Read more!

English | Telugu

పెళ్లి తర్వాత ఊపందుకున్న కెరీర్‌.. ఇక‌ముందూ అభిమానిస్తారా ఆడియెన్స్‌?

 

నాగ‌చైత‌న్య‌తో పెళ్లి తర్వాత సమంత కెరీర్ మరింత ఊపందుకోవ‌డం మ‌నం చూశాం. మొదట రాంచరణ్‌తో నటించిన ‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. రామలక్ష్మి పాత్రలో సమంత నటన అందర్నీ ఆకట్టుకుంది. ‘మహానటి’లో సావిత్రి కథను చెప్పే జర్నలిస్టు మధురవాణిగా ఆకట్టుకుంది. ‘యు టర్న్’లో రచన కేరెక్టర్‌ను చాలా బాగా చేసిందనే పేరు తెచ్చుకుంది.
 
ఇక నాగచైతన్యకు మూడు ఫ్లాపుల తర్వాత దక్కిన విజయం ‘మజిలీ’లో సమంత పాత్ర ప్రాధ్యాన్యం ఏమిటో తెలిసిందే. ఆమె చేసిన మధ్యతరగతి గృహిణి శ్రావణి పాత్రలో స్త్రీ ప్రేక్షకులు తమను తాము చూసుకున్నారు. ఆ సినిమాకు ఘన విజయం సాధించి పెట్టారు. ఆ సినిమా సమయంలోనే తమిళంలో వచ్చిన ‘సూపర్ డీలక్స్’ సినిమాలో సమంత నటనకు విమర్శకులు మూకుమ్మడిగా బ్రహ్మరథం పట్టారు.

నందినీరెడ్డి డైరెక్ష‌న్‌లో చేసిన 'ఓ బేబీ' మూవీ న‌టిగా స‌మంత‌ను మ‌రో మెట్టు పైకి తీసుకెళ్లింది. కొరియ‌న్ మూవీ 'మిస్ గ్రానీ'కి అఫిషియ‌ల్ రీమేక్ అయిన 'ఓ బేబీ'లో స‌మంత ప‌ర్ఫార్మెన్స్‌కు దాసోహం కాని వాళ్లు లేరు. త‌మిళ ఫిల్మ్ '96' రీమేక్ 'జాను' సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ, టైటిల్ రోల్‌లో స‌మంత న‌ట‌న విమ‌ర్శ‌కుల్ని బాగా మెప్పించింది.

తొలిసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై హోస్ట్‌గా 'సామ్ జామ్' అనే టాక్ షోతో అల‌రించింది స‌మంత‌. అలాగే రాజ్ అండ్ డీకే రూపొందించిన వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో త‌మిళ్ ఈల‌మ్‌కు చెందిన టెర్ర‌రిస్ట్ రాజీగా గొప్ప‌గా రాణించింది. టాలీవుడ్‌లో ఒక నటి పెళ్లికి ముందు ఎంత డిమాండ్ కలిగి ఉందో, పెళ్లి తర్వాతా అంతే డిమాండ్ పొందడం మొదటిసారి చూశాం. క‌రెక్టుగా చెప్పాలంటే, పెళ్లికి ముందటి కంటే పెళ్లి త‌ర్వాతే నటిగా ఆమె కీర్తి మరింత పెరుగుతూ వచ్చింది.

ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. నాగ‌చైత‌న్య‌తో స‌మంత విడిపోయింది. అక్టోబ‌ర్ 2న తాము భార్యాభ‌ర్త‌లుగా విడిపోతున్న‌ట్లు ఇద్ద‌రూ అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో స‌మంత కెరీర్ ఎలా ఉండ‌బోతోంద‌నే క్యూరియాసిటీ ఆమె అభిమానుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఆమె గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పౌరాణిక చిత్రం 'శాకుంత‌లం' పూర్తిచేసింది. త‌మిళంలో విఘ్నేశ్ శివ‌న్ డైరెక్ష‌న్‌లో 'కాదు వాకుల రెండు కాద‌ల్' మూవీని చేస్తోంది.

కాగా చైతూతో విడిపోయాక ఆమె రెండు లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్‌ను అంగీరించింది. రెండూ తెలుగు-త‌మిళ ద్విభాషా చిత్రాలే. అయితే వైవాహిక బంధం విచ్ఛిన్న‌మ‌య్యాక స‌మంత‌ను ఆడియెన్స్ ఇదివ‌ర‌క‌టిలా ఆద‌రిస్తారా? ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను ప‌ట్టించుకోకుండా, యాక్ట‌ర్‌గా ఆమెను ఇదివ‌ర‌క‌టిలా అభిమానిస్తారా? అనేవి ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ప్ర‌శ్న‌లు. కాల‌మే వీటికి జ‌వాబిస్తుంది.