Read more!

English | Telugu

‘మాయాబజార్’ సినిమాకి మొదట అనుకున్న టైటిల్  వేరే అని మీకు తెలుసా?

ఈ విశ్వంలో తెలుగు వారి ఆనవాళ్లు ఉన్నంత కాలం మాయాబజార్  చిత్రం  ఆనవాళ్లు కూడా సజీవంగా ఉంటాయి. తెలుగు సినిమా కీర్తి పతాకంలో ఇమిడిన ఒక అపురూపమైన దృశ్యకావ్యం  మాయాబజార్. ఎవరైనా తమకి నచ్చిన అభిమాన హీరో కోసం ఆ హీరో నటించిన సినిమాని రిపీటెడ్ గా చూస్తారేమో కానీ మాయాబజార్ ని మాత్రం ఆ సినిమా మీద అభిమానంతో చూసిన వాళ్ళు నేటికీ చూస్తున్న వాళ్ళు  కోకోల్లలు. మరి ఇంతటి ఘన కీర్తిని సాధించిన ఈ మాయాబజార్ కి మొదట అనుకున్న టైటిల్ వేరే అని మీకు తెలుసా?

విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బి.నాగిరెడ్డి చక్రపాణి లు నిర్మించిన  సినిమా మాయాబజార్ ని సినిమా అని సంబోధించే కంటే మహా కళాఖండం అని భావించవచ్చు. 1957 లో  దర్శక పితామహుడు కె వి రెడ్డి  దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ నేటికీ  ఎంతో మంది తెలుగు వారి ఇళ్లల్లో మారుమోగిపోతూనే ఉంది. ఎన్టీఆర్ కృష్ణుడిగా, ఏఎన్ఆర్ అభిమన్యుడుగా,ఎస్వీ రంగారావు  ఘటోత్కచుడుగా సావిత్రి  శశిరేఖగా ఇలా హేమాహేమీలు కలిసి ప్రాణ ప్రతిష్ట చేసిన ఈ దృశ్యకావ్యం తెలుగు నటన కి సంబంధించిన ఒక నిఘంటువు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర, ప్రతి మాట,ప్రతి షాట్  ఎందరో  ఔత్సాహిక   దర్శకులకి మార్గదర్శకం.

ఏ సినిమాకైనా టైటిల్ అనేది కొత్తగా పెళ్లి జరుపుకునే వధువరులిద్దరు ఒకరి నెత్తిన ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకునేంత గొప్పది. ఎందుకంటే జీలకర్ర బెల్లం పెట్టుకున్న వధువరులిద్దరికి సగం పెళ్లి అయ్యినట్టుగా భావించి  మీరు చల్లగా ఉండండి అని పెళ్ళికి వచ్చిన వారు ఎలా అయితే అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారో ఒక సినిమాకి పెట్టే మంచి టైటిల్ తో ఆ సినిమా మీద  ప్రేక్షకులు ఒక అంచనాకి వచ్చి  ఆ సినిమాని ఆశీర్వదించడానికి థియేటర్స్ కి వెళ్తారు. ఈ చిత్ర కథ కృషుని అగ్రజుడు అయినటువంటి బలరాముని కుమార్తె శశిరేఖ కళ్యాణం చుట్టు తిరిగే కథ. శశిరేఖ తన చిన్న వయసునుంచే తన మేనమామ అర్జునుడు కొడుకు అభిమన్యుడ్ని ప్రేమిస్తు ఉంటుంది. అభిమన్యుడికి కూడా శశిరేఖ అంటే చాలా ప్రేమ. వారివురుకి  యుక్త వయసు వచ్చాక పెళ్లి చెయ్యాలని ఇరువైపు పెద్దలు భావిస్తారు. ఇలా కొంత కాలం తర్వాత  శశిరేఖ, అభిమన్యులిద్దరు  పెళ్లీడుకి వస్తారు.

ఈ క్రమంలో కౌరవులు పన్నిన కుట్ర వల్ల  పాండవులు తమ ఆస్థి మొత్తాన్ని పోగొట్టుకుంటారు. ఫలితంగా బలరాముడు భార్య రేణుక దేవి తన కూతుర్ని పేదవాడైన అభిమన్యుడికి ఇవ్వడానికి ససేమిరా ఒప్పుకోదు. పైగా బలరాముడ్ని ఒప్పించి దుర్యోధునుడి కొడుకుతో తన కూతురు శశిరేఖ వివాహం జరిపించడానికి  నిశ్చయిస్తుంది. దీంతో కృష్ణుడు తన అన్న  బలరాముడ్ని నొప్పించడం ఇష్టం లేక  ఘటోత్కచుడు సహాయంతో శశిరేఖ ,అభిమన్యుల వివాహాన్ని జరిపిస్తాడు. ఇలా మాయాబజార్ కథ మొత్తం శశిరేఖ వివాహం చుట్టూనే తిరుగుతుంది. దాంతో మాయాబజార్ కి మొదట శశిరేఖ పరిణయం అనే టైటిల్ ని నిర్మాతలు  ఫిక్స్ చెయ్యడం జరిగింది. చిత్ర యూనిట్ మొత్తం  కూడా కథకి సరైన టైటిల్ శశిరేఖ పరిణయం అని భావించారు. ఎన్టీఆర్ ,ఏఎన్ఆర్ లు కూడా ఆ టైటిల్ నే పెట్టమని కేవిరెడ్డి గారికి సజిషన్ చేసారు.  

కానీ  దర్శక పితామహుడు  మాత్రం తన పూర్తి సినిమా స్క్రిప్ట్ ని అవగాహన  చేసుకొని ఉండటం చేత తన సినిమా కథ యొక్క సుష్మాన్ని ఆయన  బాగా పసిగట్టారు. ఈ చిత్ర కథ లోని ప్రతి క్యారక్టర్ ని  గమనిస్తే ఒక్క కృష్ణుడు తప్ప మిగతా  అన్ని క్యారక్టర్ లు కూడా తమ తెలివిని ప్రదర్శించకుండా ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు. అలాగే తమ కళ్ళ ముందు జరిగిందని నిజ నిజాలు తెలుసుకోకుండా నమ్ముతారు  అంటే తమని మాయ ఎటువైపు తీసుకెళ్తే అటు వైపు వెళ్తారు. పైగా మాయ చేసే కృష్ణుడే ఈ కథకి సేనాని. కృష్ణుడు ఏర్పరిచిన మాయ చుట్టు ఈ సినిమా  కథ అంతర్లీనంగా తిరుగుతుంది కాబట్టే  కెవి రెడ్డి ఈ చిత్రానికి మాయాబజార్ అనే టైటిల్ ని పెట్టడం జరిగింది. ఈ  చిత్ర కథ కొన్ని వందల సాంఘిక చిత్రాలకి స్ఫూర్తిగా నిలిచింది. అలాగే ఈ మాయ బజార్ కథకి సంబంధించిన ఇంకో కొసమెరుపు ఏంటంటే మాయబజార్ కథ మొత్తం పాండవులు చుట్టు తిరుగుతుంది. కానీ పాండవులు మాత్రం సినిమాలో ఎక్కడ కనపడరు.