Read more!

English | Telugu

'గోపాల గోపాల', 'కాటమరాయుడు' సినిమాల దర్శకుడు డాలీ ఇప్పుడేం చేస్తున్నాడు?

 

కిశోర్ కుమార్ పార్దసాని అలియాస్ డాలీ పుట్టింది విజయవాడలో, పెరిగింది విజయనగరంలో. అమ్మానాన్నలకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు. అందరిలోనూ కిశోర్ చిన్నవాడు. విజయనగరంలో సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నాడు. ధర్మపురి కాలేజీలో ఇంటర్మీడియేట్, మహారాజా కాలేజీలో బీకామ్ చదివాడు. విజయనగరంలోనే ఎం.వి.జి.ఆర్. లా కాలేజీలో లా పూర్తిచేశాడు. కొన్ని రోజులు లాయర్‌గా ప్రాక్టీస్ చేశాడు కూడా.

నిజానికి డాలీ వాళ్లది రాజస్థాన్ నుంచి తరలివచ్చిన కుటుంబం. అందుకే తను హిందీ సినిమాలు ఎక్కువగా చూసేవాడు. వైజాగ్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్ క్రాంతిరెడ్డి (క్రాంతి పిక్చర్స్) వాళ్లకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన లీజుకు తీసుకున్న 3 థియేటర్లలో టికెట్ లేకుండా సినిమాలు చూసేవాడు డాలీ. చాలావరకు సినిమా రిలీజ్ రోజున మార్నింగ్ షో చూసేవాడు. క్రాంతిరెడ్డి సాయంతోటే 1999 ప్రాంతంలో హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. వి.వి. వినాయక్, నల్లమలుపు బుజ్జితో కలిసి రూమ్ షేర్ చేసుకున్నాడు. జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఉండే ఆ రూమ్ కి ఎప్పుడూ కొత్తవాళ్లు వస్తుండేవాళ్లు. అందుకే దాన్ని 'పుష్పక విమానం' అని పిలిచేవారు. డైరెక్టర్ సుకుమార్ కూడా కొన్నాళ్లు ఆ రూమ్ లోనే ఉన్నాడు. ఆ రూమ్ లోనే ఉన్న యోగి, వాసువర్మ, విక్కీ తర్వాత డైరెక్టర్లయ్యారు. 

వినాయక్ దగ్గర ఆది, దిల్, లక్ష్మీ, బన్నీ.. ఇలా చాలా సినిమాలకు స్క్రిప్ట్ వర్క్‌లో డాలీ పాలుపంచుకున్నాడు. శ్రీను వైట్ల దగ్గర 'ఆనందం' మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.

సిద్ధర్థ్, తమన్నా జంటగా నటించగా 2009లో వచ్చిన 'కొంచెం ఇష్టం కొంచెం కస్థం' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు డాలీ. ఆ సినిమా ఫర్వాలేదన్నట్లుగా ఆడింది. బ్రహ్మానందం చేసిన గచ్చిబౌలి దివాకర్ క్యారెక్టర్ బాగా పేలింది. ఆ సినిమా తర్వాత డైరెక్టర్‌గా డాలీకి చాలా అవకాశాలొచ్చాయి. మొదట ఫ్యామిలీ మూవీ తీశాడు కాబట్టి, రెండోది దానికి భిన్నమైన సినిమా తియ్యాలనుకున్నాడు. కానీ నిర్మాతలు తమకు 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' తరహా సినిమా కావాలని అడిగేసరికి అవకాశాలు వదులుకున్నాడు.

నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ను కలిస్తే, తన దగ్గర తెలుగు రీమేక్ రైట్స్ ఉన్న ఓ తమిళ సినిమా చూపించి, దాన్ని తెలుగులో తియ్యమన్నాడు. అలా 'తడాఖా' తీశాడు. కమర్షియల్‌గా మంచి విజయం సాధించిన ఆ మూవీలో సునీల్, నాగచైతన్య అన్నదమ్ములుగా నటించారు. ఆ తర్వాత హిందీ హిట్ ఫిల్మ్ 'ఓ మైగాడ్'ను రీమేక్ చేద్దామని సురేశ్‌బాబు అనడంతో, వైవిధ్యమైన సబ్జెక్ట్ కాబట్టి ఓకే అనేశాడు డాలీ. అదే.. వెంకటేశ్ హీరోగా నటించగా, పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో నటించిన గోపాల గోపాల (2015). అది ప్రజాదరణ బాగానే పొందింది.

ఆ సినిమా రిలీజ్‌కి ముందే మరో సినిమా అతని డైరెక్షన్‌లో చేస్తానని పవన్ కల్యాణ్ అన్నాడు. అన్నట్లే 'కాటమరాయుడు' (2017)ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కాకపోయినా బాగానే ఆడింది. అది.. అజిత్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ తమిళ్ ఫిల్మ్ 'వీరమ్'కు రీమేక్. ఇలా వరుసగా మూడు రీమేక్‌లు తీశాడు డాలీ.

వివాహ బంధం మీద నమ్మకంలేని డాలీ పెళ్లి చేసుకోలేదు. 2009లో డైరెక్టర్‌గా పరిచయమైన అతను ఈ 13 సంవత్సరాల కాలంలో నాలుగంటే నాలుగు సినిమాలు రూపొందించడం, వాటిలో రెండు పవన్ కల్యాణ్‌తో తియ్యడం, అయినా కూడా ఐదేళ్లుగా ఖాళీగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడనే విషయం తెలియాల్సి ఉంది.