Read more!

English | Telugu

పుట్టిన 38 ఏళ్ళకు దాసరి మొదటి బర్త్ డే వేడుకలు.. ఎన్టీఆర్ దగ్గరుండి కేక్ కట్ చేయించారు 

ఎవరి జీవితంలో అయినా మొదట జరుపునే  నిజమైన పండగ ఏంటి అంటే అది వారి పుట్టిన రోజు పండగ మాత్రమే. తమ పుట్టిన రోజు పండగ వస్తుందంటే చాలు ఆ ముందు రోజు  రాత్రి నుంచే వాళ్ళ ఉత్సాహం ఒక లెవెల్లో ఉంటుంది. ఉదయాన్నే లేచి  స్నానం చేసి కొత్త బట్టలు ధరించి తల్లి తండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఫ్రెండ్స్ కి స్వీట్స్ ఇవ్వడం లాంటివి చేస్తారు. అలాగే ఆ రోజు మొత్తం షికార్లు కూడా చేస్తుంటారు. కానీ తెలుగు సినిమాని శాసించిన ఒక వ్యక్తి, తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం తన కీర్తి అజరామరంగా ఉండేలా చేసుకున్న ఒక మహా శక్తీ, ఎంతో మంది సినిమా వాళ్ళకి గురువు అయిన ఒక  వ్యక్తి తను పుట్టిన 38 సంవత్సరాల దాకా పుట్టిన రోజు జరుపుకోలేదు. ఇది నిజం. స్వయంగా ఆయన నోటితో ఆయనే చెప్పిన పచ్చి నిజం.

దాసరి నారాయణ రావు పుట్టుక,జన్మస్థలం,ఆయన చదువు ,నాటకరంగం లో ఆయన సాధించిన విజయాలు, సన్మానాలు తో పాటు హైదరాబాద్ లో అయన చేసిన ఉద్యోగం, పద్మ గారితో పరిచయం, ఆ తర్వాత నటుడు అవ్వాలని మద్రాస్ చేరడం,కుదరకపోవడం, ఆ తర్వాత రచయితగా పనిచెయ్యడం, అక్కడనుంచి దర్శకుడిగా మారి చరిత్ర సృష్టించే సినిమా లు చెయ్యడం లాంటి దాసరి చరిత్ర మొత్తం అందరికి తెలిసిందే. బహుశా భారతీయ సినీ చరిత్రలో హీరోల పూర్తి జీవితం గురించి  తెలుసుకొనే జనం దాసరి చరిత్ర గురించి కూడా తెలుసుకున్నారంటే దాసరి కెపాసిటీ అర్ధం చేసుకోవచ్చు. అలాగే భారతీయ చలన చిత్ర చరిత్రలో ఒక దర్శకుడికి అభిమాన సంఘాలు ఉండటం దాసరితోనే స్టార్ట్ అయ్యింది. హీరోలతో పాటు సమానంగా ఆయనకి అభిమాన సంఘాలు ఉండేవి.
 
ఇంతటి ఘన చరిత్ర ఉన్న దాసరి తనకి 38 సంవత్సరాలు వచ్చే వరకు పుట్టిన రోజు జరుపుకోలేదు. దాసరి నోటివెంట ఆ మాట విన్న ప్రతి ఒక్కరు షాక్ కి గురయ్యారు.ఆయన చెప్పిన మాటల్ని బట్టే దాసరి గారికి ఒక వయసు వచ్చిన దగ్గర  నుంచి నా పుట్టిన రోజు పలానా తారీఖున అని ఆయనకీ తెలుసు కానీ పేదరికం వలన ఆయన పుట్టిన రోజుకి కొత్త బట్టలు వేసుకోవడం కేకు కొయ్యడం చాక్లెట్ లు పంచడం లాంటివి చెయ్యలేదు. అసలు ఆయన పసి పిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా దాసరి పుట్టిన రోజుని ఇంట్లో వాళ్ళు చెయ్యలేదు.

అలాంటిది దాసరి సినిమాల విజృంభణ కొనసాగుతున్న రోజుల్లో ఆయన నుంచి కటకటాల రుద్రయ్య అనే సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో చెన్నై లోని ఆయన ఆఫీస్ ఎప్పుడు కిటకిట లాడుతూ ఉండేది. ఒక రోజు దాసరి ఆ సినిమా షూటింగ్ పేకప్ చెప్పిన తర్వాత దాసరి తన ఆఫీస్ కి వెళ్ళాడు. లోపల ఒక పెద్ద కేక్ ఉండటంతో పాటు ఇళ్ళు మొత్తం ఫుల్ గా డెకరేషన్ కూడా చేసి ఉంది. దాసరికి ఏమి అర్ధం కాలేదు. అక్కడే ఉన్న ఆయన సతీమణి పద్మ, ఆయన శిష్యులు ఒక్కసారిగా హ్యాపీ బర్త్ డే దాసరి నారాయణ రావు గారు అని అనడంతో దాసరికి విషయం అర్ధం అయ్యింది.

ఇక్కడే ఇంకో అద్భుతమైన విషయం కూడా జరిగింది. దాసరి ఇంటికి ఎదురుగా నందమూరి తారక రామారావు ఇల్లు ఉంటుంది. ఒక షూటింగ్ నుంచి ఎన్టీఆర్ తన ఇంటికి వెళ్తుంటే దాసరి ఇంటి దగ్గర హడావిడి చూసి విషయం తెలుసుకొని లోపలకి వెళ్లి దాసరితో "ఏం దాసరి గారు మమ్మల్ని పిలవకుండా పుట్టిన రోజు జరుపుకుంటారా" అని అంటే అప్పుడు దాసరి ఎన్టీఆర్ తో "సార్ నా లైఫ్ లో ఇంతవరకి పుట్టిన రోజు జరుపుకోలేదు పైగా ఈ హంగామా అంత కూడా నాకు తెలియదు. సుమారు 38 ఏళ్ళ తర్వాత ఈ రోజే  పుట్టిన రోజు జరుపుకుంటున్నాను" అని చెప్పారు. ఆ తర్వత ఎన్టీఆరే దగ్గరుండి మరి దాసరి చేత కేకు కోయించి తినిపించారు.

ఏ ముహూర్తాన ఎన్టీఆర్ దాసరి చేత కేకు కోయించారో గాని అప్పటినుంచి దాసరి పుట్టిన రోజు వేడుకలు ఆయన చనిపోయే వరకు ఘనంగా జరిగాయి. ఆయన పుట్టిన రోజు తెలుగు సినీ పరిశ్రమకి పండగ రోజు అయ్యింది. అలాగే  ఆయన ప్రతి పుట్టిన రోజుకి భారత దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులతో పాటు తెలుగు చిత్రరంగం నుంచే కాకుండా భారతీయ సినీ రంగానికి చెందిన హీరోలు, హీరోయిన్ లు అలాగే ఆల్ టెక్నిషియన్స్ దాసరిని కలిసి ఆయనకీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. దాసరి ప్రతి పుట్టిన రోజుకి సుమారు 15 వేల మందికి  తగ్గకుండా భోజనం  ఏర్పాటు చేసేవారు. అన్నట్టు దాసరి పుట్టిన రోజు మే 4. ఆ రోజున తెలుగు చలన చిత్ర దర్శకుల డే కూడా. దాసరి మీద గౌరవంతో మే 4న దర్శకుల దినోత్సవం గా జరుపుకుంటారు.