Read more!

English | Telugu

సినిమాలో కొడుక్కి కొరివి పెట్టడాన్ని త‌ప్పించుకున్నారు కానీ..!

 

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు 2010లో ఫాదర్స్‌డే తీరని విషాదాన్ని మిగిల్చింది. ప్రపంచవ్యాప్తంగా అందరు కొడుకులు ఫాదర్స్‌డే జరుపుకుంటుంటే కోట మాత్రం పుట్టెడు పుత్రశోకంలో మునిగిపోయారు. ఆయన కుమారుడు కోట‌ ప్రసాద్ జూన్ 20 (ఫాద‌ర్స్ డే) హైదరాబాద్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. భార్యాపిల్లల్ని కారులో రమ్మని చెప్పి అంత‌కు కొద్ది రోజుల క్రిత‌మే కొనుగోలు చేసిన కొత్త స్పోర్ట్స్ బైక్‌పై శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని నోవాటెల్‌కు లంచ్ చేసే నిమిత్తం వెళ్తున్న ఆయనను లారీ ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయారు. తలకు, కాళ్లకు తీవ్రగాయాలైన ఆయనను స్థానికులు సమీపంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కోటకు ప్రసాద్ ఒక్కరే కొడుకు కాగా ఇద్దరు కుమార్తెలున్నారు. 

అదివ‌ర‌కు రెండు సినిమాల్లో న‌టించిన ప్రసాద్, ఆ టైమ్‌లోమూడో మూవీ 'గాయం-2'లో నటిస్తున్నారు. జగపతిబాబు హీరోగా జె.డి. చక్రవర్తి డైరెక్ట్ చేసిన 'సిద్ధం' సినిమాలో సలీం అనే నెగటివ్ పాత్రతో తొలిసారి ప్రేక్షకులకు పరిచయమయ్యారు ప్రసాద్‌. ఆ పాత్ర పోషణతో ఆయన ప్రేక్షకుల అభినందనలే కాక విమర్శకుల ప్రశంసలూ చూరగొన్నారు. నిజానికి ఆయన మొదట ముఖానికి రంగేసుకున్నది 'వీడు వాడు ఇంకొకడు' అనే సినిమాకి. సీనియర్ రచయిత దివాకర్‌బాబు కుమారుడు శ్రీకర్‌బాబు నటించి, రూపొందించిన సినిమా అది. 

'గాయం-2'లో నిజ జీవిత పాత్రల్నే కోట శ్రీనివసరావు, ప్రసాద్ పోషించ‌డం గమనార్హం. ఇందులోనూ హీరో జగపతిబాబే. ఆ సినిమాలో ప్ర‌సాద్‌ పాత్ర చనిపోతుంది. ఆ సందర్భంగా వచ్చే కొడుకు భౌతికకాయానికి తలకొరివి పెట్టే సన్నివేశాన్ని చేయడానికి కోట నిరాకరించారు. దాంతో ఆయన డూప్‌తో ఆ సన్నివేశాన్ని తీశారు. అయితే సినిమాలో ఆ సన్నివేశాన్ని అభినయించడాన్ని తప్పించుకున్న కోట నిజ జీవితంలో మాత్రం ఆ సన్నివేశ‌ నుంచి తప్పించుకోలేకపోవడం విషాదంలో విషాదం. 

దుర్ఘటన జరిగినప్పుడు కోట శ్రీ‌నివాస‌రావు బెంగళూరులో ఉన్నారు. వార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన ఆస్పత్రిలో కుమారుడి పార్థివ శరీరాన్ని చూసి కుప్పకూలిపోయారు. ఇక ఫిలింనగర్‌లోని ఆయన ఇల్లయితే శోకసంద్రంగా మారింది. మూడు దశాబ్దాలకు పైగా చిత్రసీమతో కోటకు ఉన్న అనుబంధం వల్ల ఆయనకు హితులు, స్నేహితులు, సన్నిహితులు లెక్కకు మించి ఉన్నారు. వారంతా కోట కుమారుడి మరణ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యారు. అనేక సినిమాల్లో కోటకు అసిస్టెంట్‌గా నటించిన కమెడియన్ బాబూమోహన్ సాయంత్రం నుంచి రాత్రివరకు కోటని ఓదారుస్తూ ఆయనని అంటిపెట్టుకునే ఉన్నారు.