Read more!

English | Telugu

తన సినిమాలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన దర్శక మణిహారం.. టి.కృష్ణ 

 

ఎర్రటి సూర్యుడు ఉదయాన్నే ప్రపంచాన్ని ఎలా నిద్రలేపుతాడో ఆయన కూడా తన సినిమాల ద్వారా  నిద్రపోతున్న ప్రపంచాన్ని  నిద్రలేపాడు.మనుషులంతా సమానమే ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదని చెప్పాడు. కులం అనేది ఒక అబద్దం అని రాజకీయనాయకుడు తన స్వార్ధం కోసం కులాల్ని రెచ్చగొట్టి ఎలా అధికారం లో  కూర్చుంటున్నాడో  చెప్పాడు.పేదవాడి కడుపు నిండనప్పుడు ఈ దేశానికి స్వాతంత్య్రం ఎందుకు వచ్చినట్టో చెప్పాడు.పేదవాడు కూడా ఒక మనిషే అని   కార్మిక,పీడిత,బహుజన బలహీన వర్గాల కోసం సినిమాలు తీసాడు. ఇలా తను పుట్టిన సమాజాన్ని నిరంతరం తన సినిమాల ద్వారా జాగృతి వైపు మళ్లించిన  గొప్ప దర్శకుడు ఆయన. ఆయన ఎవరో కాదు కేవలం ఏడుఅంటే ఏడూ సినిమాలతో హిమాలయ శిఖరం అంత కీర్తిని సంపాదించిన  దర్శక శిఖరం టి.కృష్ణ.. పూర్తి పేరు తొట్టెం పూడి కృష్ణకుమార్. ఆయన ఈ రోజు మన మధ్య లేక పోయినా ఆయన సినిమా లు నిరంతరం తెలుగు ప్రేక్షకుల రక్తంలో ప్రవహిస్తూనే ఉన్నాయి. 

టి. కృష్ణ గారి గురించి 1980 వ దశకంలో  తెలియని తెలుగు వాడు లేడు. నేటికీ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్, ఫిడరేల్ క్యాస్ట్రో ,చేగువేరా గురించి తెలిసినట్లే టి.కృష్ణ గారి గురించి కూడా అందరికి తెలుసు.అంతటి పేరుని ఆయన తన సినిమాల ద్వారా సంపాదించాడు. మన దేశానికి స్వతంత్రం వచ్చిన మూడు సంవత్సరాలకి అంటే 1950  ఆగస్టు 1 న టి.కృష్ణ గారు ప్రకాశం జిల్లా ఒంగోలు కి దగ్గరలో ఉన్న కాకుటూరివారి పాలెం లో జన్మించారు. ఆయన  విద్యాబ్యాసం అంతా  తన ఊరి తో పాటు ఒంగోలు లో జరిగింది. మొదటి నుంచి వామ పక్షజాల భావాల్ని కలిగి ఉండే అయన కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ప్రజానాట్య మండలిలో  కొన్ని నాటకాలు కూడా వేశారు. టి కృష్ణ గారికి మొదటి నుంచి కూడా ఈ సమాజంలోని మనుషులకి  ఏదైనా  చెప్పాలని వారు సన్మార్గంలో నడిచేలా చెయ్యాలని అనుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే పేద వారి పై భూస్వామ్య వర్గాల వారి దౌర్జన్యాన్ని కూడా ఆయన సహించేవారు కాదు. అలాగే యువత తన లక్షాన్ని తెలుసుకోలేక చెడు మార్గంలో నడుస్తుందని అలాగే కొంత మంది రాజకీయనాయకులు ఎలా ఈ దేశాన్ని దోచేస్తున్నారు పైకి పెద్ద మనుషుల్లా  కనపడుతూ ఈ దేశాన్ని ఎలా పట్టి పీడిస్తున్నారో అలాగే  ఆడవారి పట్ల  ఎందుకు కొంత మంది మగవాళ్ళు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు నీ తల్లి కూడా ఒక ఆడదే కదా తదితర విషయాలన్నింటిని చిన్నప్పటినుంచే నర నరాన  జీర్ణించుకున్న వాడిలా తాను తీసిన ఏడు సినిమాల్లోనూ కృష్ణ గారు వాటిగురించే చెప్పాడు.

ఇంక తన అన్వేషణని ప్రారంభించి   సినిమా అనే పవితమైన కళ ద్వారానే చెప్పాలని తన ప్రాంతానికే చెందిన ప్రఖ్యాత నటులు దర్శకులు అయినటువంటి మాదాల రంగారావు దగ్గర కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. మాదాల రంగారావు ప్రజానాట్యమండలిలో సభ్యులు కూడా  ఆ పరిచయం తోనే ఆయన దగ్గర చేరారు .సుమారు ఐదు సినిమా లకి కృష్ణ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు 
ఇక సమాజం కోసం రంగంలోకి దిగి  1983  వ సంవత్సరం లో నేటి భారతం అనే సినిమా ని తెరకెక్కించారు. అసలు ఆ రోజుల్లో ఆ పేరు పెట్టడమే పెద్ద సంచలనం అయ్యింది. సినిమా విడుదల అయ్యింది. జనం తండోప తండాలుగా  తిర్నాలకి వెళ్లినట్టుగా ఆ సినిమాకి వెళ్లారు. దాంతో అప్పటి వరకు తెలుగు సినిమా అంటే కమర్షియల్ సినిమా అనే పేరు పోయి సామజిక సినిమా కూడా అవ్వగలదని నిరూపించింది. చట్టాన్ని గౌరవంచి తన సర్వస్వాన్ని కోల్పోయి ఆ తర్వత చట్టం డబ్బున్నవాడికి చుట్టం అని తెలుసున్న మహిళ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని  సంఘవిద్రోహ శక్తులని చంపుతుంది. ఈ పాత్రలో విజయశాంతి అద్భుతంగా నటించింది. ఈ సినిమా క్లైమాక్స్ సీన్ ఈ సినిమాకే హైలట్. ఈ సినిమా ఎన్నో కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకోవడం తో పాటు ఫిలిం ఫేర్ అవార్డు ని అందుకొంది. అలాగే నంది అవార్డ్స్ తో పాటు ఎన్నో ఇతర అవార్డు లు కూడా ఈ సినిమాకి వచ్చాయి. అలాగే బెస్ట్  స్క్రీన్ ప్లే లో కృష్ణ గారు అవార్డు అందుకున్నారు .

ఆ  తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత 1985 లో వరుసగా నాలుగు సినిమాలు ఆయన నుండి వచ్చాయి .అవి  దేశంలో దొంగలు పడ్డారు,దేవాలయం,వందేమాతరం,ప్రతిఘటన సినిమాలు ఇలా వరుసగా వచ్చాయి. ఇక అంతే 1985 వ సంవత్సరం టి.కృష్ణ గారి నామ సంవత్సరం అయ్యింది. తన మొదటి సినిమా హీరో హీరోయిన్ అయిన విజయ శాంతి ,సుమన్ లనే  దేశంలో దొంగలు పడ్డారు సినిమాకి తీసుకున్నారు. ప్రజలు వ్యవస్థలోని లోపల వళ్ళ అలాగే న్యాయం జరుతుందనే నమ్మకం లేక ఎలా దొంగలుగా మారతారు అనే కాన్సెప్ట్ తో ఆ సినిమాని తెరకెక్కించి సమాజంలో పరిస్థితుల్ని చాల క్లియర్ గా చూపించారు. ఆ తర్వాత శోభన్ బాబు హీరోగా వచ్చిన దేవాయలం మూవీ అయితే అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా పోకడల్ని పూర్తిగా మార్చివేసింది. ఒక బ్రాహ్మణుడే నాస్తికుడైతే ఎలా ఉంటుంది మనిషే దేవుడు అని అతను ఎలా చెప్తాడు అనే లైన్ తో ఆ సినిమా తీసి చరిత్ర సృష్టించారు.ఆ సినిమా చూసి తమలో ఉన్న అహాన్ని వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.ఆ తర్వాత రాజశేఖర్ హీరో గా వచ్చిన వందే మాతరం మూవీ కూడా ఒక సంచలనం సృష్టించింది .ఆ సినిమాలోని వందే మాతరం,వందే మాతరం,వందే మాతర  గీతం తరం మారుతున్నది అనే సాంగ్ నేటికీ చాలా చోట్ల మారుమోగిపోతుంది.ఈ పాట పాడిన శ్రీనివాసే ఆ తర్వాత వందేమాతరం శ్రీనివాస్ గా నిలబడిపోయారంటే ఆ పాట కెపాసిటీ అర్ధం చేసుకోవచ్చు. పచ్చని పల్లెటూళ్ళు రాజకీయనాయకుల అధికార స్వార్ధం  వల్ల ఎలా కులమతాల గొడవలతో తగలబడిపోతున్నాయనే కధాంశం తో తెరకెక్కిన ఆ మూవీ విడుదలయిన అన్ని కేంద్రాల్లో విజయవంతమైంది. ఆ తర్వాత వచ్చిన ప్రతిఘటన మూవీ అయితే తెలుగు సినిమా రంగంలో ప్రకంపనలు సృష్టించింది. సమాజాన్ని మంచి దారిలో నడిపించాలనుకునే ఒక టీచర్ ఎందుకు హంతకురాలిగా మారిందనే లైన్ తో తీసిన ఆ సినిమా లో విజయ శాంతి నట విశ్వరూపాన్ని చూడవచ్చు. క్లైమాక్స్ లో విలన్ చరణ్ రాజ్ ని విజయ్ శాంతి చంపటం ఆ సినిమా మొత్తానికే హైలెట్. అలాగే ఆ  సినిమా లోని సాంగ్స్ అన్ని కూడా ఒక ఊపు ఊపాయి .అలాగే నీ తల్లి శరీరంలో ఏమైతే ఉంటాయో వేరే ఆడదాని శరీరం లో కూడా అవే ఉంటాయి అని విజయశాంతి ఒక పాట రూపం లో చెప్పటం నిజంగా చాలా గొప్పగా ఉంటుంది .ఆ తర్వాత  వచ్చిన రేపటి పౌరులు మూవీ కుడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.రేపటి సమాజానికి ఇప్పటి పిల్లలే పునాది మీరే ఈ దేశ భావి పౌరులు అనే కధ తో ఆ సినిమా తెరకెక్కింది.ఇతర బాషలో ఒక సినిమా కి కృష్ణ గారు దర్సకత్వం వహించారు. ఆయన తెలుగులో తెసిన ఆరు సినిమాల్లోనూ విజయ శాంతే కధానాయిక.

ఆయన దురదృష్టశాతవాతు అనారోగ్యంతో 35 ఏళ్ళ వయసులోనే చనిపోయారు. ఆయన ఉండి ఉంటే ఎప్పుడో దారి తప్పిపోయిన ఈ సమాజాన్ని ఆయన సినిమాల ద్వారా బాగుచేసేవాళ్ళేమో. ఓటు విలువు తెలియకుండా ఓటుని అమ్ముకొని రాక్షసులని ,నరహంతకులని, దోపిడీదారుల్ని ఎన్నుకునే ఈ సమజాన్ని మర్చేవారేమో, తమ కులం వాడని మతం వాడని అవినీతి పరులకి ఓట్లు వేసే జనాన్నిమర్చేవాడేమో అలాగే టి.కృష్ణ గారు ఇప్పుడు మన మధ్య లేరు కాబట్టి  ఇప్పుడున్న దర్శకులు అయినా సినిమా అంటే ఏమిటో అర్ధం తెలుసుకొని టి.కృష్ణ గారిలా సామజిక విలువలతో  సినిమాలు తీసి సమాజాన్ని బాగు చెయ్యాలని కోరుకుంటున్నాం. టి.కృష్ణ గారి వారసుడి గా  సినిమా పరిశ్రమలో ఆయన కుమారుడు గోపీచంద్ హీరోగా రాణిస్తూ ఉన్నారు.