Read more!

English | Telugu

అలనాటి అపురూప దృశ్యం.. రాముడి రూపంలో ఎన్టీఆర్ ని చూసి రేలంగి చెప్పిన మాట!

అయోధ్య రామ మందిరంలో కొలువుదీరనున్న బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. దీంతో భారతదేశవ్యాప్తంగా శ్రీరాముని పేరు మారుమోగిపోతోంది. ఎక్కడ చూసినా రామ నామమే వినిపిస్తోంది. ఈ సందర్భంగా పలువురు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావుని గుర్తు చేసుకుంటున్నారు.

తెలుగువారికి రాముడైనా, కృష్ణుడైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు ఎన్.టి. రామారావు. దేవుడి రూపంలో ఉన్న ఆయన చిత్రపటాలు.. ఎందరో తెలుగువారి ఇళ్లలో పూజలు అందుకుంటాయి. అయితే ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకుంటారని ఎప్పుడో 60 ఏళ్ళ క్రితమే ప్రముఖ హాస్య నటుడు రేలంగి ఊహించారు.

అది 'లవకుశ' చిత్రం ముహూర్తం రోజు. అక్కడ కోలాహలంగా ఉంది. ఆరోజు ఒక్క ముహూర్తం షాట్ మాత్రమే చిత్రీకరించాలనుకున్నారు దర్శకుడు పుల్లయ్య. రాముని పాత్ర ధారి ఎన్టీఆర్ కు అలంకరణ చేశారు. లైట్స్ ఆన్, కెమెరా స్టార్ట్  అన్నారు దర్శకుడు. ఎన్టీఆర్ రాజసం ఉట్టిపడేలా నడచి వస్తున్నారు. కట్ అన్నారు దర్శకుడు. ఫ్లోర్ అంతా చప్పట్లు. ప్రముఖ హాస్య నటుడు రేలంగి ఆనందం చెప్పనలవి కాదు. గబ గబ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి కౌగలించుకొని… " సాక్షాత్తు శ్రీ రామ చంద్రుడిలా ఉన్నావు. తెలుగు చిత్ర పరిశ్రమలో నీకిక ఎదురులేదు. పౌరాణిక నటుడిగా జేజేలు అందుకుంటావు.." అని హస్త సాముద్రికంలో ప్రవేశం వున్న రేలంగి.. " ఏదీ చెయ్యి చూపు. అబ్బో! నీకు 50 ఏళ్లు దాటిన తర్వాత భారత దేశం గర్వించే గొప్ప జాతకుడవు అవుతావు. అప్పుడు నన్ను గుర్తు పెట్టుకో."  అన్నారు. దర్శకుడు పుల్లయ్య, నటి అంజలీదేవి ఏక కంఠంతో "తథాస్తు" అన్నారు. అదే ఈ అపురూప దృశ్యం. ఇప్పుడు ఈ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా, "నీకు 50 ఏళ్లు దాటిన తర్వాత భారత దేశం గర్వించే గొప్ప జాతకుడవు అవుతావు" అని రేలంగి చెప్పినట్లుగానే ఎన్టీఆర్ ఎవరూ అందుకోలేని స్థాయికి చేరుకున్నారు. ఎన్టీఆర్ కి దాదాపు 40 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు 'లవకుశ'లో నటించారు. అప్పటికే ఆయనకి తిరుగులేని క్రేజ్ ఉండగా.. ఏళ్ళు గడిచే కొద్దీ మహా శిఖరంలా ఎదిగారు. కథానాయకుడిగా, మహానాయకుడిగా చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీలను లిఖించుకున్నారు. తెలుగువారి ఆరాధ్యదైవంగా ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు.