Read more!

English | Telugu

అమ్మ మంద‌లించింద‌ని తుంట‌రిప‌ని చేసి చిన్న‌ప్పుడే ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నారు!

 

"నేను బ‌ల‌హీన‌మైన పాట‌లు రాశానేమో కానీ, ఒక్క చెడ్డ‌పాట కూడా రాయ‌లేదు" అని ఒక సంద‌ర్భంలో చెప్పారు సీతారామ‌శాస్త్రి. అక్ష‌రాలా ఆ మాట‌లు నిజాలు. ఆయ‌న తండ్రి చెంబోలు వెంక‌ట‌యోగి. హోమియో వైద్యుడు. ఆయ‌న‌ ప‌ద‌మూడు భాష‌ల్లో.. అందులోనూ రెండు విదేశీ భాష‌ల్లో నిష్ణాతులు. ఆయా భాష‌ల్లో విద్యార్థుల‌కు ట్యూష‌న్లు చెప్ప‌గ‌లిగినంత ప్ర‌తిభావంతులు. 1955 మే 20న సీతారామ‌శాస్త్రి జ‌న్మించారు. అప్పుడు తండ్రికి 19 ఏళ్లు, త‌ల్లి సుబ్బ‌ల‌క్ష్మికి 17 ఏళ్లు. త‌ల్లితండ్రుల‌కు ఆయ‌నే పెద్ద‌కుమారుడు. ప‌దేళ్ల‌కే తండ్రి నుంచి సంస్కృత భాష‌ను ఔపోస‌న ప‌ట్టారు శాస్త్రి.

చిన్న‌ప్పుడు చంద‌మామ పుస్త‌కాలు బాగా చ‌ద‌వ‌డం వ‌ల్ల అమ్మ అంటే దేవ‌త అనీ, అమృత హ‌స్తాల‌తో ఉంటుంద‌నే భావ‌న‌లో ఉండేవారాయ‌న‌. పిల్ల‌లు అల్ల‌రి ప‌నులు చేస్తుంటే అమ్మ కోప్ప‌డ‌కుండా ఉండ‌దు క‌దా. అలా ఒక‌సారి అమ్మ మంద‌లించింద‌ని ఈయ‌న ఏదో తుంట‌రి ప‌ని చేశారు. దాని ప‌ర్య‌వ‌సానంగా హాస్పిట‌ల్ పాల‌య్యారు కూడా. రెండు రోజుల పాటు స్పృహ‌లేకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆ రెండు రోజులూ వాళ్ల నాన్న‌గారు కంటికి కునుక‌నేది లేకుండా శాస్త్రి ప‌డుకుని ఉన్న మంచం చుట్టూ తిరుగుతూ, ఎప్పుడు గండం గ‌డిచి బ‌య‌ట‌ప‌డ‌తాడా అని ఆదుర్దా ప‌డుతూ వ‌చ్చారు.

Also read:  సీతారామ‌శాస్త్రి చేతిరాత‌.. 'కంచె'లోని పాట‌!

శాస్త్రికి స్పృహ వ‌చ్చాక తండ్రి చెప్పారు, "అరే అబ్బాయ్‌.. అమ్మంటే క‌థ‌ల్లో రాసివున్న‌ట్లుగా, ఊహ‌ల్లో ఊహించుకున్న‌ట్లుగా ఉండ‌దు. అమ్మ కూడా మామూలు మ‌నిషే. అమ్మ‌త‌నం అంటే క‌నిపించేదీ, వినిపించేదీ కాదురా.. అనిపించేది! రెండు రోజులుగా నువ్వు హాస్పిట‌ల్లో ప‌డుకొని వుంటే, మీ అమ్మ ఒక్క చుక్క నీళ్లు కూడా తాగ‌కుండా విల‌విల‌లాడుతూ ఉంద‌ని నీకు తెలీదు. నువ్వు ఇంటికి వెళ్లాక కూడా 'చాల్లేరా వెధ‌వ ప‌ని' అని అంటుందే కానీ, నిన్ను గుండెల‌కు హ‌త్తుకొని సినిమాల్లో లాగా డైలాగులు చెప్ప‌దు. మామూలు అమ్మ‌లు ఇలాగే ఉంటారు" అని. ఆ త‌ర్వాత కాలంలో ఒక పాట‌లో తాను అమ్మంటే ఎవ‌రంటే చూపించే వేలుంటే, ఆ వేలుకి తెలిసేనా అమ్మంటే అనే మాట‌లు రాశాన‌ని సీతారామ‌శాస్త్రి చెప్పుకున్నారు.