ, అప్పటికి ఆయన చాలా బిజీగా ఉండడంతో జగ్గయ్యతో చేశారు. రెండో సినిమా కోసం బెంగాలీలో వచ్చిన ‘సాగరిక’ అనే నవల రైట్స్‌ తీసుకున్నారు. ఆ నవలను సినిమాకు అనుగుణంగా మార్చి ‘ఆరాధన’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అప్పటికే ఎఎన్నార్‌ స్టార్‌ హీరో. పౌరాణిక, జానపద, సాంఘిక, భక్తిరస చిత్రాలతో ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. ‘ఆరాధన’ సినిమా విషయానికి వస్తే.. ఇందులో హీరో అంధుడు. అప్పటివరకు రొమాంటిక్‌ హీరోగా చేసిన ఎఎన్నార్‌ని ఆ పాత్రలో ప్రేక్షకులు చూస్తారా అనే సందేహం అందరికీ కలిగింది. తను చేసే సినిమాలో బలమైన కథ ఉండాలని నమ్మే అక్కినేని.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. వి.మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సావిత్రి హీరోయిన్‌గా నటించారు. జగ్గయ్య ఓ కీలక పాత్ర పోషించారు. 1962 ఫిబ్రవరి 16న విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. 

ఇక ఎన్టీఆర్‌ ‘ఆరాధన’ విషయానికి వస్తే.. హిందీలో రాజేంద్రకుమార్‌, మాలా సిన్హా జంటగా రామానంద్‌ సాగర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘గీత్‌’ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. 1970లో విడుదలైన ‘గీత్‌’ ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్‌హిట్‌ అయ్యాయి. బి.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో ఎ.పుండరీకాక్షయ్య ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చెయ్యాలనుకున్నారు. అయితే మొదట ఈ సినిమాలో నటించేందుకు ఎన్టీఆర్‌ అంగీకరించలేదు. ఎందుకంటే సెకండాఫ్‌లో హీరో మూగవాడిగా మారతాడు. అతనికి డైలాగులు ఉండవు. డైలాగులు చెప్పకపోతే ఆడియన్స్‌ ఒప్పుకోరన్నది ఆయన అభిప్రాయం. డైలాగులు లేకపోయినా ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగితే చాలా మంచి పేరు వస్తుందని పుండరీకాక్షయ్య చెప్పడంతో ఎన్టీఆర్‌ కన్విన్స్‌ అయి చేస్తానని చెప్పారు. ఈ సినిమాలో వాణిశ్రీ హీరోయిన్‌గా నటించారు. ఇందులో కూడా జగ్గయ్య ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ‘గీత్‌’ పాటలనే తెలుగులో రిపీట్‌ చేశారు. ఈ చిత్రంలోని పాటలన్నీ మహ్మద్‌ రఫీ పాడటం విశేషం. 1976 మార్చి 12న విడుదలైన ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి.

1986లో కొండవీటి రాజా, రాక్షసుడు వంటి సూపర్‌హిట్‌ సినిమాలతో మంచి జోరు మీద ఉన్న చిరంజీవి 1987 సంక్రాంతికి దొంగమొగుడుతో మరో బ్లాక్‌బస్టర్‌ని అందుకొని హీరోగా టాప్‌ పొజిషన్‌లో ఉన్నారు. మాస్‌, యాక్షన్‌ హీరోగా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తున్న సమయంలోనే తన ఇమేజ్‌కి భిన్నమైన సినిమా చెయ్యాలనుకున్నారు. అలా ‘ఆరాధన’ చిత్రాన్ని ప్రారంభించారు. గీతా ఆర్ట్స్‌ బేనర్‌పై భారతీరాజా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు అల్లు అరవింద్‌. తమిళ్‌లో సత్యరాజ్‌ హీరోగా ‘కడలోర కవితైగళ్‌’ చిత్రాన్ని తెలుగులో ‘ఆరాధన’గా రీమేక్‌ చేశారు. ఈ సినిమాలో డా.రాజశేఖర్‌ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. భారతీరాజా, రాజశేఖర్‌లతో చిరంజీవి చేసిన ఏకైక చిత్రమిది. ఈ సినిమాలో రాధిక, సుహాసిని హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కోసం ఎన్నుకున్న కథ, బ్యాక్‌డ్రాప్‌, పాత్రల రూపకల్పనలో తెలుగుదనం తగ్గింది. సినిమాలో తమిళ పోకడలు ఎక్కువగా ఉండడంతో అది ప్రేక్షకులకు కనెక్ట్‌ అవ్వలేదు. 1987 మార్చి 27న విడుదలైన ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. 

ఎఎన్నార్‌, ఎన్టీఆర్‌, చిరంజీవి చేసిన ఈ మూడు సినిమాలను పరిశీలిస్తే.. ఒకే టైటిల్‌తో రూపొందినప్పటికీ ఒక సినిమా బెంగాలీ నవల ఆధారంగా, ఒక సినిమా హిందీ సినిమా రీమేక్‌గా, ఒక సినిమా తమిళ సినిమా రీమేక్‌గా చేశారు. అయితే ఈ ముగ్గురు హీరోలు తమ ఇమేజ్‌ని పక్కన పెట్టి అప్పటివరకు చేయని క్యారెక్టర్స్‌ చేయడం విశేషం. ఈ ప్రయత్నంలో ఎఎన్నార్‌, ఎన్టీఆర్‌ విజయాలు అందుకోగా, చిరంజీవి మాత్రం పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే చిరంజీవి ‘ఆరాధన’ చిత్రంలో ఇళయరాజా స్వరపరిచిన పాటలు మాత్రం పెద్ద హిట్‌ అయ్యాయి.