Read more!

English | Telugu

ఎన్టీఆర్, ఏఎన్నార్ లను డామినేట్ చేసిన ఏకైక నటి జయంతి నేడు!

డిసెంబర్ 6 మహానటి సావిత్రి పుట్టిన రోజు. ఆ మహానటి పుట్టి ఈ రోజుకి  సరిగ్గా 89 సంవత్సరాలు. గుంటూరు జిల్లా తెనాలి కి దగ్గరలో ఉన్న చిర్రావూరు ఆమె స్వగ్రామం. ఆమె తల్లితండ్రుల పేర్లు గురవయ్య ,సుభ్రదమ్మ. చిన్న వయసులోనే తల్లితండ్రుల్ని కోల్పోయిన సావిత్రి ఆ తర్వాత తన పెదనాన్న దగ్గరకి చేరింది. ఆయన ప్రోత్సాహంతో సాంప్రదాయ నృత్యాన్ని నేర్చుకున్న సావిత్రి  ఆ తర్వాత నటన మీద మక్కువతో  వీధి నాటకాలు వెయ్యడం ప్రారంభించింది. ఆ సమయంలో సావిత్రి వేసిన ఒక వీధి నాటకాన్ని చూసిన భారతీయ సినిమా అగ్ర నటుడైన పృథ్వీ రాజ్ కపూర్ సావిత్రి నటనని చూసి మెచ్చుకోవడమే కాకుండా ఒక అవార్డు ని బహుకరించాడు. అలాగే సినిమాల్లోకి వెళ్తే మంచి నటివి కూడా అవుతావని ఆశీర్వదించాడు.

సావిత్రి కి కూడా సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా సరే తన ఊరి టూరింగ్ టాకీస్ లో సావిత్రి సినిమాలు చూసేది. అలాగే అక్కినేని నాగేశ్వరరావు ని విపరీతంగా ఇష్టపడే సావిత్రి సినిమాల్లో నటించాలనే ఆశతో తన పెదనాన్నని తీసుకొని చెన్నై వెళ్లి సినిమా ప్రయత్నాలు చెయ్యడం ప్రారంభించింది. 

ఈ క్రమంలో 1950 వ సంవత్సరం లో వచ్చిన సంసారం అనే చిత్రం ద్వారా  సావిత్రి తెలుగు కళామతల్లి ఒడిలో అడుగుపెట్టడం జరిగింది. ఆ సినిమాలో తను హీరోయిన్ కాకపోయినా తన పాత్ర మేరకు చక్కగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ లోనే పెళ్లి చేసి చూడు అనే సినిమాలో నటించింది. ఈ రెండింటిలోను ఎన్టీఆర్ కధానాయకుడుగా చేసాడు. 

ఇక ఆ తర్వాత సావిత్రి చేసినది మామూలు సినిమా కాదు. బహుశా ఈ సినిమాలో చేసేముందు సావిత్రి కూడా అనుకోని ఉండరు.. 100  సంవత్సరాలైనా ఈ సినిమా గురించి అలాగే ఈ సినిమాలోని తన క్యారక్టర్ గురించి చెప్పుకుంటూనే ఉంటారని..ఆ సినిమానే దేవదాసు. పార్వతిగా ఆ సినిమాలో సావిత్రి నటన నభూతో న భవిష్యత్ అన్న విధంగా ఉంటుంది. ఒక దశలో ఆ చిత్ర దర్శకుడుతో చాలా మంది మెచ్యూరిటీ తో కూడుకున్న పార్వతి క్యారక్టర్ ని  సావిత్రి  లాంటి  చిన్న పిల్ల చెయ్యలేదు సినిమా ప్లాప్ అవుతుందని చెప్పినా  కూడా సావిత్రి నటనా శక్తీ మీద ఉన్న నమ్మకంతో  ఆ చిత్ర దర్శకుడు సావిత్రితోనే తెరకెక్కించడం జరిగింది.సినిమా రిలీజ్ అయిన తర్వాత సావిత్రి నటనని చూసి ఆమెని విమర్శించిన వాళ్ళందరు ముక్కు మీద వేలేసుకున్నారు. ఆ సినిమాలో ఏయన్ఆర్ నటనకి ధీటుగా నటించి అందర్నీ మెప్పించింది.

ఇక ఆ తర్వాత వచ్చిన దొంగ రాముడు, మిస్సమ్మ చిత్రాలతో సావిత్రిని అభిమానించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వాటి తర్వాత వచ్చిన మాయాబజార్ సినిమా అయితే ఆ సినిమాలో నటించిన హీరోలకంటే సావిత్రికే ఎక్కువ పేరు వచ్చింది. శశిరేఖగా అలాగే ఘటోత్కచుడు ఆవహించినప్పుడు సావిత్రి ప్రదర్శించిన నటనని చూసి సినీ మేధావులే ఆశ్చర్య పోయారు. ఒక కంటిలో నుంచి కన్నీరు, ఇంకో కంటిలో నుంచి ప్రేమని వ్యక్తం చేసే సన్నివేశంలో సావిత్రి నటనకి దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం దాసోహమయ్యింది. 

ఆ చిత్ర దర్శకుడు కె.వి.రెడ్డి సావిత్రిని ఉద్దేశించి ఇంకో పది తరాల దాకా సావిత్రిని తలదన్నే హీరోయిన్ రాదనీ చెప్పడంతో పాటు తెలుగు సినిమా ఉన్నంత కాలం సావిత్రి గురించి ప్రస్తావనకి వస్తూనే ఉంటుందని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే సావిత్రి పేరు నేటికీ తెలుగు చలన చిత్ర సీమలో మారుమోగిపోతూనే ఉంది. 

ఒక సినిమాలో మాత్రమే సావిత్రి బాగా నటిస్తే ఆ సినిమా పేరు చెప్పుకుంటాం. కానీ అన్ని సినిమాల్లోని పాత్రలకి తను ప్రాణం పోసి నటిస్తే.. ఎన్ని సినిమాల గురించి చెప్పుకుంటాం. ఎవరైనా పుట్టాక నటన నేర్చుకుంటారు కానీ నటనే సావిత్రి దగ్గర నేర్చుకోవడానికి పుట్టిందేమో అనిపిస్తుంది. హీరోలని చూసి థియేటర్ల కి వెళ్లే జనం పలానా సినిమాలో  సావిత్రి ఉందా అని అడిగి మరీ జనం థియేటర్స్ కి వెళ్లే వాళ్ళు. గుండమ్మకథ, దేవత, మూగమనసులు, తోడికోడళ్లు, మాంగళ్య బలం, వెలుగు నీడలు, అప్పుచేసిపప్పుకూడు, సుమంగళి, డాక్టర్ చక్రవర్తి, సుమంగళి, పూజాఫలం ఇలా ఒకటి కాదు ఎన్నో చిత్రాల్లో నటించి సావిత్రిని తల దన్నే నటి లేదని నిరూపించడం తో పాటు కొన్ని లక్షల మంది అభిమానులని సావిత్రి సంపాదించారు.  అలాగే తమిళ, కన్నడ భాషల్లో కూడా తన నటన ద్వారా ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నారు. 

సినిమా పరిశ్రమలో అందరికి ఎదురయినట్టే సావిత్రికి కూడా కొన్ని ఎత్తు పల్లాలు ఎదురయ్యాయి. సావిత్రి బాగా లావుగా ఉన్నారని ఇక సినిమాల్లోకి పనికి రాదని అన్నారు. కానీ అకుంఠ దీక్షతో మళ్ళీ సినిమాల్లో అవకాశాలు పొంది తన ఆకారాన్ని ప్రేక్షకులు పట్టించుకోని విధంగా నటించి తెలుగు సినిమా అంటే సావిత్రి అని అందరు అనుకునేలా చేసింది.

 

సావిత్రి సినిమాలోనే  కరుణరసాన్ని పండించడం కాదు నిజ జీవితంలో కూడా ఎంతో మంది పేదవాళ్ళని ఆదుకొని ఎంతో మందికి డబ్బు సాయం చేసింది. అలాగే తను ఏ సినిమా షూటింగ్ లో ఉండే ఆ సినిమాలో పని చేసే కార్మికులందరికీ తన ఇంటి దగ్గరనుంచి భోజనాలు వండుకొని తీసుకెళ్లేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో ఎన్నో సినిమాల్లో నటించిన సావిత్రి తన సినీ కెరీర్ మొత్తంలో సుమారు 250 కి పైగా సినిమాల్లో నటించింది. అలాగే నిర్మాతగా కూడా కొన్ని సినిమాలని  నిర్మించిన సావిత్రి అప్పటి తమిళనాడు ప్రభుత్వం చేత కలైమామణి అవార్డు అందుకున్న ఏకైక  తెలుగు నటిగా కూడా రికార్డుని నెలకొల్పింది. అలాగే ఆరుసార్లు ఫిలిం ఫేర్ అవార్డుని కూడా గెలుచుకుంది. ఒక పులిని పెంచుకొని పులితో షికార్లు కూడా చేసిన సావిత్రి తన జీవితంలో ఎన్ని దెబ్బలు తగిలినా కూడా పులిలాగే బతికి అనారోగ్య కారణాలతో 19  నెలలు కోమాలో ఉండి చివరికి ఆమె పుట్టిన డిసెంబర్ నెలలోనే  ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.