English | Telugu
వాడి పెళ్లి నా చావుకొచ్చింది.. అనే మాట గిరిబాబు విషయంలో అక్షరాలా నిజమైంది!
Updated : May 14, 2024
జీవితంలో కొన్ని సంఘటనలు ఎంతో తమాషాగా అనిపిస్తాయి. అందులో నిజానిజాలు తెలుసుకునే వరకు అప్పటి వరకు ప్రచారంలో వున్నది వాస్తవమేనని నమ్ముతాం. అలాంటి ఓ తమాషా అయిన విషయం నటుడు గిరిబాబు విషయంలో జరిగింది. గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. సినిమాల కోసం తన పేరును గిరిబాబుగా మార్చుకున్నారు. 1973లో వచ్చిన ‘జగమేమాయ’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. ఇండస్ట్రీకి వచ్చిన నాలుగు సంవత్సరాల్లోనే ‘దేవతలారా దీవించండి’ చిత్రంతో నిర్మాతగా మారారు గిరిబాబు. ఆ తర్వాత కూడా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉంది. కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా వ్యక్తిగతంగా ఓ విషయంలో గిరిబాబు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాజమండ్రిలో ఓ థియేటర్ ఓనర్ అయిన బండారు గిరిబాబు అనే పేరు గల మరో వ్యక్తి సినిమా ఇండిస్ట్రీలోకి అడుగు పెట్టారు. రంగనాథ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘చందన’ పేరుతో ఓ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాలో జయంతి హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే గిరిబాబు, జయంతిల మధ్య ప్రేమ చిగురించింది. ఇదివరకే పెళ్ళయి, పిల్లలున్న గిరిబాబును జయంతి పెళ్లి చేసుకుంది. జయంతికి కూడా ఇదివరకే పేకేటి శివరాంతో పెళ్ళి జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. గిరిబాబు, జయంతిల పెళ్లి వార్త రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇండస్ట్రీలోని చాలా మందికి నిర్మాత గిరిబాబు, నటుడు గిరిబాబు వేర్వేరు అనే విషయం తెలుసు. కానీ, సాధారణ ప్రజలకు ఈ విషయంలో అవగాహన లేకపోవడంతో అందరూ నటుడు గిరిబాబు, జయంతి పెళ్లి చేసుకున్నారని నమ్మేశారు.
ఈ విషయంలో ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకపోయినా ఔట్ డోర్‌కి వెళ్లినపుడు, తమ సొంత ఊరికి వెళ్లినపుడు గిరిబాబుకి ఈ విషయం పెద్ద తలనొప్పిగా మారేది. ఆ గిరిబాబు వేరు, తను వేరు అని చెబితే కొంతమంది నమ్మేవారు, మరి కొంతమంది సినిమా ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకోవడం సాధారణమైన విషయమే కదా అంటూ గిరిబాబు చెప్పేది నమ్మేవారు కాదు. ఒకప్పుడు తిరుపతి వెళ్లిన వారు అటు నుంచి అటే మద్రాస్ వెళ్లి ఎన్టీఆర్, కృష్ణ వంటి హీరోల ఇళ్ళకు వెళ్లి కలుసుకొని వచ్చేవారు. అలా కొంతమంది గిరిబాబు ఇంటికి కూడా వచ్చేవారు. వాళ్ళు కూడా జయంతిగారిని చూసి వెళతాం అని అడిగేవారు. వచ్చిన వారందరికీ అసలు విషయం చెప్పి వారిని ఒప్పించడం గిరిబాబుకి పెద్ద పనిగా మారేది.
ఆ తర్వాత కొన్నిరోజులకు కృష్ణ, జయప్రద జంటగా విజయనిర్మల దర్శకత్వంలో రూపొందిన ‘శంఖుతీర్థం’ చిత్రం షూటింగ్ లొకేషన్‌లో ఓ తమాషా అయిన సంఘటన జరిగింది. షాట్ గ్యాప్‌లో గిరిబాబు, సూర్యకాంతం ఒకేచోట కూర్చున్నారు. మాటల మధ్యలో జయంతి విషయం తీసుకొచ్చారు సూర్యకాంతం. అప్పటివరకు పేకేటి శివరాం దగ్గర చాలా ఇబ్బందులు పడిరదని, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు జాగ్రత్తగా చూసుకో అని జాగ్రత్తలు చెప్పారు. దానికి గిరిబాబు మనసులోనే నవ్వుకొని.. తనకు జయంతి అంటే ఎప్పటి నుంచో ఇష్టమనీ, ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోవడానికి కుదిరింది. మీరు చెప్పినట్టు జాగ్రత్తగానే చూసుకుంటాను అని ఎంతో సిన్సియర్‌గా చెప్పారు. అప్పుడే అక్కడికి వచ్చిన విజయనిర్మల, జయప్రద వారిద్దరూ మాట్లాడుకుంటున్న విషయం గురించి తెలుసుకొని పగలబడి నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాని సూర్యకాంతం అయోమయంగా చూసింది. అప్పుడు అసలు విషయం చెప్పారు విజయనిర్మల. దాంతో ఒక్కసారిగా కోపంగా పైకి లేచి గిరిబాబుపై దాడి చేసారు సూర్యకాంతం. ప్రమాదం గ్రహించిన గిరిబాబు పరుగు లంకించుకున్నారు. అలా సెట్‌లో గిరిబాబు వెంట సూర్యకాంతం పరుగెత్తడం చూసి యూనిట్‌లోని వారంతా నవ్వుకున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే.. గూగుల్‌లో కూడా ‘చందన’ చిత్రానికి దర్శకనిర్మాతగా నటుడు గిరిబాబు పేరు ఉండడమే.