English | Telugu

రూ.60 వేల కోసం నాలుగు సూపర్‌హిట్‌ సినిమాల నెగెటివ్‌లు తాకట్టు పెట్టిన నిర్మాత!

పాత తరం హాస్య నటుల్లో పద్మనాభంది ఒక విభిన్నమైన శైలి. తన హాస్యంతో దాదాపు 50 సంవత్సరాలు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తారు. నటుడిగానే కాదు, నిర్మాతగా, దర్శకుడిగా, గాయకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్‌.టి.ఆర్‌, సావిత్రి జంటగా రూపొందిన ‘దేవత’ చిత్రం ద్వారా పద్మనాభం నిర్మాతగా మారి ఆ తర్వాత పది సినిమాలు నిర్మించారు. ఒక సినిమాను నిర్మించేంత ఆర్థిక స్తోమత తనకు లేకపోయినా ఇల్లు తాకట్టుపెట్టి భారీ తారాగణంతో ఆ సినిమాను తీశారు. ‘దేవత’ నిర్మాతగా పద్మనాభానికి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తాకట్టులో వున్న ఇల్లును కూడా విడిపించుకున్నారు. మొదటి సినిమానే భారీ తారాగణంతో నిర్మించిన పద్మనాభం ఆ తర్వాత కూడా పెద్ద తారలతోనే సినిమాలు తీసి ఉంటే నిర్మాతగా ఆయన అగ్రస్థానంలో ఉండేవారు. అలా కాకుండా కొత్తదనం కోసం అనేక ప్రయోగాలు చేశారు. అందుకే ఆయన నిర్మించిన సినిమాల్లో కొన్ని సూపర్‌హిట్‌ అవ్వగా, మరికొన్ని ఫ్లాప్‌ అయ్యాయి. 

‘దేవత’  పెద్ద హిట్‌ అవ్వడంతో పద్మనాభం వ్యాపారత్మకంగా ఆలోచించడం మానేసి ప్రయోగాలు చెయ్యాలనుకున్నారు. అంతకుముందు రేలంగి, నగేష్‌ వంటి హాస్యనటులు హీరోలుగా కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తను కూడా వారిలాగే హీరో అవ్వాలనుకున్నారు. ఆ ఆలోచనతోనే తన రెండో ప్రయత్నంగా ‘పొట్టిప్లీడరు’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత తనే హీరోగా ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రాన్ని నిర్మించారు పద్మనాభం. ఈ సినిమా ద్వారా ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంను నేపథ్యగాయకుడిగా పరిచయం చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. 

ఇక నాలుగో సినిమా ‘శ్రీరామకథ’తో పద్మనాభం దర్శకుడిగా మారారు.  1969లోనే ఈ సినిమాను రూ.6 లక్షల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ సినిమా విజయం సాధించకపోవడంతో లక్షన్నర నష్టపోయారు పద్మనాభం. ఈ సినిమా తర్వాత వాణిశ్రీ ప్రధాన పాత్రలో ‘కథానాయిక మొల్ల’ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు లభించింది. ఆ తర్వాత పద్మనాభం హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘జాతకరత్న మిడతంభొట్లు’. ఈ సినిమా ఫ్లాప్‌ అయింది. ఇదే సినిమాను కన్నడ హాస్యనటుడు నరసింహరాజుతో కన్నడలో రీమేక్‌ చేశారు. అక్కడ మాత్రం ఘనవిజయం సాధించింది. పద్మనాభంకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇలా ఒక సినిమా హిట్‌ అయితే, మరో సినిమా ఫ్లాప్‌ అవుతుండడంతో నష్టాల్లోకి జారిపోయారు పద్మనాభం. నిర్మాతగా ఆయన చేసిన ఆజన్మ బ్రహ్మచారి, మాంగల్యభాగ్యం వంటి సినిమాలు ఆర్థికంగా నష్టాలను మిగిల్చాయి. నటుడుగా దర్శకనిర్మాతగా చక్కని హోదాను చూసిన పద్మనాభం చివరి రోజుల్ని పేదరికంలోనే గడిపారు. 

పద్మనాభం చిన్నతనంలో చేసిన ఓ పని అతన్ని జీవితాంతం బాధించింది. అదేమిటంటే.. ఓ అంధుడి కంచంలో రాయివేసి అందులో ఉన్న చిల్లర డబ్బును దొంగిలించారు. ఆ పాపభీతి పెద్దయ్యాక కూడా వెంటాడేది. అందుకే ఆ పాప పరిహారం కోసం ‘లిటిల్‌ ఫ్లవర్‌ బ్లైండ్‌ అండ్‌ డెఫ్‌’ సంస్థకు ఆరోజుల్లోనే రూ.5 వేలు విరాళంగా ఇచ్చారు పద్మనాభం. 

తొలిరోజుల్లో ఎంతో ఉన్నతంగా జీవించిన ఎంతోమంది నటీనటులు చివరి రోజులు కష్టాల్లోనే గడిపారు. పద్మనాభం విషయంలో కూడా అదే జరిగింది. 1975లో ప్రపంచ తెలుగు మహాసభల కోసం రాష్ట్రంలోని కొన్ని పట్టణాల్లో సినీతారలు నాటకాలు వేసి విరాళాలు సేకరించారు. ఆ తర్వాత అవే నాటకాలను మద్రాసులో స్టూడియోలో షూట్‌ చేయించారు పద్మనాభం. ఆ నాటకాలను ‘సినిమా వైభవం’ పేరుతో విడుదల చేశారు. అప్పటికే ఆర్థికంగా నష్టపోయి ఉన్న పద్మనాభం ఈ సినిమా విడుదల కోసం ఓ వ్యక్తి దగ్గర రూ.60 వేలు అప్పు చేశారు. అందుకుగాను ‘దేవత’, ‘పొట్టి ప్లీడరు’, ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’, ‘శ్రీరామకథ’ సినిమాల నెగెటివ్‌లను ఆ వ్యక్తి దగ్గర తాకట్టుపెట్టారు. ఆరు నెలల్లోగా అప్పు తీర్చలేకపోతే ఆ సినిమాల హక్కులను వదులు కోవాలనేది ఒప్పందం. కానీ, ఆ అప్పు తీర్చలేకపోయారు పద్మనాభం. దాంతో ఆ సినిమా రిలీజ్‌ హక్కులను ఆంధ్రా, రాయలసీమ, నైజాంలకు  దాదాపు రూ.3లక్షలకు అమ్మారు. అప్పు తీరిన తర్వాత బ్యాలెన్స్‌ డబ్బు తిరిగి ఇవ్వకపోగా, నెగెటివ్‌లు కూడా ఇవ్వలేదా వ్యక్తి. 1983 వరకు ఈ కేసు కోర్టులోనే నలిగింది. చివరికి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు నెగెటివ్‌లు తిరిగి ఇచ్చేందుకు పద్మనాభం నుంచి లక్ష రపాయలు తీసుకున్నారు.