English | Telugu

'పెళ్ళిచూపులు' కంటే ముందు తరుణ్ భాస్కర్‌తో రీతూవర్మ 'అనుకోకుండా' చేసిందని తెలుసా?

 

విజయ్ దేవరకొండ హీరోగా పరిచయమైన హిట్ ఫిల్మ్ 'పెళ్ళిచూపులు'లో చిత్రగా నటించి యూత్‌ను బాగా ఆకట్టుకుంది రీతూవర్మ. ఆ తర్వాత 'కేశవ', 'టక్ జగదీష్', 'వరుడు కావలెను' చిత్రాల్లో నటించింది. ఇటీవల శర్వానంద్ సినిమా 'ఒకే ఒక జీవితం'లో వైష్ణవి పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకుల్ని మెప్పించింది.

రీతూవర్మ వాళ్ల నాన్నది మధ్యప్రదేశ్. బ్యాంక్ ఆఫీసర్‌గా పనిచేశారు. వాళ్లమ్మ హైదరాబాదీ. టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నారు. ఓ స్కూల్‌కు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. వాళ్లమ్మ పనిచేసిన స్కూల్లోనే రీతు చదువుకుంది. రీతుకు ఓ అక్క ఉంది. చిన్నతనంలో రీతు వాటర్ కలర్స్‌తో పెయింటింగ్స్ వేసేది కూడా. ఇంటర్మీడియేట్ తర్వాత మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ (ఐటీ) చేసింది. ఈలోపు 'మిస్ రోజ్' అందాల పోటీలో పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.

బీటెక్ పూర్తిచేశాక ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వస్తే అందులో జాయినయ్యింది. మరోవైపు మోడలింగ్ స్టార్ట్ చేసింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన తరుణ్ భాస్కర్, తానొక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాననీ, అందులే నటించమనీ అడిగాడు. సరదాగా అందులో నటించింది రీతు. అదే.. 'అనుకోకుండా' అనే షార్ట్ ఫిల్మ్. కేవలం 48 గంటల్లో తీసిన ఆ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో సూపర్ హిట్టయింది. ఆ షార్ట్ ఫిల్మ్ ఆమెకు సినిమా అవకాశాలు తెచ్చింది. వాటిలో జూనియర్ ఎన్టీఆర్ 'బాద్‌షా'ను ఫస్ట్ ఫిలింగా ఎంచుకుంది. అందులో చిన్న పాత్రే అయినా నేర్చుకున్నట్లు ఉంటుందని చేసింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'నా రాకుమారుడు', 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాల్లో నటించింది.

2015లో తరుణ్ భాస్కర్‌కు 'పెళ్ళిచూపులు' మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. హీరోయిన్‌గా అతను రీతునే ఎంచుకున్నాడు. 2016లో రిలీజైన ఆ మూవీ ట్రెండ్ సెట్టర్ అయ్యింది. ఆ మూవీలో రీతు చేసిన చిత్ర పాత్రలో అమ్మాయిలు తమని తాము చూసుకున్నారు. అది రీతు కెరీర్‌కు టర్నింగ్ పాయింట్.

తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. వాటిలో దుల్కర్ సల్మాన్ జోడీగా నటించిన 'కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాడిథాల్' మంచి హిట్టవడమే కాకుండా రీతు నటనకు ప్రశంసలు లభించాయి. తెలుగులో ఆ సినిమా 'కనులు కనులను దోచాయంటే' పేరుతో రిలీజై ఇక్కడా హిట్టయింది.

రీతు ప్రస్తుతం తమిళ ఫిల్మ్ 'ధ్రువ నచ్చత్రమ్' విడుదల కోసం ఎదురుచూస్తోంది. విక్రమ్ హీరోగా నటించిన ఆ సినిమాని గౌతమ్ వాసుదేవ మీనన్ డైరెక్ట్ చేశాడు. నిజానికి ఈ సినిమా 2017లోనే మొదలైనా ఆర్థిక పరమైన కారణాలు సహా అనేక ఇతర కారణాల వల్ల నిర్మాణంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ పూర్తయి, విడుదల కోసం రెడీగా ఉంది. ఈ సినిమా రిలీజైతే తన కెరీర్‌కు మేలు జరుగుతుందని రీతు ఆశిస్తోంది.