English | Telugu

ఆస్కార్‌ అవార్డు సాధించడం వెనుక చంద్రబోస్‌ కృషి ఇదే!

ఆస్కార్‌ అవార్డు సాధించడం వెనుక చంద్రబోస్‌ కృషి ఇదే!

(మే 10 చంద్రబోస్‌ పుట్టినరోజు సందర్భంగా..)

తెలుగు సినిమాల్లో పాటలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. పాత తరం నుంచి ఇప్పటివరకు ఎందరో గేయ రచయితలు తమ పాటలతో వీనుల విందు చేశారు. అలా 1995లో ‘తాజ్‌మహల్‌’ చిత్రంలోని ‘మంచు కొండల్లోని చంద్రమా..’ పాటతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన గేయ రచయిత చంద్రబోస్‌. ఏ తరహా పాటనైనా అవలీలగా రాయడం ఆయన ప్రత్యేకత. ఇప్పటివరకు 3,300కి పైగా పాటలు రాసి ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాకుండా, తెలుగు పాటకు తొలి ఆస్కార్‌ అవార్డు సాధించిన గేయ రచయితగా ఘన కీర్తి సాధించారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన చంద్రబోస్‌.. సినీ రంగానికి ఎలా వచ్చారు, గేయ రచయితగా ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది వంటి విశేషాల గురించి తెలుసుకుందాం.

1970 మే 10న వరంగల్‌ జిల్లా, చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామంలో నర్సయ్య, మదనమ్మ దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు చంద్రబోస్‌. ఆయన పూర్తి పేరు సుభాష్‌ చంద్రబోస్‌. తండ్రి ఉపాధ్యాయుడు. చాలీచాలని సంపాదనతో జీవనం సాగించేవారు. కుటుంబ పరిస్థితి వల్ల తల్లి పొలం పనులకు వెళ్లేవారు. చిన్నతనంలోనే సంగీతం, సాహిత్యం పట్ల చంద్రబోస్‌కి ఆసక్తి పెరిగింది. దానికి కారణం.. ఇంటి పక్కనే దేవాలయం, గ్రంథాలయం ఉండేవి. గుడిలో తెల్లవారు జాము నుంచే వినిపించే పాటలు చంద్రబోస్‌కి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేవి. అలాగే లైబ్రరీలోని పుస్తకాలు చదవడం వల్ల సాహిత్యం మీద అభిలాష కలిగింది. అప్పుడప్పుడు ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, నాటకాలలో పాల్గొనేవారు చంద్రబోస్‌. గుడిలో జరిగే భజనల్లో పాటలు పాడుతూ ఆ దేవాలయానికి ప్రధాన గాయకుడయ్యారు. ఆ తర్వాత ఊరిలో ఒక సినిమా హాలు కూడా కట్టడంతో అందులో సినిమాలు చూస్తూ పెరిగారు. తన 12వ ఏటనే తొలి పాట రాశారు చంద్రబోస్‌. 

హైదరాబాద్‌లోని జెఎన్‌టియులో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. హైదరాబాద్‌ వచ్చిన తొలి రోజుల నుంచే సింగర్‌గా అవకాశాల కోసం ప్రయత్నించేవారు. ఎవరూ ఛాన్స్‌ ఇవ్వకపోవడంతో పాటల రచయితగా పేరు తెచ్చుకోవాలనుకున్నారు. శ్రీనాథ్‌ అనే స్నేహితుడి సాయంతో దర్శకుడు ముప్పలనేని శివను కలుసుకునే అవకాశం వచ్చింది. అప్పుడు చంద్రబోస్‌లో మంచి రచయిత ఉన్నాడని గుర్తించిన శివ.. ‘తాజ్‌మహల్‌’ చిత్రంలో తొలిసారి పాట రాసే అవకాశం ఇచ్చారు. ‘మంచు కొండల్లోన చంద్రమా..’ అనే పాటతో సినీ గేయ రచయితగా కెరీర్‌ను ప్రారంభించారు చంద్రబోస్‌. ఈ పాటను ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం పూర్తి అయ్యాక రాశారు. ఇంజనీరింగ్‌ పట్టా వచ్చిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా పాటల వైపే మొగ్గు చూపారు. సినిమా రంగంలోకి వెళ్లడం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా పాటల రచయితగానే పేరు తెచ్చుకోవాలనుకున్నారు. అందుకే సంవత్సరం పాటు ఇంటికి వెళ్ళకుండా హైదరాబాద్‌లోనే ఉండిపోయి ప్రయత్నాలు ప్రారంభించారు. 

తాజ్‌ మహల్‌ చిత్రంలోని పాట పెద్ద హిట్‌ అవ్వడంతో ఆ చిత్రాన్ని నిర్మించిన రామానాయుడు తన తర్వాతి చిత్రం ధర్మచక్రంలో ఐదు పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఆ పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. ఆ తర్వాత పెళ్లిసందడి చిత్రంలో ఒక పాట రాసే అవకాశం ఇచ్చారు రాఘవేంద్రరావు. అదే సంవత్సరం తన దర్శకత్వంలో వచ్చిన బొంబాయి ప్రియుడు చిత్రంలో చంద్రబోస్‌తో 5 పాటలు రాయించుకున్నారు. ఈ సినిమా అతనికి చాలా మంచి పేరు తేవడమే కాకుండా వరస అవకాశాలు రావడానికి కారణమైంది. ఆ సమయంలోనే ఒక మ్యాగజైన్‌లో చంద్రబోస్‌ ఫుల్‌ పేజీ ఇంటర్వ్యూ వచ్చింది. అది చూసిన చంద్రబోస్‌ తండ్రి తన కొడుకు సినిమా రంగంలో నిలదొక్కుకుంటున్నాడని గ్రహించారు. వెంటనే ఇంటికి రమ్మని పిలిచారు. అలా సంవత్సరం తర్వాత తన కుటుంబాన్ని కలిశారు చంద్రబోస్‌.

ఒక తరహా సినిమా పాటలకే పరిమితం కాకుండా అన్ని రకాల పాటలు రాయగల గేయ రచయితగా పేరు తెచ్చుకున్నారు చంద్రబోస్‌. సామాజిక స్పృహ ఉన్న పాటలు, స్నేహబంధాన్ని తెలియజెప్పే పాటలు, యువతలో స్ఫూర్తిని నింపే పాటలు, భక్తి పాటలు, ప్రేమ గీతాలు, మానవ సంబంధాలను తెలియజేసే పాటలు, ఫాస్ట్‌ బీట్‌తో సాగే పాటలు.. ఇలా ఏ పాటతోనైనా ఆకట్టుకుంటారు చంద్రబోస్‌. ‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది..’, ‘కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి..’, ‘చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని..’, ‘ట్రెండు మారినా ఫ్రెండ్‌ మారడు..’, ‘పెదవే పలికిన మాటల్లోనే..’, ‘కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా..’, ‘చీరలోని గోప్పదనం తెలుసుకో..’, ‘నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి..’, ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి..’, ‘జైజై గణేషా..’, ‘గుర్తుకొస్తున్నాయి..’.. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించిన పాటలు రాశారు చంద్రబోస్‌. అలా 800 సినిమాల్లో 3,300పైగా పాటలు రాశారు. 

చంద్రబోస్‌ రాసిన పాటలకు ఎన్నో అవార్డులు లభించాయి. ముఖ్యంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకు ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డు లభించింది. అలా తెలుగు పాటకు తొలి ఆస్కార్‌ను సాధించి పెట్టిన ఘనత చంద్రబోస్‌కి దక్కుతుంది. అలాగే ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డు, ఫిలింఫేర్‌ అవార్డులు, భరతముని అవార్డు.. ఇలా అనేక సంస్థల ద్వారా 40 అవార్డులు అందుకున్నారు చంద్రబోస్‌. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే.. ‘పెళ్లిపీటలు’ చిత్రానికి పనిచేస్తున్న సందర్భంలో నృత్యదర్శకురాలు సుచిత్రతో పరిచయమైంది. అది ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో ఇద్దరూ వివాహం చేస్తున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సినీ రంగంలో గేయ రచయితగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చంద్రబోస్‌.. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ ప్రేక్షకుల్ని అలరించే పాటలు అందిస్తూ టాలీవుడ్‌లో ప్రముఖ గేయ రచయితగా కొనసాగుతున్నారు చంద్రబోస్‌.